Begin typing your search above and press return to search.

పెళ్లితో ఇంటివాడైన 21,500 కోట్ల ఆస్తిపరుడు 'మిస్టర్ బీస్ట్'

ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన డిజిటల్ క్రియేటర్, వ్యాపారవేత్త జిమ్మీ డొనాల్డ్సన్ (మిస్టర్ బీస్ట్) తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.

By:  Sivaji Kontham   |   22 July 2026 11:00 PM IST
పెళ్లితో ఇంటివాడైన 21,500 కోట్ల ఆస్తిపరుడు మిస్టర్ బీస్ట్
X

ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన డిజిటల్ క్రియేటర్, వ్యాపారవేత్త జిమ్మీ డొనాల్డ్సన్ (మిస్టర్ బీస్ట్) తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. తన సుదీర్ఘకాల ప్రియురాలు థియా బోయ్‌సెన్‌ను ఒక సుందరమైన డెస్టినేషన్‌లో అత్యంత వైభవంగా వివాహమాడి పెళ్లితో ఇంటివాడయ్యారు. తన పెళ్లికి సంబంధించిన అద్భుతమైన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ..ఐ ఫౌండ్ మిసెస్ బీస్ట్.. ఇది నా జీవితంలోనే అత్యంత ఉత్తమమైన రోజు! అంటూ క్యాప్షన్ జోడించారు. ఈ వార్త బయటకు రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు, సెలబ్రిటీల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తగా.. ఈ పెళ్లిని కూడా లైవ్ స్ట్రీమ్ చేస్తాడేమో.. ఇది 100 రోజుల ఛాలెంజ్ లాంటిదా! అంటూ నెటిజన్లు సరదా కామెంట్లతో సందడి చేస్తున్నారు.

డిజిటల్ మీడియా సామ్రాజ్యంలో సరికొత్త రికార్డులను తిరగరాసిన మిస్టర్ బీస్ట్, యూట్యూబ్ చరిత్రలోనే ఎవరికీ సాధ్యంకాని మైలురాళ్లను అధిగమించారు. భారత్‌కు చెందిన దిగ్గజ మ్యూజిక్ కంపెనీ టి-సిరీస్ రికార్డును అధిగ‌మించి ప్రపంచంలోనే అత్యధిక సబ్‌స్క్రైబర్లు కలిగిన నంబర్ 1 క్రియేటర్‌గా నిలిచారు. జూన్ 2026లో ఏకంగా 500 మిలియన్ల (50 కోట్లు) సబ్‌స్క్రైబర్ల మార్కును దాటి ఈ ఘనత సాధించిన ఏకైక వ్యక్తిగత క్రియేటర్‌గా రికార్డు సృష్టించారు. ప్రస్తుతం ఆయన ప్రధాన ఛానెల్‌కు 509 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉండగా మిస్ట‌ర్ బీస్ట్ గేమింగ్.. బీస్ట ఫిలాంత్ర‌పీ వంటి ఇతర అనుబంధ ఛానెళ్లతో కలిపి వందల మిలియన్ల మంది ఫాలోవర్లను కలిగి ఉన్నారు.

యూట్యూబ్ ప్రకటనల కంటే కూడా తన సొంత వ్యాపారాల ద్వారానే బీస్ట్ భారీగా ఆర్జిస్తున్నారు. ఆయన మాతృ సంస్థ `బీస్ట్ ఇండస్ట్రీస్` విలువ దాదాపు 5 బిలియన్ డాల‌ర్లుగా అంచనా విలువ‌ను క‌లిగి ఉండ‌గా.. పేపర్ వేల్యూ ప్రకారం మిస్టర్ బీస్ట్ నికర ఆస్తి విలువ దాదాపు 2.6 బిలియన్ డాల‌ర్లు. ఇది సుమారు 21,500 కోట్లకు స‌మానం. ఆయన స్థాపించిన ఫీస్టేబుల్స్ చాక్లెట్ బ్రాండ్, అమెజాన్ ప్రైమ్‌తో బీస్ట్ గేమ్స్ వంటి భారీ రియాలిటీ షోల ఒప్పందాలు.. ప్రధాన వీడియోల స్పాన్సర్‌షిప్‌ల ద్వారా ప్రతిఏటా 600 మిలియన్ డాల‌ర్ల‌ నుండి 700 మిలియన్ల డాల‌ర్ల‌ (సుమారు 5,000 కోట్లకు పైగా) రాబడిని పొందుతున్నారు.

కేవలం సంపాదించడమే కాకుండా... తన వీడియోల మేకింగ్ కోసం మిస్టర్ బీస్ట్ నీటిలా డబ్బు ఖర్చు చేయడం ఆయన ప్రత్యేకత. ప్రతి వీడియో ప్రొడక్షన్ కోసం 3 మిలియన్ డాల‌ర్ల‌ నుండి 5 మిలియన్ల డాల‌ర్ల వరకు వెచ్చిస్తూ.. వచ్చిన రాబడిలో దాదాపు 90 శాతం భాగాన్ని తదుపరి వీడియోల క్వాలిటీ పెంచడానికే మళ్లీ రీ-ఇన్వెస్ట్ చేస్తారు. సృజనాత్మకమైన కంటెంట్‌తో పాటు కోట్లాది రూపాయల బహుమతులను విజేతలకు అందజేస్తూ.... వైవిధ్యమైన పోటీలతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రేక్షక పాఠకులను, అభిమానులను తన వీడియోలకు కట్టిపడేస్తున్నారు.

వ్యాపారాలు, వినోదంతో పాటు సామాజిక సేవా రంగంలోనూ మిస్టర్ బీస్ట్ తనదైన ముద్ర వేశారు. టీమ్ టియ‌ర్స్ ద్వారా 2 కోట్ల చెట్లను నాటడం,... టీమ్ సీస్ ద్వారా సముద్రాల నుండి 3 కోట్ల పౌండ్ల ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడం వంటి భారీ కార్యక్రమాలను నిర్వహించారు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా 1,000 మంది అంధులకు ఉచితంగా కంటిచూపును ప్రసాదించడం.. ఆఫ్రికా ప్రాంతాల్లో వందలాది తాగునీటి బావులను తవ్వించడం వంటి వినూత్న సేవలతో వేలాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన రియల్ హీరోగా నిలిచారు.