రిలీజ్ ముందే పైరసీలో లీకైనా కలెక్షన్లు కుమ్మేసిన టాప్-5 సినిమాలు
కంటెంట్ బలంగా ఉంటే పైరసీ భూతాన్ని సైతం ఎదిరించి థియేటర్లలో అద్భుతాలు సృష్టించవచ్చని ఈ సినిమాలు నిరూపించాయి.
By: Sivaji Kontham | 4 Aug 2026 4:06 PM ISTభారతీయ చలనచిత్ర పరిశ్రమకు పైరసీ అనేది ఎప్పటి నుంచో పెను శాపంగా మారింది. భారీ బడ్జెట్‌తో ఎంతోమంది శ్రమతో నిర్మించిన సినిమాలు విడుదల కాకుండానే లేదా మొదటి రోజే ఆన్‌లైన్‌లో లీక్ అవ్వడం నిర్మాతలకు పెద్ద దిగ్భ్రాంతిని కలిగిస్తుంటుంది. అయితే ఊహించని రీతిలో పైరసీ బారిన పడి విడుదలకు ముందే లీక్ అయినప్పటికీ.. ప్రేక్షకుల ఆదరణతో థియేటర్లలో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసి వందల కోట్ల వసూళ్లు సాధించిన చిత్రాలు కూడా ఉన్నాయి. కంటెంట్ బలంగా ఉంటే పైరసీ భూతాన్ని సైతం ఎదిరించి థియేటర్లలో అద్భుతాలు సృష్టించవచ్చని ఈ సినిమాలు నిరూపించాయి.
ఈ జాబితాలో మొదటిగా చెప్పుకోవాల్సింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' (2013). ఈ సినిమా విడుదల కాకముందే సగానికి పైగా నిడివి ఉన్న హెచ్‌డీ ప్రింట్ ఆన్‌లైన్‌లో లీక్ అయి నిర్మాతకు గుండె నొప్పిని, టాలీవుడ్ కి బిగ్ షాక్ ని ఇచ్చింది. అయితే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, త్రివిక్రమ్ మాటలు.. పవన్ కళ్యాణ్ మేనరిజమ్‌ను థియేటర్‌లోనే అనుభవించాలని అభిమానులు, సినీ ప్రియులు పెద్ద ఎత్తున థియేటర్లకు తరలివచ్చారు. ఫలితంగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 130 కోట్లకు పైగా గ్రాస్ సాధించి అప్పట్లో ఆల్-టైమ్ ఇండస్ట్రీ హిట్ రికార్డును నెలకొల్పింది.
అదేవిధంగా విజయ్ దేవరకొండ హీరోగా నటించిన హారర్ కామెడీ చిత్రం 'ట్యాక్సీ వాలా' (2018) కూడా విడుదలకు కొన్ని రోజుల ముందే ఎడిట్ చేయని వెర్షన్ లీక్ అయి పెద్ద సంచలనం సృష్టించింది. కానీ నాణ్యమైన మేకింగ్, రాహుల్ సాంకృత్యన్ వినూత్నమైన కథనం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. పైరసీ వేధింపులను తట్టుకుని థియేటర్లలో అడుగుపెట్టిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఫుల్ రన్ లో రూ. 40 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను (రూ. 25 కోట్లకు పైగా షేర్) రాబట్టి భారీ బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది.
విజయ్ (తమిళనాడు సీఎం, టీవీకే అధినేత) నటించిన 'జన నాయగన్' సినిమా పైరసీకి గురై తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నా.. ఏకంగా ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్కును దాటి బాక్సాఫీస్ వద్ద రికార్డు సృష్టించింది. కేరళ బాక్సాఫీస్ వద్ద కూడా సూర్య నటించిన 'కరుప్పు' కలెక్షన్ల రికార్డులను దాటేసి అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా నిలిచింది. పదుల సంఖ్యలో నెగెటివ్ టాక్‌లు, లీక్‌లు ఉన్నా.. విజయ్ స్టార్‌డమ్, కథలోని రాజకీయ ప్రాముఖ్యత ఈ స్థాయి కలెక్షన్లను సాధ్యం చేశాయి.
ఇతర భాషల సినిమాల విషయానికొస్తే.. బహుభాషా చిత్రం 'గ్రేట్ గ్రాండ్ మస్తి' కరణ్ జోహార్ నిర్మించిన బాలీవుడ్ చిత్రం 'ఉడ్తా పంజాబ్' కూడా విడుదలకు ముందే హెచ్‌డీ ప్రింట్లు లీక్ అయి తీవ్ర ఇబ్బందులు పడ్డాయి. అయితే 'ఉడ్తా పంజాబ్' విమర్శకుల ప్రశంసలతో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించింది. అలాగే హాలీవుడ్‌లో 'ది ఎక్స్‌పెండబుల్స్ 3' వంటి చిత్రాలు రిలీజ్‌కు కొన్ని వారాల ముందే లీక్ అయినా.. థియేటర్లలో భారీ ఓపెనింగ్స్ సాధించాయి. ఎంతటి టెక్నికల్ అడ్డంకులు వచ్చినా మంచి కంటెంట్, థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారనడానికి ఈ విజయాలే నిదర్శనం.
