టైటిల్ మార్పుతో సినిమాకు లాభమా? నష్టమా?
వివాదాలు తీవ్రమై విడుదలకు ముందు టైటిల్ మార్చాల్సి వచ్చినప్పుడు ఆ నిర్ణయం సినిమా వ్యాపారాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుందనేది సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ.
By: Srikanth Kontham | 31 Aug 2026 5:00 PM ISTచలనచిత్ర పరిశ్రమలో ఒక సినిమాను ప్రేక్షకుల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రాథమిక సాధనం టైటిల్. కథలోని ఆత్మను ప్రతిబింబించేలా ... కథానాయకుడి పాత్రను ఎలివేట్ చేసేలా శీర్షికలను ఎంచుకోవడం పరిపాటి. అయితే చారిత్రక అంశాలు.. సాంస్కృతిక భావోద్వేగాలు .. మతపరమైన అంశాలతో ముడిపడి ఉన్న పేర్లను ఖరారు చేసినప్పుడు తరచూ వివాదాలు తలెత్తుతుంటాయి. వివాదాలు తీవ్రమై విడుదలకు ముందు టైటిల్ మార్చాల్సి వచ్చినప్పుడు ఆ నిర్ణయం సినిమా వ్యాపారాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుందనేది సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ.
చివరి నిమిషంలో టైటిల్ మార్చడం వల్ల సినిమాకు లభించే ఉచిత ప్రచారం, బజ్ అనూహ్యంగా పెరుగుతాయి. వివాదం కోర్టుల వరకు వెళ్లడం ..కొన్ని వర్గాల నిరసనల కారణంగా మీడియా, సోషల్ మీడియా వ్యాప్తంగా సదరు చిత్రం వార్తల్లో నిలుస్తుంది. దీంతో సాధారణంగా సినిమా వార్తలను పట్టించుకోని సామాన్య ప్రేక్షకులకు కూడా ఆ ప్రాజెక్ట్ గురించి తెలుస్తుంది. ఈ విధంగా లభించిన పబ్లిసిటీ, సినిమా పట్ల ఆసక్తిని రెట్టింపు చేసి తొలిరోజు ఓపెనింగ్స్‌ను పెంచడానికి ఒక రకమైన నెగటివ్ పబ్లిసిటీ గా దోహదపడుతుంది.
అయితే టైటిల్ మార్పు వెనుక ఆర్థిక నష్టం దాగి ఉంటుంది. ప్రాజెక్ట్ ప్రారంభం నుండి కోట్ల రూపాయలు వెచ్చించి చేసిన ప్రమోషనల్ మెటీరియల్, పోస్టర్లు, పబ్లిసిటీ ఫ్లెక్సీలు, టీజర్లు, డిజిటల్ బ్యానర్లు అన్నీ వృథాగా మారిపోతాయి. సరికొత్త పేరుతో మళ్లీ ప్రమోషనల్ కంటెంట్‌ను రీ-డిజైన్ చేసి మార్కెట్లోకి విడుదల చేయడం సమయంతో పాటు నిర్మాణ సంస్థకు అదనపు బడ్జెట్ భారాన్ని మోపుతుంది. మరోవైపు బ్రాండ్ రీకాల్ పరంగా నష్టం జరిగే ప్రమాదం ఉంది.
నెలల తరబడి ఒక పేరుతో ప్రేక్షకుల్లోకి బలంగా వెళ్లిన చిత్రం, ఆకస్మికంగా పేరు మారడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లోని ఆడియన్స్‌లో కొంత గందరగోళానికి దారితీస్తుంది. గతంలో `వాల్మీకి`గా ప్రచారం పొంది చివరి క్షణంలో `గద్దలకొండ గణేష్గా` మారినప్పుడు... `లాహోర్ 1947` చిత్రం `బట్వారా 1947`గా రూపాంతరం చెందినప్పుడు ప్రేక్షకులు కొత్త పేరుకు అలవాటు పడటానికి కొంత సమయం పట్టింది. ప్రమోషన్ కాల వ్యవధి తక్కువగా ఉంటే ఈ ప్రభావం కలెక్షన్లపై పడే అవకాశం ఉంటుంది.
అయినా వివాదాలకు తావులేకుండా కొత్త టైటిల్ తో ముందుకు వెళ్లడం వల్ల సినిమాకు చట్టపరమైన సమస్యలు తొలగిపోతాయి. విడుదలకు అడ్డంకులు తొలగి వివాదం సృష్టించిన వర్గాలు కూడా సంతృప్తి చెందడంతో థియేట్రికల్ రన్‌కు ఎలాంటి ఆటంకాలు ఉండవు. పైగా వివాదం ముగిసిపోయిందనే సానుకూల వాతావరణం బాక్సాఫీస్ వద్ద సినిమాకు రక్షణ కవచంగా మారుతుంది. చివరిగా టైటిల్ మార్పు రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. సదరు చిత్రంలోని కంటెంట్ బలంగా ఉంటే టైటిల్ మార్పు తెచ్చిపెట్టిన పబ్లిసిటీ కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. కానీ కంటెంట్ బలహీనంగా ఉంటే మాత్రం అదనపు ప్రమోషన్ ఖర్చులు నిర్మాతలకు కోలుకోలేని దెబ్బగా మారతాయన్నది అంతే వాస్తవం.
