Begin typing your search above and press return to search.

సినిమా ఫలితాలపై టికెట్ ధరల ప్రభావం!

ప్రస్తుతం థియేట్రికల్ బిజినెస్ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ఒకప్పుడు సినిమా బాగుంటే వసూళ్లు అవే వస్తాయనే నమ్మకం ఉండేది.

By:  Srikanth Kontham   |   23 Jun 2026 8:00 PM IST
సినిమా ఫలితాలపై టికెట్ ధరల ప్రభావం!
X

ప్రస్తుతం థియేట్రికల్ బిజినెస్ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ఒకప్పుడు సినిమా బాగుంటే వసూళ్లు అవే వస్తాయనే నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. కంటెంట్‌తో పాటు థియేటర్ టికెట్ ధరలు కూడా సినిమా జాతకాన్ని మార్చేస్తున్నాయి. ఇటీవలి కాలంలో పెద్ద సినిమాలతో పాటు చిన్న చిత్రాల టికెట్ రేట్లపై కూడా ఇండస్ట్రీ వర్గాల్లో.. ప్రేక్షకుల్లో బలమైన చర్చ నడుస్తోంది. కేవలం ఓపెనింగ్స్ కోసమే చూసే విధానం పరిశ్రమకు ఎంతవరకు లాభదాయకం అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

భారీ బడ్జెట్ సినిమాల పేరుతో టికెట్ ధరలను విపరీతంగా పెంచడం వల్ల వారాంతాల్లో భారీ వసూళ్లు వస్తున్నప్పటికీ దీర్ఘకాలంలో అవి చిత్ర పరిశ్రమకు శాపంగా మారుతున్నాయనే వాదన బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు థియేటర్లకు రావాలంటే టికెట్ రేట్లు, క్యాంటీన్ ఖర్చులు కలిపి పెద్ద ఆర్థిక భారంగా మారుతున్నాయి. దీంతో చాలా మంది ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లకుండా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం వేచి చూసే ధోరణి పెరిగిపోయింది. ఫలితంగా భారీ హైక్స్ ఉన్న కొన్ని పెద్ద సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో లాంగ్ రన్ సాధించలేక బాక్సాఫీస్ వద్ద నష్టాలను చవిచూడాల్సి వస్తోంది.

ఇలాంటి ప్రతికూల ప‌రిస్థితుల్లో టికెట్ ధరలు అందుబాటులో ఉంచితే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో ఇటీవలి కాలంలో కొన్ని సినిమాలు ప్రాక్టికల్‌గా నిరూపించాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది `మా ఇంటి బంగారం చిత్రం గురించి. ఈ చిన్న/మధ్య శ్రేణి సినిమా ఎలాంటి అదనపు హైక్స్ లేకుండా సాధారణ ధరలకే టికెట్లను అందుబాటులో ఉంచింది. దీంతో సాధారణ మధ్యతరగతి కుటుంబాలు ఎలాంటి భారం లేకుండా థియేటర్లకు తరలివచ్చాయి. ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఈ చిత్రం పర్ఫెక్ట్‌గా కనెక్ట్ కావడంతో తక్కువ రేట్లతోనే భారీ ఫుట్‌ఫాల్స్‌ సాధించి బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది.

చిన్న సినిమాలకే కాదు. భారీ పాన్-ఇండియా చిత్రాలకు కూడా ఈ సూత్రం వర్తిస్తుందని `ధురందర్` చిత్రం ఘన విజయంతో నిరూపితమైంది. దేశవ్యాప్తంగా భారీ అంచనాలతో విడుదలైన ఈ పాన్-ఇండియా హిట్ టికెట్ రేట్లను విపరీతంగా పెంచకుండా సాధారణ ధరలకే ప్రేక్షకులకు వినోదాన్ని పంచాలని నిర్ణయించుకుంది. ఈ వ్యూహం సినిమాకు ఊహించని స్థాయిలో ప్లస్ అయింది. సినిమా టాక్ అద్భుతంగా ఉండటం, టికెట్ ధరలు అందరికీ అందుబాటులో ఉండటంతో అన్ని వర్గాల ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. పెద్ద సినిమాలకు కూడా సరసమైన ధరలు ఉంటే రికార్డు స్థాయి వసూళ్లు సాధించొచ్చ‌ని ఈ చిత్రం నిరూపించింది.

ఈ చిత్రాల విజయాలు పరిశ్రమకు ఓ పాఠాన్ని నేర్పుతున్నాయి. సినిమాకు కేవలం మొదటి మూడు రోజుల వసూళ్లు మాత్రమే కాదు. సుదీర్ఘమైన లాంగ్ రన్ అత్యంత ముఖ్యం. టికెట్ ధరలు సామాన్యుడికి అందుబాటులో ఉన్నప్పుడు థియేటర్లలో ఫుట్‌ఫాల్స్ స్థిరంగా పెరుగుతాయి. దీంతో నిర్మాతలే కాకుండా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు , థియేటర్ క్యాంటీన్ నిర్వాహకులు కూడా లాభాల బాట పడతారు. సినిమా ఎక్కువ రోజులు థియేటర్లలో ఆడితేనే చిత్ర పరిశ్రమ మొత్తం ఇకో-సిస్టమ్ బలంగా నిలబడుతుంది.

ఓటీటీల పోటీని తట్టుకుని థియేటర్ల ఉనికిని కాపాడుకోవాలంటే టికెట్ ధరల నియంత్రణ అత్యంత కీలకం. ప్రతి సినిమాకు భారీ హైక్స్ అడగడం కంటే.. సినిమా బడ్జెట్ , టార్గెట్ ఆడియన్స్‌ను బట్టి సహేతుకమైన ధరలను నిర్ణయించడం వల్ల ఎక్కువ మంది ప్రేక్షకులను వెండితెరకు రప్పించొచ్చు. `మా ఇంటి బంగారం`, `ధురందర్` చిత్రాల బాక్సాఫీస్ పయనం భవిష్యత్తులో రాబోయే చిత్రాల మేకర్స్‌కు దిక్సూచిలా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సరసమైన ధరలతోనే సినిమాను ప్రజల వద్దకు తీసుకెళ్లడం సినిమా పరిశ్రమ భవిష్యత్తుకు ఎంతో అవసరం.