కార్పొరేట్ స్ట్రాటజీలా మారిన సినిమా రిలీజ్ ప్లానింగ్!
ఒకప్పుడు సినిమా హిట్ అవ్వాలంటే స్టార్ హీరో, భారీ బడ్జెట్, బలమైన కథ ఉంటే సరిపోతుందని భావించేవారు.
By: Sravani Lakshmi Srungarapu | 20 May 2026 10:00 PM ISTఒకప్పుడు సినిమా హిట్ అవ్వాలంటే స్టార్ హీరో, భారీ బడ్జెట్, బలమైన కథ ఉంటే సరిపోతుందని భావించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రస్తుత బాక్సాఫీస్ ట్రెండ్ చూస్తే హిట్‌కు కథ మాత్రమే కాదు.. టైమింగ్ కూడా సినిమాకు హీరో లాంటిదే అన్న మాట ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. ప్రేక్షకుల అభిరుచులు మారడం, ఓటీటీ ప్రభావం పెరగడం, థియేటర్‌కు వచ్చే ఆడియన్స్ సంఖ్య తగ్గడం వంటి కారణాలతో ఇప్పుడు రిలీజ్ టైమింగ్ సినిమాల విజయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది.
ముఖ్యంగా సరైన సీజన్, సరైన రిలీజ్ విండో దొరికితే చిన్న సినిమాలు కూడా అంచనాలకు మించి వసూళ్లు సాధిస్తున్నాయి. అదే సమయంలో మంచి కంటెంట్ ఉన్న సినిమాలు కూడా రాంగ్ టైమింగ్ వల్ల బాక్సాఫీస్ దగ్గర ఇబ్బందులు పడుతున్న ఉదాహరణలు పెరుగుతున్నాయి. గత కొంతకాలంగా తెలుగు బాక్సాఫీస్ ట్రెండ్‌ను పరిశీలిస్తే ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. గతేడాది వచ్చిన చిన్న సినిమా లిటిల్ హార్ట్స్ అందుకు పెద్ద ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సమ్మర్‌లో స్టార్ హీరోల సినిమాలు లేక ప్రేక్షకులు కొత్త కంటెంట్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఈ సినిమా విడుదలైంది. మంచి ఫ్యామిలీ టాక్ రావడంతో ప్రేక్షకులు థియేటర్లకు భారీగా వచ్చారు. ఫలితంగా చిన్న సినిమాగా రిలీజైన ఈ సినిమా ఊహించని స్థాయిలో వసూళ్లు సాధించింది.
అదే పరిస్థితి ఈ ఏడాది సంక్రాంతి సినిమాల విషయంలో కూడా కనిపించింది. మన శంకర వరప్రసాద్ గారు, అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుమ మురారి లాంటి సినిమాలు పండగ సీజన్ అడ్వాంటేజ్‌ను పూర్తిగా ఉపయోగించుకున్నాయి. సాధారణ రోజుల్లో రిలీజై ఉంటే ఆ సినిమాల ఫలితాలు ఇలాగైతే కచ్ఛితంగా ఉండేవి కావు. ఇటీవల వచ్చిన డెకాయిట్, కరుప్పు సినిమాలు కూడా ఇదే విషయాన్ని మరోసారి నిరూపించాయి. ముఖ్యంగా కరుప్పుకి తెలుగులో మిక్స్‌డ్ నుంచి నెగెటివ్ టాక్ వచ్చినా, థియేటర్లలో సరైన ప్రత్యామ్నాయ సినిమాలు లేకపోవడం దీనికి పెద్ద ప్లస్ అయింది. మిడ్ సమ్మర్‌లో స్టార్ హీరోల సినిమాలు లేక ప్రేక్షకులు థియేటర్ ఎక్స్‌పీరియన్స్ కోసం ఎదురు చూస్తున్న టైమ్ లో ఈ సినిమా రిలీజవడం చాలా బాగా కలిసొచ్చింది. ఫలితంగా తెలుగులో అంచనాలకు మించి ఆడడమే కాక తమిళంలో బ్లాక్‌బస్టర్ రేంజ్‌కి వెళ్లింది.
ఇదే సమయంలో ఇండస్ట్రీలో రిలీజ్ ప్లానింగ్‌ను ఇప్పుడు కార్పొరేట్ స్ట్రాటజీలా చూస్తున్నారు. ఒకప్పుడు షూటింగ్ పూర్తి అయితే వెంటనే రిలీజ్ డేట్ ఫిక్స్ చేసేవారు. ఇప్పుడు మాత్రం వేరే పెద్ద సినిమాలు, సెలవులు, పరీక్షల సీజన్, ఐపీఎల్, ఓటీటీ రిలీజ్‌లు లెక్కలోకి తీసుకుని రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ప్రేక్షకుల మూడ్‌ను అంచనా వేసి సరైన టైమ్‌లో సినిమాను రిలీజ్ చేయడమే ఇప్పుడు సక్సెస్ ఫార్ములాగా మారింది. మొత్తంగా చూస్తే ప్రస్తుత బాక్సాఫీస్ లెక్కలు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు కేవలం కంటెంట్ ఉంటే సరిపోదు, ఆ కంటెంట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే సరైన టైమింగ్ కూడా ఉండాలి. ఈ కొత్త ఫార్ములానే ప్రస్తుతం ఇండస్ట్రీ విజయాలను నిర్ణయిస్తోంది.
