కాన్ఫిడెన్స్ చూపించండి.. ఈ స్టేట్మెంట్లు వద్దు
మంచి సినిమా తీశాం అన్న నమ్మకంతోనో.. లేక సినిమాను ఎలాగోలా జనాల్లోకి తీసుకెళ్లాలి అనే డెస్పరేషన్లోనో.. ఈ మధ్య స్టేజ్ మీద పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడం కామన్ అయిపోయింది
By: Garuda Media | 21 Nov 2025 12:46 AM ISTమంచి సినిమా తీశాం అన్న నమ్మకంతోనో.. లేక సినిమాను ఎలాగోలా జనాల్లోకి తీసుకెళ్లాలి అనే డెస్పరేషన్లోనో.. ఈ మధ్య స్టేజ్ మీద పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడం కామన్ అయిపోయింది. ‘కోర్టు’ సినిమా నచ్చకపోతే తన తర్వాతి సినిమా చూడొద్దంటూ ఈ ఏడాది ఆరంభంలో నాని స్టేట్మెంట్ ఇచ్చాడు. అతణ్ని అనుకరిస్తూ తర్వాత ప్రియదర్శి ‘మిత్రమండలి’ సినిమాకు ఇలాంటి స్టేట్మెంటే ఇచ్చాడు. నాని మాటను నిలబెడుతూ ‘కోర్టు’ హిట్టయింది కానీ.. ‘మిత్రమండలి’ డిజాస్టర్ అయి ప్రియదర్శిని మాటకు విలువ లేకుండా చేసింది.
దీంతో తాను అలా మాట్లాడాల్సింది కాదని ప్రియదర్శి చెప్పుకున్నాడు. ఈ అనుభవం తర్వాత అయినా సినీ జనాలు మారుతారనుకుంటే.. తాజాగా ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా దర్శకుడు సాయిలు చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ సినిమాకు నెగెటివ్ టాక్ వస్తే.. రిలీజ్ రోజు అమీర్ పేటలో కట్ డ్రాయర్ మీద తిరుగుతా అంటూ అతను సవాల్ చేశాడు. ఐతే ఈ సినిమా మీద దర్శకుడికి ఎంత నమ్మకమైనా ఉండొచ్చు.. కానీ ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం అవసరమా అన్నది ప్రశ్న.
ఒక సినిమా దర్శకుడు నేను కట్ డ్రాయర్ మీద తిరుగుతా అనడం వినడానికి చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది కదా? సినిమా మీద నమ్మకాన్ని మరో రకంగా చూపించొచ్చు కానీ.. మరీ శ్రుతి మించిన ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం మాత్రం అనవసరం అనడంలో మరో మాట లేదు. ఇదే ఈవెంట్లో ఈటీవీ విన్ ప్రతినిధి సాయికృష్ణ మాట్లాడుతూ.. తమ సంస్థ నుంచి వచ్చిన ఇతర సినిమాలు, సిరీస్‌ల పేర్లు ప్రస్తావించి అంత మంచి కంటెంట్ ఇచ్చిన తమను కాకుండా ఇంకెవరిని నమ్ముతారు అంటూ చక్కగా తమ కాన్పిడెన్స్‌ను చాటారు. అలా ప్రేక్షకులకు నమ్మకం కలిగేలా పాజిటివ్ కామెంట్స్ చేయాలి కానీ.. ఆ చిత్ర దర్శకుడిలా స్టేట్మెంట్లు ఇవ్వాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదని అతనే కాదు.. అందరూ గుర్తిస్తే మంచిది.
