Begin typing your search above and press return to search.

సినిమాల మధ్య పోలిక: చిత్రసీమకు లాభమా? నష్టమా?

కొత్త సినిమా విడుదల కాగానే ఆ చిత్రాన్ని గతంలో వచ్చిన మ‌రో సూపర్ హిట్‌తోనో? వేరే హీరో సినిమాతోనో? లేదా అదే జోనర్‌కు చెందిన మరో చిత్రంతోనో పోల్చి చూడటం సర్వసాధారణం.

By:  Srikanth Kontham   |   21 Sept 2026 4:00 AM IST
సినిమాల మధ్య పోలిక: చిత్రసీమకు లాభమా? నష్టమా?
X

కొత్త సినిమా విడుదల కాగానే ఆ చిత్రాన్ని గతంలో వచ్చిన మ‌రో సూపర్ హిట్‌తోనో? వేరే హీరో సినిమాతోనో? లేదా అదే జోనర్‌కు చెందిన మరో చిత్రంతోనో పోల్చి చూడటం సర్వసాధారణం. ముఖ్యంగా సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఈ పోలికల ధోరణి మరీ ఎక్కువైంది. టీజర్, ట్రైలర్ విడుదలైన క్షణం నుంచే `ఇది ఆ సినిమా లాగే ఉందే` అంటూ విశ్లేషణలు ప్రారంభమవుతున్నాయి. అయితే ఇలా ఒక సినిమాను మరో సినిమాతో పోల్చడం పరిశ్రమకు, ప్రేక్షకులకు నిజంగా ప్రయోజనకరమా? లేక దానివల్ల నష్టమే ఎక్కువ జరుగుతోందా? అన్నది ఆసక్తికరమైన అంశం.

పోలికల వల్ల కలిగే ప్రయోజనాలను పరిశీలిస్తే ఇది సినిమా ప్రమోషన్‌కు , ప్రేక్షకుల అంచనాలకు దిశానిర్దేశం చేస్తుంది. కొత్త రకం కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఈ సినిమా ఫలానా క్లాసిక్ శైలిలో ఉంటుంది? అని చెప్పడం వల్ల ప్రేక్షకులకు ఆ సినిమా మూడ్ ఏంటో సులభంగా అర్థమవుతుంది. మార్కెటింగ్ పరంగా కూడా ఒక విజయాన్ని సూచికగా చూపిస్తూ ప్రచారం చేయడం వల్ల సినిమాపై ముందే క్రేజ్ పెరిగే అవకాశం ఉంటుంది. ప్రేక్షకులు కూడా తమ సమయాన్ని, డబ్బును కేటాయించేముందు స్పష్టతకు రావడానికి ఈ పోలికలు కొంతవరకు తోడ్పడతాయి.

మరోవైపు పోలికలు మేకర్స్‌కు స‌వాలు గా మారి చిత్ర నాణ్యత పెరిగేందుకు దోహదపడతాయి. గతంలో వచ్చిన ఐకానిక్ సినిమాలతో తమ చిత్రం పోల్చబడుతుందనే ఆలోచన ఉన్నప్పుడు దర్శక, నిర్మాతలు సాంకేతిక విలువలు, కథాకథనాల విషయంలో మరింత జాగ్రత్త పడతారు. `బాహుబలి`,`ఆర్ఆర్ఆర్` వంటి విజువల్ అద్భుతాలతో పోలికలు రావడం వల్లే తర్వాతి కాలంలో వచ్చిన అనేక భారీ బడ్జెట్ చిత్రాలు గ్రాఫిక్స్, నిర్మాణ ప్రమాణాలను పెంచుకోవడానికి శ్రమించాయి. ఈ రకమైన ఆరోగ్యకరమైన పోటీ సినీ పరిశ్రమ పురోగతికి ఉపయోగపడుతుంది.

అయితే పోలికల వల్ల జరిగే నష్టం కూడా తక్కువేమీ కాదు. ప్రధానంగా భారీ అంచనాలను పెంచి మంచి సినిమాలను కూడా దెబ్బతీస్తుంది. ఉదాహరణకు ఒక పరిమిత బడ్జెట్‌తో తీసిన ఫాంటసీ సినిమాను `బాహుబలి`తో పోల్చితే.. ఆ సినిమా స్వతంత్రంగా ఎంత బాగున్నా ?ప్రేక్షకులకు అసంతృప్తే మిగులుతుంది. కథ, కాన్వాస్, బడ్జెట్ వేరైనప్పుడు అనవసరమైన పోలికలు తీసుకురావడం వల్ల ఆ చిత్రం సాధించాల్సిన విజయాన్ని, అందుకోవాల్సిన ప్రశంసలను కోల్పోతుంది.

దీనికి తోడు సోషల్ మీడియా వేదికగా సాగే పోలికలు అభిమానుల గొడవలకు దారితీస్తున్నాయి. ఒక హీరో సినిమాను తక్కువ చేసి చూపేందుకు మరొక హీరో సినిమాతో నెగెటివ్ పోలికలు తెస్తూ ఉద్దేశపూర్వకంగా నెగెటివిటీని వ్యాప్తి చేస్తున్నారు. అలాగే దర్శకుల కొత్త ఆలోచనలను కూడా ఫలానా సినిమా నుంచి కాపీ కొట్టారు అంటూ ముద్ర వేసి, వారి స్వతంత్ర సృజనాత్మకతను తక్కువ అంచనా వేస్తున్నారు. దీనివల్ల ప్రయోగాత్మక చిత్రాలు ఆదరణ కోల్పోయే ప్రమాదం ఉద్భవిస్తుంది.

అంతిమంగా ఒక సినిమాను మరో సినిమాతో పోల్చడం అనేది సమాచారం కోసం, నాణ్యతా ప్రమాణాల అంచనా కోసం పరిమితంగా ఉన్నంత వరకు ప్రయోజనకరమే. కానీ ప్రతి సినిమాకు సొంత ఆత్మ, భిన్నమైన కథాంశం ఉంటాయనే విషయాన్ని గుర్తించకపోతే అది నష్టానికే దారితీస్తుంది. ఏ సినిమానైనా మరొక సినిమాతో సరిపోల్చ కుండా దాన్ని ఒక స్వతంత్ర కళాఖండంగా చూసి ఆస్వాదించినప్పుడే ప్రేక్షకులకు సరైన వినోదం దక్కడంతో పాటు.. పరిశ్రమలో కొత్త ప్రయోగాలకు మరింత ఆస్కారం ఉంటుంద‌న్న‌ది కాద‌న‌లేని నిజం.