15 ఏళ్లకే పెళ్లి.. 17 ఏళ్లకే తల్లి: నటి సినీప్రయాణంలో ట్విస్టులే ట్విస్టులు
మౌషుమి - జయంత్ ముఖర్జీ దంపతులకు మేఘా, పాయల్ అనే ఇద్దరు కుమార్తెలు జన్మించారు. అయితే వారి జీవితంలో ఒక తీరని విషాదం కూడా చోటుచేసుకుంది.
By: Sivaji Kontham | 16 May 2026 8:30 AM ISTభారతీయ చలనచిత్ర రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న సీనియర్ నటి మౌషుమి ఛటర్జీ తన వ్యక్తిగత జీవితం గురించి ఇటీవల షేర్ చేసిన విషయాలు నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. కేవలం 15 ఏళ్ల వయసులోనే అంటే తన 10వ తరగతి చదువుతున్నప్పుడే పెళ్లి జరిగిందని మౌషుమి వెల్లడించారు. 1967లో `బాలికా బధు` అనే బెంగాలీ చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఈ భామ ఆ సినిమా విడుదలైన కొద్ది కాలానికే ప్రముఖ సంగీత దర్శకుడు హేమంత ముఖర్జీ కుమారుడైన జయంత్ ముఖర్జీని వివాహం చేసుకున్నారు. ఆ వయసులో ప్రతి ఒక్కరూ తనను కోడలిగా లేదా భార్యగా పొందాలని కోరుకునేవారని.. ఆ క్రేజ్ చూసి తానే ఆశ్చర్యపోయేదాన్నని గుర్తు చేసుకున్నారు.
మౌషుమి పెళ్లి అంత త్వరగా జరగడానికి ఒక భావోద్వేగ కారణం కూడా ఉంది. ఆమెకు ఎంతో ఇష్టమైన పెద్దమ్మ క్యాన్సర్ చివరి దశలో ఉండటంతో చనిపోయేలోపు మౌషుమి పెళ్లి చూడాలని కోరుకున్నారట. హేమంత ముఖర్జీ చేతిని పట్టుకుని ఆమె అడిగిన ఆ కోరికను ఆయన కాదనలేకపోయారు. దీంతో కేవలం ఒక్క నెల వ్యవధిలోనే మౌషుమి వివాహం జరిగిపోయింది. పెళ్లయ్యాక ఆమె బొంబాయికి తన బొమ్మల ఇల్లు, పెంపుడు కుక్కతో కలిసి వచ్చిందని... అక్కడ రోజంతా బొమ్మలతో ఆడుకుంటూ గడిపేదాన్నని సరదాగా తెలిపారు. తను ఒంటరిగా ఫీల్ అవ్వకూడదని తన మామగారు ఎంతో జాగ్రత్తగా చూసుకునేవారని తెలిపారు.
అతి చిన్న వయసులో భార్యగా ఇంటి బాధ్యతలు చేపట్టిన మౌషుమి తన 17వ ఏటనే తల్లి అయ్యారు. ఒకవైపు చదువు.. మరోవైపు గృహిణిగా బాధ్యతలు నిర్వహిస్తూనే.. 1970వ దశకంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. అమితాబ్ బచ్చన్, రాజేష్ ఖన్నా వంటి దిగ్గజ నటులతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ నటి `రోటీ కపడా ఔర్ మకాన్`, `కచ్చే ధాగే` వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించారు. 17 ఏళ్లకే నాకు మెర్సిడెస్ కారు వచ్చింది.. ఆ వయసులో విజయానికి అర్థం కూడా నాకు సరిగ్గా తెలియదు.. కేవలం వెండితెరపై నా ముఖం చూసుకుని మురిసిపోయేదాన్ని`` అని తన కెరీర్ ఎదుగుదల గురించి వివరించారు.
మౌషుమి - జయంత్ ముఖర్జీ దంపతులకు మేఘా, పాయల్ అనే ఇద్దరు కుమార్తెలు జన్మించారు. అయితే వారి జీవితంలో ఒక తీరని విషాదం కూడా చోటుచేసుకుంది. చిన్న వయసులోనే మధుమేహం బారిన పడిన పెద్ద కుమార్తె పాయల్ 2019లో తన 45వ ఏట మరణించారు. ఈ సంఘటన మౌషుమిని తీవ్రంగా కలచివేసింది. ఒకవైపు సూపర్ స్టార్‌గా వెలుగు వెలుగుతూనే వ్యక్తిగత జీవితంలో ఇన్ని వేగవంతమైన మార్పులను, భావోద్వేగాలను ఎదుర్కోవడం నిజంగా సాహసమేనని చెప్పాలి.
ఐదు దశాబ్దాలకు పైగా వైవాహిక బంధంలో కొనసాగుతున్న మౌషుమి ప్రయాణం నేటి తరానికి ఆసక్తికరంగా అనిపిస్తుంది. తన జీవితంలో జరిగినవన్నీ ఒక ప్రత్యేక కారణం చేతనే జరిగాయని మౌషుమి బలంగా నమ్ముతారు. ఒక సాధారణ విద్యార్థినిగా ఉండి అనుకోకుండా నటిగా మారి.. ఆపై వెంటనే వివాహం చేసుకుని కూడా కెరీర్‌లో అగ్రస్థానానికి చేరుకోవడం తన పట్టుదలకు నిదర్శనం. నాటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా జరిగిన ఆమె వివాహం... ఒక నటిగా తన విజయాలకు ఎప్పుడూ అడ్డుగా నిలవకపోవడం విశేషం. మౌషుమి గురించి తెలుసుకునే కొద్దీ... అప్పట్లో ఆడపిల్లల్లోని అమాయకత్వం ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు.
