Begin typing your search above and press return to search.

మ‌రో విడాకులు: 4 ఏళ్ల వైవాహిక బంధానికి మౌనిరాయ్ బ్రేక‌ప్

గ్లామర్ ప్రపంచంలో జంటలు విడిపోవడం అనేది ఇటీవ‌లి కాలంలో సర్వసాధారణంగా మారిపోయింది.

By:  Sivaji Kontham   |   14 May 2026 10:50 PM IST
మ‌రో విడాకులు: 4 ఏళ్ల వైవాహిక బంధానికి మౌనిరాయ్ బ్రేక‌ప్
X

గ్లామర్ ప్రపంచంలో జంటలు విడిపోవడం అనేది ఇటీవ‌లి కాలంలో సర్వసాధారణంగా మారిపోయింది. రంగుల కలలు, విలాసవంతమైన జీవనశైలి, ఆర్థిక స్వేచ్ఛ వంటివి అప్పుడప్పుడు వ్యక్తిగత విభేదాలకు లేదా ఈగోలకు దారితీస్తున్నాయనే విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇటీవల నటి హన్సిక తన వైవాహిక జీవితంలో తలెత్తిన వివాదాలు, విడాకుల క‌థ‌నాల‌తో నిరంత‌ర వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. కొద్దిరోజులుగా మౌనిరాయ్ పైనా ఇలాంటి పుకార్లు కొన‌సాగుతున్నాయి. ఇంత‌లోనే ఇప్పుడు నటి మౌనీ రాయ్ కూడా తన భర్త సూరజ్ నంబియార్ నుంచి విడిపోతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.





గత నాలుగు ఏళ్లుగా వైవాహిక బంధంలో ఉన్న ఈ జంట సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో విడాకుల వార్తలు మొదట బయటకు వచ్చాయి. ఈ క్రమంలో మౌనీ రాయ్ పరపతిని, డబ్బును ఆమె భర్త వాడుకుని మోసం చేశాడంటూ మీడియాలో కొన్ని కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ తప్పుడు ప్రచారాలను మౌనీ- సూరజ్ తీవ్రంగా ఖండించారు. తమ సంబంధం గురించి వస్తున్న కల్పిత కథనాలు వాస్తవానికి దూరంగా ఉన్నాయని.. కేవలం సంచలనం కోసమే ఇలాంటి వార్తలను సృష్టిస్తున్నారని వారు అసహనం వ్యక్తం చేశారు.

పరిస్థితిని గమనించిన ఈ జంట ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేస్తూ... తాము విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు అధికారికంగా ధ్రువీకరించారు. తమ వ్యక్తిగత ప్రాధాన్యతలు మారుతున్న తరుణంలో పరస్పర గౌరవంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు పేర్కొన్నారు. విడిపోయినా భవిష్యత్తులో మంచి స్నేహితులుగా కొనసాగుతామని.. ఈ క్లిష్ట సమయంలో తమ ఏకాంతానికి భంగం కలిగించవద్దని మీడియాను, అభిమానులను అభ్యర్థించారు. ప్రైవసీని గౌరవించడం అత్యవసరమని వారు స్పష్టం చేశారు.

సెలబ్రిటీల జీవితాల్లో జరిగే ఇలాంటి సంఘటనలు తరచుగా మీడియాలో చర్చనీయాంశమవుతుంటాయి. ఒకరి వ్యక్తిగత జీవితాన్ని అడ్డు పెట్టుకుని అసత్య ప్రచారాలు చేయడం సరికాదని ఈ జంట తమ నోట్‌లో ఘాటుగానే స్పందించారు. తాము విడిపోతున్న విషయాన్ని ప్రైవేట్‌గా, సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి సమయం కావాలని వారు కోరారు. వివాహ బంధం ముగిసినా... ఒకరిపై ఒకరికి ఉన్న గౌరవాన్ని కాపాడుకుంటూ విడిపోవడమే ఉత్తమమని వారు భావిస్తున్నారు.

ఏది ఏమైనా మౌనీ రాయ్ - సూరజ్ నంబియార్ విడిపోవడం బాలీవుడ్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సెలబ్రిటీలు తమ వ్యక్తిగత సమస్యలను బహిరంగపరచడానికి ఇష్టపడరు కాబట్టి.. వారి నిర్ణయాన్ని గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఈ ప్రకటనతో ఇప్పటి వరకు వస్తున్న రకరకాల పుకార్లకు చెక్ పడినట్లయింది. భవిష్యత్తులో వారు తమ తమ కెరీర్‌లపై దృష్టి సారిస్తూ వ్యక్తిగత ప్రశాంతతను కోరుకుంటున్నారు.