ఇండస్ట్రీలో అవకాశాలకు టాలెంట్ మాత్రమే సరిపోదు
సినీ ఇండస్ట్రీలోకి రావడం ఎవరికైనా అంత ఈజీ కాదు. ఇండస్ట్రీలోకి రావాలంటే ఇంట్లో ఎదురింపుల నుంచి మొదలు పెడితే ఆఖరికి ఆడిషన్, సెలక్షన్ వరకు అన్నీ కష్టాలే.
By: Sravani Lakshmi Srungarapu | 9 Aug 2025 12:20 PM ISTసినీ ఇండస్ట్రీలోకి రావడం ఎవరికైనా అంత ఈజీ కాదు. ఇండస్ట్రీలోకి రావాలంటే ఇంట్లో ఎదురింపుల నుంచి మొదలు పెడితే ఆఖరికి ఆడిషన్, సెలక్షన్ వరకు అన్నీ కష్టాలే. ఏదీ అంత సులభంగా జరగదు. అయితే కష్టపడినా అందరికీ అవకాశాలు దక్కవు. అవకాశమొచ్చినా ప్రతీ ఒక్కరూ సక్సెస్ అవుతారనే గ్యారెంటీ కూడా లేదు. ఇక సక్సెస్ లేకపోతే మరో ఛాన్స్ కూడా రాదు.
సాధారణ వ్యక్తులకు ఇండస్ట్రీలోకి రావడమే గొప్ప ఘనత అయితే ఇండస్ట్రీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వాళ్లకు మాత్రం అది పెద్దగా కష్టమేమీ అనిపించదు. నార్మల్ పీపుల్ తో పోలిస్తే వారికి ఇండస్ట్రీలోకి చాలా ఈజీ యాక్సెస్ ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే. బాలీవుడ్ నటి మౌనీ రాయ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయంపై మాట్లాడగా, ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
బ్యాక్ గ్రౌండ్ ఉంటేనే ఏదైనా..
సినీ బ్యాక్ గ్రౌండ్ లేకపోతే ఎంత పెద్ద సినిమాల్లో నటించినా లాభముండదని చెప్పారు మౌనీ రాయ్. బయటి వ్యక్తులు ఛాన్సుల కోసం ఎప్పుడూ ప్రయత్నిస్తూ పోరాటం చేస్తూనే ఉండాలని, అలా చేసినా అవకాశాలు ఎక్కువగా రావని, అందుకే తాను ఏ చిన్న ఆఫర్ వచ్చినా చేస్తానని చెప్పారు. తాను ఇప్పటికే చాలా సినిమాల్లో నటించినా, ఇప్పటికీ ఆడిషన్స్ ఇస్తానని తెలిపారు.
బ్రహ్మాస్త్ర తర్వాత అవకాశాలొస్తాయనుకున్నా
బ్యాక్ గ్రౌండ్ లేని వారికి కూడా ఆడిషన్స్ చేసి ఛాన్సులు ఇవ్వాలని ఎవరూ అనుకోరని, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో బయటి వారు ఎదుర్కొంటోన్న సవాళ్ల గురించి ఆమె ప్రస్తావించారు. టాలెంట్ ఉన్నప్పటికీ ఛాన్సులు రావని, ఛాన్సులు రావడం ఎంతో కష్టమని చెప్పారు. బ్రహ్మాస్త్ర సినిమా తర్వాత తనకు వరుస ఛాన్సులొస్తాయనుకున్నానని, కానీ ఆ సినిమా సక్సెస్ కూడా తనకు ఛాన్సులు తీసుకురాలేదని చెప్పారు.
