'లిటిల్ హార్ట్స్' మౌళికి బెదిరింపులు.. భయపడి..
సినిమా హిట్ అయితే ప్రశంసలు వస్తాయి. అదే సమయంలో విమర్శలు, నెగిటివిటీ ఎదురుకావచ్చు.
By: M Prashanth | 21 Oct 2026 7:13 PM ISTసినిమా హిట్ అయితే ప్రశంసలు వస్తాయి. అదే సమయంలో విమర్శలు, నెగిటివిటీ ఎదురుకావచ్చు. కానీ ఒక సినిమా విజయాన్ని ఆస్వాదించాల్సిన సమయంలో బెదిరింపులు ఎదురైతే.. ఆ బాధ ఎలా ఉంటుందో యాక్టర్ మౌళి మాటల్లో ఇప్పుడు అర్థమవుతోంది. తనకు సినీ బ్యాక్ గ్రౌండ్ లేదనే కారణంతో కొందరు తక్కువగా చూశారని ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
మౌళి ఒకప్పుడు మీమ్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత నటుడిగా మారి సినిమాల్లో అవకాశాలు అందుకున్నారు. 90s బయోపిక్, లిటిల్ హార్ట్స్ సినిమాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ముఖ్యంగా లిటిల్ హార్ట్స్ విజయం ఆయన కెరీర్ లో మంచి గుర్తింపును తీసుకొచ్చింది. అయితే ఆ విజయంతో పాటు కొంతమంది నుంచి వ్యతిరేకత కూడా ఎదురైందని మౌళి తాజాగా వెల్లడించారు.
తన కొత్త సినిమా దొంగ నా కొడుకు టీజర్ రిలీజ్ ఈవెంట్ లో మౌళి ఆ విషయాలను షేర్ చేసుకున్నారు. లిటిల్ హార్ట్స్ సినిమా విజయం సాధించిన సమయంలో ఓ టీవీ ఛానెల్ నుంచి తనకు ఫోన్ వచ్చిందని తెలిపారు. ఆ ఛానెల్ లో ఇంటర్వ్యూకి రావాలని అడిగారని, అయితే అప్పుడు తనకు జ్వరం ఉండటంతో రాలేనని చెప్పినా.. ఆరోగ్యం బాగోలేదని క్లియర్ గా చెప్పినా పరిస్థితిని అర్థం చేసుకోలేదట.
'నీ తర్వాతి సినిమా వచ్చినప్పుడు చూసుకుంటాను' అన్నట్లుగా మాట్లాడారని మౌళి వెల్లడించారు. తన సినిమాపై నెగిటివిటీ పెంచుతామని ఇన్ డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చారట. ఆ మాటలు మౌళిని చాలా బాధ పెట్టినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో ఏం చేయాలో అర్థం కాలేదని, తనకు ఎలాంటి సినీ నేపథ్యం లేకపోవడంతో ఎదురు చెప్పలేకపోయానని వివరించారు. చివరకు భయపడి మరుసటి రోజు ఆ ఛానెల్ కు వెళ్లి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఒంట్లో బాలేకపోయినా వెళ్లాల్సి వచ్చిందని, నటుడిగా తనను తాను నిరూపించుకోవాలంటే ఇలాంటి పరిస్థితులను కూడా ఎదుర్కోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఘటన జరిగిన తర్వాత కూడా దాని గురించి బయటకు చెప్పకుండా చాలాకాలం మౌనంగానే ఉన్నానని తెలిపారు. ఒక పెద్ద సినీ ఫ్యామిలీ నుంచి వచ్చిన నటుడితో అలాగే మాట్లాడే ధైర్యం చేసేవారా అంటూ లేవనెత్తిన ప్రశ్న ఇప్పుడు వైరల్ గా మారింది.
దీంతో ఇండస్ట్రీలో పేరు ఉన్న వారికి ఒకలా గౌరవం, కొత్తగా వచ్చిన వారికి మరోలా ఉంటోందా అనే ప్రశ్న ఇప్పుడు వినిపిస్తోంది. సినిమాల్లో నిలదొక్కుకోవాలని ప్రయత్నించే కొత్త నటులకు గుర్తింపుతో పాటు ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి. ఒక సినిమా విజయంతో అవకాశాలు పెరుగుతాయని ఆశిస్తే, మరోవైపు ఇలాంటి ఒత్తిళ్లు ఎదురవడం వారి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతీయవచ్చు. మౌళి చెప్పిన ఎక్స్పీరియన్స్ కూడా అదే విషయాన్ని గుర్తు చేస్తోంది. అయితే తనకు వార్నింగ్ ఇచ్చిన టీవీ ఛానెల్ పేరు మాత్రం మౌళి రివీల్ చేయలేదు.
