'DNK' ట్రైలర్ టాక్: బెట్టింగులు.. దొంగతనాలతో మౌళి కామెడీ గోల
మౌళి హీరోగా శ్రీను కంబాల దర్శకత్వంలో తెరకెక్కిన క్రైమ్ కామెడీ ‘డీఎన్‌కే – దొంగ నా కొడుకు’ ట్రైలర్‌ను రవితేజ విడుదల చేశారు. అప్పుల బాధతో దొంగగా మారే యువకుడి చుట్టూ సాగే కథలో కామెడీ, డార్క్ హ్యూమర్ ఆకట్టుకునేలా ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పిస్తున్న ఈ చిత్రం నవంబర్ 13న విడుదల కానుంది.
By: M Prashanth | 10 Nov 2026 12:46 AM ISTసోషల్ మీడియా కంటెంట్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న మౌళి లిటిల్ హార్ట్స్ తో మంచి సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే . ఇక ఇప్పుడు రెండవ సినిమాను మరింత కొత్తగా కనిపించబోతున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వస్తున్న సరికొత్త క్రైమ్ కామెడీ చిత్రం 'డీఎన్‌కే- దొంగ నా కొడుకు'. శ్రీను కంబాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ను మాస్ మహారాజా రవితేజ చేతుల మీదుగా రిలీజ్ చేశారు.
నేటి యూత్‌ను టార్గెట్ చేస్తూ సాగే సరికొత్త ఫన్ ఎలిమెంట్స్ తో ట్రైలర్ కట్ మొత్తం చాలా ఎనర్జిటిక్ గా సాగింది. ఇందులో హీరో క్యారెక్టర్ ను పక్కా లోకల్ జులాయి కుర్రాడిగా డిజైన్ చేశారు. చేతిలో రూపాయి లేకపోయినా క్రికెట్ మ్యాచ్ లపై, బాల్ టు బాల్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ మీద వేల రూపాయలు తగలేస్తూ ఇంట్లో రోజూ తిట్లు తినే పాత్రలో మౌళి కనిపించాడు.
అప్పులు పెరిగిపోయి లోన్ యాప్ వాళ్లు ప్రైవేట్ వీడియోలతో బెదిరింపులకు దిగే వరకు పరిస్థితి వెళ్లడం నేటి యువత పరిస్థితులకు సెటైరికల్ గా అద్దం పడుతోంది. ఈ సమస్య నుంచి బయటపడటానికి గర్ల్‌ఫ్రెండ్ సుస్మితా శెట్టి ఇచ్చిన బంగారు ఉంగరాలు కూడా హీరో వాడేస్తాడు. దీంతో ఆమె తండ్రి రఘుబాబు నేరుగా హీరో ఇంటికొచ్చి పది లక్షల రూపాయల లెక్క తేల్చాలంటూ గొడవ చేయడం, పోలీసు కేసు పెడతానని వార్నింగ్ ఇవ్వడం కథలో మెయిన్ ట్విస్ట్ గా మారింది.
తల్లిదండ్రులు కాలనీలో తలదించుకునే పరిస్థితి రావడంతో, వారిని మళ్లీ తలెత్తుకునేలా చేస్తానంటూ హీరో ఇచ్చే బిల్డప్ కామెడీగా హైలెట్ చేశారు. అప్పులు తీర్చడానికి దొంగగా మారిన మౌళి, తన ఫ్రెండ్ బబ్లూతో కలిసి గుండు బాస్ జ్యువెలరీకి కన్నం వేయడంతో అసలైన రచ్చ మొదలవుతుంది. జ్యువెలరీ షాప్ ఓనర్ సీన్లు బాగా కుదిరాయి. రెండు నిమిషాల్లో పెన్ అమ్మమని అడగ్గానే మౌళి ఇచ్చిన క్రేజీ కౌంటర్ డైలాగ్ బాగా పేలింది.
ఇక అలీ హీరో తండ్రి పాత్రలో కనిపించడం మరో హైలెట్. బంగారం కొట్టేసిన తర్వాత మరో సీరియస్ గ్యాంగ్ ఎంటర్ అవ్వడం, ఇరవై నాలుగు గంటల డెడ్‌లైన్ పెట్టడంతో కథలో క్రైమ్ థ్రిల్లర్ స్పీడ్ పెరిగింది. బురఖాలు వేసుకుని తిరిగే సీన్లు, సూట్లు వేసుకుని వీధుల్లో నడిచే షాట్స్ లో డార్క్ హ్యూమర్ చక్కగా పండింది. మౌళి తనదైన బాడీ లాంగ్వేజ్, ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కామెడీ టైమింగ్ చూపించాడు.
సింజిత్ యెర్రామిల్లి అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వీడియోకి మంచి పేస్ తెచ్చింది. ఈ ఏడాది మోస్ట్ చిల్లర్ మూవీ అంటూ పోస్టర్ పై వేసిన ట్యాగ్‌కు తగినట్లే, రొటీన్ ఫార్ములా జోలికి వెళ్లకుండా లోకల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చేలా ఈ చిత్రం కనిపిస్తోంది. మైత్రీ నిర్మాణ విలువలు ప్రాజెక్ట్‌కు ప్లస్ అయ్యాయి. నవంబర్ 13న థియేటర్లలోకి రానున్న ఈ 'డీఎన్‌కే' ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
