Begin typing your search above and press return to search.

అమ్మోరు తల్లి నుంచి మహాశక్తి.. జోన్ కూడా మారిందే!

రెండో భాగానికి మాత్రం దర్శకుడు మారిపోయాడు. సుందర్ సి చేతికి సినిమా వెళ్లడంతో టోన్ కూడా ఆయన సినిమాలకు దగ్గరగా కనిపిస్తోంది.

By:  M Prashanth   |   14 Sept 2026 1:29 PM IST
అమ్మోరు తల్లి నుంచి మహాశక్తి.. జోన్ కూడా మారిందే!
X

నయనతార మహాశక్తి తెలుగు టీజర్ వచ్చేసింది. తమిళంలో మూకుత్తి అమ్మన్ 2గా వస్తున్న ఈ సినిమాను తెలుగులో మాత్రం మహాశక్తి పేరుతో తీసుకొస్తున్నారు. మొదటి భాగం గుర్తున్న వాళ్లకు టీజర్‌లో ఒక మార్పు వెంటనే కనిపిస్తుంది. అప్పట్లో దేవత పాత్ర ఉన్నా కథ చిన్న ప్రపంచంలో నడిచింది. ఇప్పుడు రాజ్యం, యుద్ధం, మహాకాళి రూపం, పెద్ద సెట్స్‌తో సినిమా పూర్తిగా మరో జోన్‌లోకి వెళ్లింది. అలాగే చిన్న పాప ఎమోషన్ ను కూడా హైలెట్ చేశారు. ఓ సైన్యం ఆ చిన్నారి కోసం చూడగా అమ్మవారు కాపలాగా ఉండనున్నట్లు తెలుస్తోంది.

2020లో వచ్చిన మూకుత్తి అమ్మన్‌లో ఆర్జే బాలాజీ టచ్ ఎక్కువగా ఉండేది. ఒక కుటుంబం, టీవీ రిపోర్టర్, నకిలీ స్వామి చుట్టూ కథ తిరిగింది. నయనతార దేవతగా కనిపించినా సినిమా మొత్తం సీరియస్ గా వెళ్లలేదు. కామెడీ, కుటుంబ సన్నివేశాలు, దేవుడి పేరుతో జరిగే మోసాలపై సెటైర్ అన్నీ కలిపి నడిపించారు. కరోనా టైమ్ కావడంతో ఆ సినిమా డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చింది.

రెండో భాగానికి మాత్రం దర్శకుడు మారిపోయాడు. సుందర్ సి చేతికి సినిమా వెళ్లడంతో టోన్ కూడా ఆయన సినిమాలకు దగ్గరగా కనిపిస్తోంది. అరణ్మణై సిరీస్‌లో ఫాంటసీ, హారర్, దేవతా శక్తులు, భారీ క్లైమాక్స్‌లను ఆయన ఇప్పటికే ఎక్కువగా వాడాడు. మహాశక్తి టీజర్‌లోనూ అదే రూట్ కనిపిస్తోంది. చిన్న కుటుంబ కథ కంటే ఈసారి విజువల్ స్కేల్, యాక్షన్‌కు ఎక్కువ స్థానం ఇచ్చారు.

నయనతార పాత్రలో కూడా చేంజ్ కనిపిస్తోంది. మొదటి సినిమాలో అమ్మవారిగా మనుషుల మధ్య తిరిగే పాత్ర అయితే, ఇప్పుడు మహాకాళి రూపాన్ని కూడా చూపించారు. టీజర్‌లో ఆమె పాత్రకు యాక్షన్ భాగం ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. దునియా విజయ్‌ను కూడా పవర్ఫుల్ పాత్రలో చూపించారు. రెజీనా కసాండ్రా, యోగిబాబు, ఊర్వశి లాంటి వాళ్లు ఉండటంతో క్యాస్టింగ్ కూడా మొదటి భాగం కంటే పెద్దదైంది.

తెలుగులో టైటిల్ మహాశక్తి అని పెట్టడంతో కొత్త సినిమాలా కూడా ప్రచారం చేసే అవకాశం ఉంది. పైగా నయనతారకు తెలుగులో దేవత పాత్ర కొత్తది కాదు. అమ్మోరు తరహా సినిమాలకు ఇక్కడ స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉండటంతో ఆ మార్కెట్‌ను కూడా దృష్టిలో పెట్టుకున్నట్లు కనిపిస్తోంది.

మహాశక్తి నవంబర్ 6న థియేటర్లలోకి రానుంది. మొదటి భాగం ఓటీటీలో చిన్న సెటప్‌తో వచ్చి క్లిక్ అయ్యింది. రెండో భాగం మాత్రం నేరుగా పెద్ద తెర కోసం తయారైన సినిమాలా కనిపిస్తోంది. టీజర్‌లో కథను ఎక్కువగా బయటపెట్టకుండా నయనతార రూపం, యుద్ధం, ఫాంటసీ ప్రపంచాన్నే హైలెట్ చేశారు. ట్రైలర్ వచ్చాక సుందర్ సి ఈసారి కథను కూడా అదే స్థాయిలో ఎంతవరకు మార్చాడన్నది మరింత క్లియర్ అవుతుంది.