చిన్న వయసులోనే నేషనల్ అవార్డు.. 21 ఏళ్లకే తిరిగి రాని లోకాలకు
ఎవరూ ఊహించనిదే జీవితమని పెద్దలు ఊరికే అనలేదు. ఎన్నో అనుభవాలు, మరెన్నో సంఘటనలను చూసే వారు ఆ మాట అన్నారు.
By: Sravani Lakshmi Srungarapu | 1 Sept 2025 8:00 PM ISTఎవరూ ఊహించనిదే జీవితమని పెద్దలు ఊరికే అనలేదు. ఎన్నో అనుభవాలు, మరెన్నో సంఘటనలను చూసే వారు ఆ మాట అన్నారు. జీవితంలో అన్నీ బావున్నాయనుకునే టైమ్ లో ప్రతీ ఒక్కరీ జీవితంలో ఏదొక చేదు సంఘటన జరుగుతూనే ఉంటుంది. అయితే కొన్నిసార్లు ఆ సంఘటనలను జీవితాల్ని మార్చేస్తే, మరికొన్ని సార్లు ఆ సంఘటనలు అసలు జీవితమే లేకుండా చేస్తాయి.
చిన్నప్పటి నుంచే యాక్టింగ్ పై ఆసక్తి
అలాంటి ఓ సంఘటనే మోనిషా ఉన్ని జీవితంలో కూడా జరిగింది. సీనియర్ నటి శ్రీదేవి, బిజినెస్ మ్యాన్ నారాయణ్ ఉన్నిల కూతురైన మోనిషా ఉన్ని చిన్నతనం నుంచే యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ పెంచుకుని 15 ఏళ్ల వయసులోనే సినీ రంగంలో చక్రం తిప్పారు. తక్కువ టైమ్ లోనే స్టార్ స్టేటస్ ను దక్కించుకున్న మోనిషా ఆరేళ్లలో పాతిక సినిమాల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించారు.
15 ఏళ్లకే నేషనల్ అవార్డు
15 ఏళ్ల వయసులోనే నేషనల్ అవార్డును గెలుచుకున్న మోనిషాను అప్పట్లో లేడీ సూపర్ స్టార్ అని కూడా పిలిచేవారు. 1986లో హరిహరన్ దర్శకత్వం వహించిన నఖక్షతంగల్ అనే సినిమాతో మోనిషా నటిగా ఎంట్రీ ఇచ్చారు. 1987లో ఉత్తమ నటిగా నేషనల్ అవార్డును గెలుచుకున్నారు. తమిళ సినిమాల్లో కూడా మోనిషా సంచలనం సృష్టించారు.
కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మోనిషా ఉన్ని
1987లో పూక్కల్ విడుమ్ తుధు సినిమాతో కొలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాక 1989లో సత్యరాజ్ తో కలిసి ద్రవిడన్ అనే సినిమాలో నటించారు. వరుస హిట్లతో అవకాశాలు బాగా వస్తూ కెరీర్లో పీక్స్ టైమ్ లో ఉన్నప్పుడే మోనిషా 1992లో కార్ యాక్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోయారు. మోనిషా చనిపోయినప్పుడు ఆమె వయసు 21 సంవత్సరాలు. మలయాళ సినిమా చెప్పాదివిద్య మూవీలో యాక్ట్ చేస్తున్నప్పుడు తల్లితో కలిసి ప్రయాణిస్తున్న కారు బస్సును ఢీ కొట్టగా ఆ ప్రమాదంలో మోనిషా మరణించారు.
