Begin typing your search above and press return to search.

క్యాన్సర్‌ను జయించిన బిగ్‌బాస్ బ్యూటీ.. సర్జరీ తర్వాత ఎమోషనల్ పోస్ట్!

బిగ్‌బాస్ ఫేమ్, నటి మోనాల్ గజ్జర్ తనకు పాపిల్లరీ థైరాయిడ్ క్యాన్సర్ ఉన్నట్లు వెల్లడించారు. ఇటీవలే శస్త్రచికిత్స చేయించుకున్నానని, ప్రస్తుతం కోలుకుంటున్నానని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా, అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని అభిమానులకు సూచించారు.

By:  Priya Chowdhary Nuthalapti   |   13 Nov 2026 12:01 AM IST
క్యాన్సర్‌ను జయించిన బిగ్‌బాస్ బ్యూటీ.. సర్జరీ తర్వాత ఎమోషనల్ పోస్ట్!
X

సినిమా తారల జీవితాలు బయటకు ఎంతో అందంగా కనిపిస్తాయి. కానీ కెమెరా వెనుక వారు ఎదుర్కొనే వ్యక్తిగత సమస్యలు.. ఆరోగ్య ఇబ్బందులు చాలామందికి తెలియవు. తాజాగా టాలీవుడ్ నటి.. బిగ్‌బాస్ ఫేమ్ మోనాల్ గజ్జర్ తన ఆరోగ్యానికి సంబంధించిన విషయాన్ని వెల్లడించి అభిమానులను షాక్‌కు గురిచేశారు. తనకు పాపిల్లరీ థైరాయిడ్ క్యాన్సర్ ఉన్నట్లు వైద్య పరీక్షల్లో తేలిందని.. ఈ మధ్యనే శస్త్రచికిత్స చేయించుకున్నట్లు ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం సర్జరీ విజయవంతంగా పూర్తయిందని..క్రమంగా కోలుకుంటున్నానని తెలిపారు.

మోనాల్ గజ్జర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. అల్లరి నరేష్ హీరోగా నటించిన సుడిగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఆమె, ఆ తర్వాత బ్రదర్ ఆఫ్ బొమ్మాలి వంటి చిత్రాల్లోనూ నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాలతో పాటు టెలివిజన్ రంగంలోనూ తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా తెలుగు బిగ్‌బాస్ సీజన్ 4లో పాల్గొనడంతో ఆమెకు మరింత పాపులారిటీ వచ్చింది. ఈ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. అనంతరం బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన అల్లుడు అదుర్స్ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్లో కనిపించి అలరించారు.

అయితే తాజాగా ఆమె పంచుకున్న ఆరోగ్య సమాచారం మాత్రం అభిమానులను కలచివేసింది. తనకు పాపిల్లరీ థైరాయిడ్ క్యాన్సర్ ఉన్నట్లు గుర్తించడంతో వైద్యుల సలహా మేరకు ఆపరేషన్ చేయించుకున్నట్లు మోనాల్ తెలిపారు. ఈ సమస్యను ఎదుర్కొని ప్రస్తుతం కోలుకుంటున్నానని చెప్పడం అభిమానులకు కొంత ఊరటనిచ్చింది. తన ఆరోగ్య పరిస్థితి గురించి బహిరంగంగా మాట్లాడటం ద్వారా క్యాన్సర్‌పై అవగాహన కల్పించే ప్రయత్నం కూడా చేశారు.

ఈ క్రమంలో ఈ నటి..జీవితంలో కెరీర్, కుటుంబం, ఇతర బాధ్యతలతో ఎంత బిజీగా ఉన్నా ఆరోగ్యాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు. శరీరంలో ఏవైనా అసాధారణ మార్పులు కనిపించినా, ఆరోగ్యంపై సందేహాలు ఉన్నా ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని కోరారు. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం కూడా ఎంతో అవసరమని గుర్తుచేశారు. అంతేకాదు, మహిళల్లో క్యాన్సర్ నివారణపై అవగాహన పెంచేందుకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ ప్రాముఖ్యతను కూడా ప్రస్తావించారు. ముఖ్యంగా సర్వైకల్ క్యాన్సర్ నివారణకు సంబంధించి సరైన వైద్య సలహా తీసుకోవాలని తెలిపింది. ఆమె చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.