Begin typing your search above and press return to search.

చంపేస్తామ‌ని బెదిరిస్తున్నారు.. కుంభ‌మేళా మోనాలిసా ఫిర్యాదు

మహాకుంభమేళాలో రుద్రాక్షలు విక్రయిస్తూ సోషల్ మీడియా ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన మోనాలిసా భోంస్లే జీవితం ఇప్పుడు మలుపులు తిరుగుతోంది.

By:  Sivaji Kontham   |   21 March 2026 4:22 PM IST
చంపేస్తామ‌ని బెదిరిస్తున్నారు.. కుంభ‌మేళా మోనాలిసా ఫిర్యాదు
X

మహాకుంభమేళాలో రుద్రాక్షలు విక్రయిస్తూ సోషల్ మీడియా ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన మోనాలిసా భోంస్లే జీవితం ఇప్పుడు మలుపులు తిరుగుతోంది. వైరల్ గర్ల్‌గా పేరు తెచ్చుకున్న మోనాలిసా ఇటీవల ఫర్మాన్ ఖాన్ అనే ముస్లిమ్ యువ‌కుడిని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పెళ్లి తర్వాత తమ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని.. కొంతమంది వ్యక్తులు తమను చంపేస్తామని బహిరంగంగా బెదిరిస్తున్నారని మోనాలిసా ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు తనకు రక్షణ కల్పించాలని కోరుతూ అధికారులకు విజ్ఞప్తి చేసింది.

వీరిద్దరి వివాహం వేర్వేరు మతాలకు సంబంధించింది కావడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. కొందరు దీనిని వివాదాస్పదం చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే తమకు వస్తున్న బెదిరింపులపై మోనాలిసా ఒక వీడియోను విడుదల చేసింది. ``మాకు ప్రాణహాని ఉంది.. దయచేసి మమ్మల్ని కాపాడండి`` అంటూ అధికారులను, మీడియాను వేడుకుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

కేరళలోని ఒక ఆలయంలో ఈ నెల 11న వీరి వివాహం జరిగింది. ఈ పెళ్లికి కేరళ ప్రభుత్వం, అక్కడి మంత్రులు అందించిన మద్దతుపై మోనాలిసా దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. తమ వివాహం ఇంత ఘనంగా జరుగుతుందని తాము ఊహించలేదని.. కేరళ విద్యాశాఖ మంత్రి స్వయంగా హాజరై ఆశీర్వదించడం సంతోషకరమని వారు పేర్కొన్నారు. అన్ని మతాలను తాను గౌరవిస్తానని.. ప్రేమకు మతం అడ్డుకాదని మోనాలిసా ఈ సందర్భంగా స్పష్టం చేసింది.

మోనాలిసా- ఫర్మాన్ ఖాన్ ఒక సినిమా ప్రాజెక్ట్ పనిలో ఉన్నప్పుడు పరిచయమయ్యారు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. అయితే మతాలు వేరు కావడంతో మోనాలిసా కుటుంబ సభ్యులు ఈ సంబంధాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇంట్లో అంగీకారం లభించకపోయినా.. మేజర్లయిన తమకు నచ్చిన భాగస్వామిని ఎంచుకునే హక్కు ఉందని భావించిన ఈ జంట కేరళ పోలీసులను ఆశ్రయించి రక్షణ కోరింది.

కుంభమేళాలో ఒక సామాన్య యువతిగా కనిపించి కోట్లాది మంది దృష్టిని ఆకర్షించిన మోనాలిసా ఇప్పుడు తన వ్యక్తిగత స్వేచ్ఛ కోసం పోరాడాల్సి రావడం చర్చనీయాంశమైంది. సామాజిక వర్గాల నుంచి వస్తున్న ఒత్తిళ్లు, బెదిరింపుల నేపథ్యంలో ప్రభుత్వం తమకు పూర్తిస్థాయి భద్రత కల్పిస్తుందని ఈ జంట ఆశిస్తోంది. వ్యక్తిగత నిర్ణయాలను గౌరవించాల్సిన సమాజం ఇలాంటి బెదిరింపులకు దిగడంపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.