సృజనాత్మక స్వేచ్ఛకు సంకెళ్లు!
సెన్సార్ బోర్డు కొత్త నిబంధనలపై మాలీవుడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమా టైటిళ్ల విషయంలో బోర్డు జోక్యం సృజనాత్మక స్వేచ్ఛను హరించడమేనని కేరళ సినీ సంఘాలు మండిపడ్డాయి. నిబంధనలను వెనక్కి తీసుకోకపోతే న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించాయి. ఈ వివాదంలో ఇతర సినీ పరిశ్రమలు కూడా మద్దతుగా నిలుస్తాయా అన్న చర్చ మొదలైంది.
By: Srikanth Kontham | 13 Nov 2026 5:06 PM ISTఇటీవలే సీబీఎఫ్ సీ చిత్ర పరిశ్రమపై కఠినమైన నిబంధనలు అమలులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. సినిమాల విడుదల తేదీలు .. టైటిళ్లను ప్రచార హోరును బట్టి ఫైనల్ చేయడానికి వీల్లేదని సెన్సార్ సర్టిఫికేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు అవి ఎప్పుడైనా మారొచ్చని కొత్త నిబంధనలొచ్చాయి. కంటెంట్‌తో పాటు టైటిల్స్ .. రిలీజ్ డేట్లపై కూడా బోర్డు పెత్తనం చెలాయించే ప్రయత్నం చేస్తుందని..ఇలా వ్యవహరించడం ఎంత మాత్రం సహేతుకం కాదని అన్ని చిత్ర పరిశ్రమల నుంచి తీవ్ర వ్యతిరేకత కూడా వ్యక్తమవుతోంది.
తాజాగా మాలీవుడ్ పరిశ్రమ మరోసారి సెన్సార్ బోర్డు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. టైటిళ్ల విషయంలో సెన్సార్ బోర్డు కొత్తగా జారీ చేసిన నిబంధనలను అనవసరమైనవిగా అభివర్ణించింది. దీనిపై సినీ సంఘాలు న్యాయపోరాటం చేస్తాయని హెచ్చరించాయి. టైటిల్స్ విషయంలో జోక్యం చేసుకోవడం సృజనాత్మక స్వేచ్ఛను హరించడమేనని కేరళ బోర్డు గట్టిగా వాదిస్తోంది. దీనికి ప్రధాన కారణం సినిమా కంటెంట్ మాత్రమే కాకుండా టైటిల్స్ కూడా తమ పరిశీలన పరిధిలోకి రావాలని సెన్సార్ బోర్డు పట్టుబడుతుండటమే.
ఈ కొత్త విధానంతో నిర్మాతల స్వేచ్ఛను అణచి వేయాలని చూస్తున్నారని సినీ ప్రముఖులు మండిపడుతున్నారు. నిబంధనల పేరుతో సెన్సార్ బోర్డు అధికారాలను దుర్వినియోగం చేస్తోందని..దీనివల్ల నిర్మాణ రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేరళకు చలనచిత్ర సంఘాలు అత్యవసర సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించాయి. సెన్సార్ బోర్డు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వెనక్కి తగ్గని పక్షంలో కోర్టును ఆశ్రయించడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసాయి.
ఆర్టిస్టుల హక్కులను కాపాడుకునేందుకు చట్టపరమైన పోరాటం ఒక్కటే మార్గమని భావిస్తున్నారు. సినిమా టైటిల్ అనేది దర్శకుడి ఆలోచనకు, సృజనాత్మకతకు అద్దం పడుతుందని దానిపై కూడా ఆంక్షలు విధించడం సరికాదని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ప్రజాస్వామ్య దేశంలో భావప్రకటన స్వేచ్ఛకు ఇది విఘాతమని పలువురు ప్రముఖులు భావిస్తున్నారు. ఇప్పటికే అనేక వివాదాలతో సతమతమవుతున్న చిత్ర పరిశ్రమకు ఈ కొత్త నిబంధనలు మరింత భారంగా మారే అవకాశం ఉందంటున్నారు.
కేరళ సంఘాల హెచ్చరిక దేశవ్యాప్తంగా ఇతర చలనచిత్ర పరిశ్రమల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. మాలీవుడ్ కు తోడుగా కోలీవుడ్..శాండిల్ వుడ్...టాలీవుడ్ కూడా తోడైతే? ఈ వివాదం మరింత తీవ్ర రూపం దాల్చుతుంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం సెలబ్రిటీలతో అత్యంత సన్నిహితంగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. పరిశ్రమలో పెద్ద స్టార్లను టార్గెట్ చేసి వారితో మాట మంతి చేయడం వంటి వ్యవహారాలు నెరుపుతుంది. ఈ వివాదంలోకి నేరుగా హీరోలే రంగంలోకి దిగితే కేంద్రం వెనక్కి తగ్గే అవకాశం ఉందనే ప్రచారం మరోవైపు జరుగుతోంది.
