సౌతిండియాలో నేపోటిజంతో పని లేని ఏకైక సినీపరిశ్రమ?
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో మాలీవుడ్ (మలయాళ సినిమా) ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటుంది.
By: Sivaji Kontham | 4 March 2026 10:33 AM ISTభారతీయ చలనచిత్ర పరిశ్రమలో మాలీవుడ్ (మలయాళ సినిమా) ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ స్టార్‌డమ్ కంటే కంటెంట్ కే పెద్దపీట వేస్తారు. అందుకే ఎలాంటి సినీ నేపథ్యం లేని సాధారణ యువకులు కూడా కేవలం నటనను నమ్ముకుని నేడు గ్లోబల్ స్టార్‌లుగా ఎదుగుతున్నారు. మమ్ముట్టి, మోహన్ లాల్ వంటి దిగ్గజాల నీడలో ఉంటూనే.. తమకంటూ ఒక స్వతంత్ర సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న నేటి తరం యువ ట్యాలెంట్ గురించి పరిశీలిస్తే తెలిసిన సంగతులివి..
ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచే పేరు టోవినో థామస్. ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా కెరీర్ ప్రారంభించి సినిమాలపై మోజుతో మోడలింగ్‌లోకి అడుగుపెట్టిన టోవినో 2012లో `ప్రభువింటే మక్కల్` అనే సినిమాతో పరిచయమయ్యారు. ప్రారంభంలో చిన్న పాత్రలు, విలన్ షేడ్స్ ఉన్న రోల్స్ చేసినా 2015లో వచ్చిన `ఎన్ను నింటె మొయిదీన్` ఆయన కెరీర్‌కు మొదటి బిగ్ బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత గోదా, మాయానది వంటి హిట్లతో నిలదొక్కుకున్నారు. ఇప్పటివరకు దాదాపు 45 సినిమాల్లో నటించిన అతడిని గ్లోబల్ స్టార్‌గా మార్చిన చిత్రం `మిన్నల్ మురళి`. `అన్వేషిప్పిన్ కండెతుమ్`, L2: ఎంపురాన్ వంటి భారీ ప్రాజెక్టుల్లోను నటించారు. ప్రారంభంలో లక్షల్లో ఉన్న అతడి పారితోషికం ఇప్పుడు 7కోట్ల నుండి 10 కోట్ల రేంజ్‌కు చేరింది.
సోషల్ మీడియా యుగంలో యువతకు ఐకాన్‌గా మారిన నస్లెన్ 2019లో `తగ్లీర్ మథన్ దినంగళ్` చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. ఎలాంటి ఫిల్మీ బ్యాక్‌గ్రౌండ్ లేని ఈ కుర్రాడు తన సహజ సిద్ధమైన కామెడీ టైమింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నారు. ఈయన కెరీర్‌ను మలుపు తిప్పిన బిగ్గెస్ట్ హిట్ `ప్రేమలు`. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. నస్లెన్‌ను స్టార్ హీరోల రేసులో నిలబెట్టింది. ఇప్పటివరకు 12 సినిమాలు చేసిన అతడు ఐ యామ్ కాథలన్, ప్రేమలు సీక్వెల్‌లో నటించారు. అతడి పారితోషికం ఇప్పుడు 2 నుండి 4 కోట్ల వరకు పెరిగినట్లు సమాచారం.
మలయాళ గ్లామర్ బాయ్ రోషన్ మాథ్యూ ప్రయాణం కూడా స్ఫూర్తిదాయకం. థియేటర్ ఆర్ట్స్ నుండి వచ్చిన రోషన్ 2016లో `పుతియ నియమం` అనే చిత్రంతో అరంగేట్రం చేశారు. ఆనందం, కూడె వంటి సినిమాలతో గుర్తింపు పొందినా నెట్‌ఫ్లిక్స్ మూవీ `కప్పేలా`.. హిందీ చిత్రం `డార్లింగ్స్` అతడికి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చాయి. ఇప్పటివరకు 20కి పైగా సినిమాల్లో నటించిన రోషన్ ప్రస్తుతం సుకుమార్ నిర్మాణంలో వస్తున్న తెలుగు సినిమాతో పాటు పలు మలయాళ ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు. పారితోషికం పరంగా అతడి గ్రాఫ్ ఇప్పుడు 1.5 నుండి 3 కోట్ల మధ్యలో ఉంది.
వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన షైన్ నిగమ్ కూడా అవుట్‌సైడర్‌గానే గుర్తింపు తెచ్చుకున్నారు. బాలనటుడిగా కెరీర్ మొదలుపెట్టి 2016లో `కిస్మత్` చిత్రంతో హీరోగా మారారు. ఆయన కెరీర్‌కు బిగ్గెస్ట్ బ్రేక్ ఇచ్చిన సినిమా `కుంబలంగి నైట్స్`. ఆ తర్వాత `ఆర్.డి.ఎక్స్` (RDX) సినిమాతో మాస్ హీరోగా 100 కోట్ల క్లబ్‌లో చేరారు. ఇప్పటివరకు 18 సినిమాలు చేసిన షైన్ ప్రస్తుతం యాక్షన్ ఓరియెంటెడ్ కథలపై దృష్టి పెట్టారు. అతడి పారితోషికం ఇప్పుడు 3 నుండి 5 కోట్ల వరకు ఉంది.
ఈ యువ హీరోల పారితోషికాల గ్రాఫ్ గమనిస్తే ప్రతి పెద్ద హిట్ తర్వాత వారి రెమ్యూనరేషన్ 50శాతం నుండి 100శాతం వరకు పెరుగుతూ వచ్చింది. ముఖ్యంగా ఓటిటి (OTT) విప్లవం తర్వాత మలయాళ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరగడం వీరికి కలిసి వచ్చింది. ప్రారంభంలో కేవలం కేరళ మార్కెట్‌కే పరిమితమైన వీరి సంపాదన ఇప్పుడు డబ్బింగ్ రైట్స్, శాటిలైట్ హక్కుల ద్వారా భారీగా పెరిగింది.
మాలీవుడ్ యువ ట్యాలెంట్ భవిష్యత్తు అత్యంత ఆశాజనకంగా కనిపిస్తోంది. వీరు కేవలం నటనకే పరిమితం కాకుండా.. కథల ఎంపికలోనూ కొత్తదనం చూపిస్తున్నారు. టోవినో థామస్ వంటి నటుడు ఇప్పటికే పాన్ ఇండియా స్టార్‌లుగా ఎదిగారు. వారసత్వం లేకపోయినా కేవలం ప్రతిభ ఉంటే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని వీరు నిరూపిస్తున్నారు. రానున్న ఐదేళ్లలో ఈ స్టార్లు సౌత్ ఇండియన్ సినిమాలో అత్యున్నత స్థాయికి చేరుకుంటారనడంలో సందేహం లేదు.
కాలం మారుతున్నా.. మలయాళ సినిమా తన మూలాలను వదులుకోకుండా ఇటువంటి సెల్ఫ్ మేడ్ స్టార్లను ప్రోత్సహిస్తూనే ఉంది. ఈ హీరోలు సృష్టించిన బాట భవిష్యత్తులో మరెంతో మంది సామాన్య యువకులకు వెండితెరపై మెరిసే అవకాశాన్ని కల్పిస్తోంది.
