మాలీవుడ్ మెరుపు సమ్మెకు ప్రధాన కారణం?
ఆ రోజున రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అన్ని సినిమాల షూటింగ్‌లు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిగా నిలిచిపోతాయి.
By: Sivaji Kontham | 12 Jan 2026 9:30 AM ISTగత ఏడాది టాలీవుడ్ లో కార్మికుల మెరుపు సమ్మె ప్రధానంగా చర్చల్లోకొచ్చింది. నెలరోజుల పాటు షూటింగులు ఆపేయడం ఇండస్ట్రీకి బిగ్ షాక్. ఇప్పుడు సంక్రాంతి వేళ మాలీవుడ్ క్రైసిస్ చర్చగా మారింది. మలయాళ సినీ పరిశ్రమ జనవరి 22న రాష్ట్రవ్యాప్తంగా భారీ సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ మేరకు కేరళ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇతర సినీ అనుబంధ సంఘాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి.
సమ్మెకు ప్రధాన కారణాలు పరిశీలిస్తే, సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం, అదనపు పన్నుల భారం మోపిన ప్రభుత్వ తీరుపై నిరసనగా ఈ ఆకస్మిక బంద్‌ని పాటిస్తున్నారు. ప్రస్తుతం సినిమా టికెట్లపై జీఎస్టీ భారంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా వినోద పన్ను వసూలు చేస్తోంది. దీనిని వెంటనే రద్దు చేయాలని నిర్మాతలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే థియేటర్ల కోసం ప్రత్యేక విద్యుత్ టారిఫ్‌ను అమలు చేయాలని, ప్రస్తుత ఛార్జీలు భారంగా మారాయని ఎగ్జిబిటర్లు కోరుతున్నారు. సినిమా షూటింగ్ అనుమతుల కోసం ఒకే చోట అన్ని క్లియరెన్స్‌లు లభించేలా `సింగిల్ విండో` విధానాన్ని తీసుకురావాలనే డిమాండ్ కూడా వినిపిస్తున్నారు.
సమ్మె పిలుపు మేరకు జనవరి 22న కేరళలోని అన్ని సినిమా థియేటర్లు మూతపడతాయి. ఎలాంటి షోలు ప్రదర్శితం కావు. ఆ రోజున రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అన్ని సినిమాల షూటింగ్‌లు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిగా నిలిచిపోతాయి. ఈ ఒక్కరోజు సమ్మె కేవలం ఒక హెచ్చరిక మాత్రమేనని, ప్రభుత్వం స్పందించకుంటే నిరవధిక సమ్మెకు వెళ్తామని సినీ సంఘాలు స్పష్టం చేశాయి.
ప్రభుత్వం దిగి రాకపోతే ఈ సమ్మె మరింత ఉధృతం అయ్యేందుకు ఆస్కారం లేకపోలేదు. ఒకరోజు మించి టాలీవుడ్ సమ్మె మాదిరి తీవ్ర రూపం దాలిస్తే, చాలా సినిమాల షెడ్యూళ్లు గందరగోళంలో పడతాయనే ఆందోళన ఉంది. థియేటర్లు మూతపడితే, ఆ మేరకు ఎగ్జిబిషన్ రంగంతో పాటు దీనిపై ఆధారపడిన అందరికీ నష్టం వాటిల్లుతుంది.
మల్లూవుడ్ ఈ నిర్ణయం తీసుకోవడానికి 2025లో ఎదురైన భారీ నష్టాలే ప్రధాన కారణమని తెలుస్తోంది.ఇండస్ట్రీ నుంచి సుమారు 185 చిత్రాలు విడుదల కాగా కేవలం 10 -15 సినిమాలు మాత్రమే లాభాలను ఆర్జించాయి.పరిశ్రమ సుమారు రూ.530 కోట్ల నష్టాన్ని మూటగట్టుకుందని ఫిల్మ్ ఛాంబర్ వెల్లడించింది.
ఈ సమస్యలపై చర్చించేందుకు కేరళ ప్రభుత్వం 2026 జనవరి 14న సినీ సంఘాలతో మరో దఫా చర్చలు జరపనుంది. ఒకవేళ ఈ చర్చలు సఫలం కాకపోతే జనవరి 22 సమ్మె ఖాయమని తెలుస్తోంది. వినోద పన్ను తగ్గింపు సహా మాలీవుడ్ నిర్మాతల డిమాండ్లు సముచితంగానే ఉన్నాయి. కానీ కేరళ ప్రభుత్వం నిర్ణయం ఎలా ఉంటుందో వేఇ చూడాలి.
మలయాళ సినిమాల అనువాదాలు లేదా రీమేక్ లకు తెలుగు చిత్రసీమ సహా అన్నిచోట్లా క్రేజ్ పెరుగుతోంది. ఇటీవల కళ్యాణి ప్రియదర్శిని నటించిన లోకా పాన్ ఇండియాలో గ్రాండ్ సక్సెస్ సాధించడంతో ఇప్పుడు బడ్జెట్ స్కేల్ ని కూడా మాలీవుడ్ నిర్మాతలు పెంచుతున్నారు. ఇలాంటి సమయంలో అనుకోని సమ్మెలు, నిరసనలు పరిశ్రమకు అనవసరమైన ఇబ్బందుల్ని సృష్టిస్తాయి.
