Begin typing your search above and press return to search.

టాలీవుడ్ ఫేవరెట్ స్టార్స్ గా..

పాన్ ఇండియా సినిమాలు వస్తున్న నేపథ్యంలో భాషతో సంబంధం లేకుండా కంటెంట్ నచ్చితే ప్రేక్షకుడు ఆ సినిమాను ఆదరిస్తున్న విషయం తెలిసిందే.

By:  Madhu Reddy   |   31 Dec 2025 7:13 PM IST
టాలీవుడ్ ఫేవరెట్ స్టార్స్ గా..
X

పాన్ ఇండియా సినిమాలు వస్తున్న నేపథ్యంలో భాషతో సంబంధం లేకుండా కంటెంట్ నచ్చితే ప్రేక్షకుడు ఆ సినిమాను ఆదరిస్తున్న విషయం తెలిసిందే. అటు నటీనటులు కూడా ప్రాంతీయ భాషకే పరిమితం కాకుండా ఇతర భాష చిత్రాలలో కూడా నటిస్తూ అక్కడ కూడా తమ మార్కెట్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక రాజమౌళి పుణ్యమా అని బాహుబలి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతి ఏకంగా ఎల్లలు దాటిన విషయం తెలిసిందే. అటు తెలుగు చిత్రమైన ఆర్ఆర్ఆర్ ఏకంగా ఆస్కార్ వేదికపై సందడి చేసింది. అలా తెలుగు మార్కెట్ ప్రపంచస్థాయిలో పెరిగిపోయిన నేపథ్యంలో చాలామంది ఇతర భాష హీరోలు తెలుగుపై మక్కువ చూపిస్తున్నారు.

ఈ క్రమంలోనే ముఖ్యంగా మాలీవుడ్ హీరోల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇప్పటివరకు మాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్లు ఎక్కువగా తెలుగులో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు వారి బాటలోనే హీరోలు కూడా దూసుకుపోతున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీని టార్గెట్గా చేసుకొని హీరోలుగా, విలన్లుగా తెలుగులో నేరుగా సినిమాలు చేస్తూ ఇక్కడ మార్కెట్ పెంచుకోవడమే కాకుండా టాలీవుడ్ ఫేవరెట్ స్టార్స్ గా కూడా మారుతున్నారు.

మాలీవుడ్ లో సత్తాచాటి ఇప్పుడు టాలీవుడ్ ఫేవరెట్ స్టార్స్ గా మారిన సెలబ్రిటీల విషయానికి వస్తే.. అందులో మొదటి వ్యక్తి పృథ్వీరాజ్ సుకుమారన్.. ఇప్పటికే ప్రభాస్ -ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన సలార్ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన.. ప్రస్తుతం రాజమౌళి - మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న పాన్ వరల్డ్ మూవీ వారణాసిలో కుంభ అనే పాత్రలో నటిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈయన మరోసారి తెలుగులో నటించబోతున్నారనే వార్త వైరల్ గా మారుతోంది. ప్రముఖ డైరెక్టర్ సుజీత్ తో నాని చేయబోయే ప్రాజెక్టులో పృథ్వీరాజ్ సుకుమారన్ ను ఎంచుకున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్న ఈయన ఇప్పుడు టాలీవుడ్ దర్శక నిర్మాతలకు ఫేవరెట్ స్టార్ గా మారిపోయారని చెప్పవచ్చు.

ఇదే తరహాలో మరో హీరో కూడా టాలీవుడ్ కి ఫేవరెట్ స్టార్ గా మారిపోయారు. ఆయన ఎవరో కాదు దుల్కర్ సల్మాన్. ప్రస్తుతం ఈయనను ఎవరూ కూడా మాలీవుడ్ హీరోగా చూడడం లేదు. టాలీవుడ్ హీరో అంటే కాదనే వారు కూడా లేరు అనడంలో సందేహం లేదు. అంతలా తెలుగులో సినిమాలు చేస్తూ తనను తాను తెలుగు హీరోగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు దుల్కర్. సీతారామం సినిమాతో తొలిసారి హీరోగా ప్రేక్షకులను పలకరించిన ఈయన, ఆ తర్వాత లక్కీ భాస్కర్ తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు తెలుగులోనే సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయారు.

ఈ జాబితాలోకి చేరిన మరో హీరో ఫహాద్ ఫాజిల్. పుష్ప సినిమాలో భన్వర్ సింగ్ షెకావత్ గా ఆయన నటనను అంత తేలిగ్గా ఎవరు మర్చిపోలేరు. పుష్ప రెండు పార్ట్ లలో కూడా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక వీరితో పాటు దేవ్ మోహన్, ఉన్ని ముకుందన్ , మోహన్ లాల్ , మమ్ముట్టి, జయ రామ్ , టోవినో థామస్ ఇలా వీరంతా కూడా తెలుగులో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ టాలీవుడ్ ఫేవరెట్ స్టార్స్ గా మారిపోయారు.