Begin typing your search above and press return to search.

అక్క‌డ బాక్సాఫీస్ రిజ‌ల్ట్ అంద‌ని ప‌జిల్!

మాలీవుడ్ బాక్సాఫీస్ అందని పజిల్ లా మారిపోయింది. ఇక్కడ ఏ సినిమా ఎప్పుడు వందల కోట్లు వసూలు చేస్తుందో? ఏ స్టార్ హీరో సినిమా డిజాస్టర్ అవుతుందో? ఊహించడం క‌ష్టంగా మారింది.

By:  Srikanth Kontham   |   24 Jan 2026 2:00 PM IST
అక్క‌డ బాక్సాఫీస్ రిజ‌ల్ట్ అంద‌ని ప‌జిల్!
X

మాలీవుడ్ బాక్సాఫీస్ అందని పజిల్ లా మారిపోయింది. ఇక్కడ ఏ సినిమా ఎప్పుడు వందల కోట్లు వసూలు చేస్తుందో? ఏ స్టార్ హీరో సినిమా డిజాస్టర్ అవుతుందో? ఊహించడం క‌ష్టంగా మారింది. తాజాగా నటుడు నివిన్ పాలీ విషయంలో ఇదే జరిగింది. వరుస ఫ్లాపులతో నివిన్ పాలీ కెరీర్ కంచికి చేరుకుంద‌నుకున్నారంతా. స‌రిగ్గా అదే స‌మ‌యంలో అఖిల్ సత్యన్ దర్శకత్వంలో న‌టించిన `సర్వం మాయ` కంబ్యాక్ చిత్రంగా నిలిచింది. హారర్-కామెడీ ఫాంటసీగా ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన చిత్రం బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేసింది.

ఈ సినిమా ఏకంగా కంప్లీట్ స్టార్ మోహన్ లాల్ న‌టించిన `వృషభ` సినిమాతోనే పోటీపడి మరీ ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల వసూళ్లను రాబట్టింది. దీంతో నివిన్ పాలీ ఫామ్‌లోకి వచ్చాడని అంతా సంబరపడ్డారు. కానీ ఆ సంతోషం నివీన్ స‌హా అభిమానుల‌కు ఎంతో కాలం నిల‌వ‌లేదు. నివిన్ నుండి రిలీజ్ అయిన తాజా చిత్రం `బేబీ గర్ల్` బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. మొదటి రోజు కనీసం కోటి రూపాయల వసూళ్లను కూడా రాబట్టలేక చతికిల పడింది. 150 కోట్ల హిట్ తర్వాత వచ్చే సినిమాకు కనీసం ఓపెనింగ్స్ కూడా రాకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

నిజానికి ఈ పరిస్థితి ఒక్క నివిన్ పాలీకే కాదు. మాలీవుడ్ సూప‌ర్ స్టార్ మోహన్ లాల్ కు కూడా ఎదురైంది. వరుసగా మూడు విజయాలు అందుకున్న తర్వాత ఆయన నటించిన `వృషభ` సినిమా కనీసం 2 కోట్ల మార్కును కూడా దాట లేకపోయింది. `వృష‌భ` మాలీవుడ్ లో సంచ‌లన విజ‌యాన్ని అందుకుంటుంద‌ని, మోహ‌న్ లాల్ పేరిట ఉన్న గ‌త రికార్డుల‌న్నీ చెరిగిపోతాయ‌ని భావించారు. కానీ స‌న్నివేశం అందుకు భిన్నంగా మారింది. అంత‌కు ముందు మ‌మ్ముట్టి న‌టించిన కొన్ని సినిమాల విష‌యంలోనూ ఇదే జ‌రిగింది. భారీ అంచ‌నాల‌తో..భారీ బడ్జెట్ న‌డుమ తెర‌కెక్కించిన సినిమాలు డిజాస్ట‌ర్ అయ్యాయి.

పెట్టిన పెట్టుబ‌డి కూడా రిక‌వ‌రీ చేయ‌లేక‌పోయాయి. కానీ ప‌రిమిత బ‌డ్జెట్ లో ఓ బ‌ల‌మైన కంటెంట్ తో తీసిన సినిమాలు మాత్రం అనూహ్యా విజ‌యాలు న‌మోదు చేసాయి. దీన్ని బట్టి చూస్తే మలయాళ ప్రేక్షకులు కేవలం కంటెంట్ బాగుంటేనే థియేటర్లకు వస్తున్నారని, స్టార్ పవర్ తో పని లేదని మ‌రోసారి ప్రూవ్ చేసారు. మాలీవుడ్ కూడా గ‌త కొంత కాలంగా పాన్ ఇండియా కంటెంట్ పై ఆస‌క్తి చూపిస్తోన్న సంగ‌తి తెలిసిందే. వీటిలో కొన్ని ప్ర‌య‌త్నాలు ఫ‌లించినా కొన్ని ఆశించిన ఫ‌లితాలు సాధించ‌డం లేదు. అయితే మునుప‌టి కంటే మాలీవుడ్ మెరుగ్గానే ప‌ని చేస్తోంది అన్న‌ది వాస్త‌వం.