Begin typing your search above and press return to search.

మోక్షజ్ఞ సినిమాకు చిరు 'విశ్వంభర' అడ్డుగా ఉందా?

నందమూరి అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు, ఇండస్ట్రీ వర్గాల వారు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ విషయమై అధికారిక ప్రకటన వచ్చింది

By:  Ramesh Palla   |   8 Sept 2026 5:00 AM IST
మోక్షజ్ఞ సినిమాకు చిరు విశ్వంభర అడ్డుగా ఉందా?
X

నందమూరి అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు, ఇండస్ట్రీ వర్గాల వారు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ విషయమై అధికారిక ప్రకటన వచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ వారు ఇప్పటికే మోక్షజ్ఞతో తాము సినిమా నిర్మించబోతున్నట్లుగా ప్రకటించారు. అంతే కాకుండా మోక్షజ్ఞ పుట్టిన రోజు సందర్భంగా ఫోటోలను సైతం విడుదల చేయడంతో నందమూరి ఫ్యాన్స్‌ ఉత్సాహం మరింతగా పెరిగింది. మోక్షజ్ఞ మొదటి సినిమాకు దర్శకుడు వశిష్ట దర్శకత్వం వహించబోతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ఆ విషయాన్ని కూడా కన్ఫర్మ్‌ చేసింది. మోక్షజ్ఞ పుట్టిన రోజున మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలతో కలిసి వశిష్ట సైతం ఫోటోల్లో ఉన్నాడు. మోక్షజ్ఞ కోసం వశిష్ట విభిన్నమైన కాన్సెప్ట్‌తో కథ రాసినట్లుగా చెబుతున్నారు. బాలకృష్ణ కు ఆ కథ బాగా నచ్చడం వల్లే మోక్షజ్ఞ మొదటి సినిమాకు వశిష్టను ఎంపిక చేశారని తెలుస్తోంది.

మోక్షజ్ఞ హీరోగా వశిష్ట దర్శకత్వంలో మూవీ...

మోస్ట్‌ అవైటెడ్‌ మూవీ మొదలు కాబోతుందని నందమూరి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూనే మరో వైపు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వశిష్ట ఎంత వరకు మోక్షజ్ఞ స్థాయికి సినిమాను తీయగలడు అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బింబిసార సినిమాతో వశిష్ట మంచి సినిమాను తీశాడు. ఆ సినిమా కమర్షియల్‌గా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. నందమూరి కళ్యాణ్‌ రామ్‌ కి చాలా కాలం తర్వాత ఒక సక్సెస్‌ బింబిసారతో దక్కింది. దాంతో కంటెంట్‌ ఉన్న దర్శకుడు అని వశిష్టపై విమర్శకులు ప్రశంసలు కురిపించారు. బింబిసార వచ్చిన చాలా రోజుల తర్వాత మెగాస్టార్‌ చిరంజీవితో విశ్వంభర సినిమాను వశిష్ట ప్రారంభించాడు. సినిమా ఎప్పుడో రావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు విడుదల తేదీ విషయమై స్పష్టత లేదు. సినిమాకు ఎక్కువ గ్రాఫిక్స్ వర్క్ ఉన్న కారణంగా ఆలస్యం అవుతున్నట్లుగా యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

చిరంజీవి విశ్వంభర మూవీ...

మెగాస్టార్‌ చిరంజీవి సైతం విశ్వంభర ప్రారంభించిన సమయంలో వశిష్టపై ప్రశంసల వర్షం కురిపించాడు. కానీ గ్రాఫిక్‌ వర్క్‌ ను డీల్‌ చేయలేక పోతున్నాడు అనే అసహనం మెగాస్టార్‌ వ్యక్తం చేశాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో పుకార్లు షికార్లు చేశాయి. మొత్తానికి మెగాస్టార్‌ చిరంజీవి విశ్వంభర సినిమాను పూర్తి చేసి విడుదలకు వశిష్ట రెడీ చేస్తున్నాడు. లేట్‌ అయినా కూడా సినిమా కచ్చితంగా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే విశ్వాసంను యూనిట్‌ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. లేట్‌ అయినా కొద్ది సినిమాకు బజ్ తగ్గుతుంది అనేది మరికొందరి వాదన. మొత్తానికి విశ్వంభర సినిమా విడుదల విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. మరో వైపు మోక్షజ్ఞకి కథ రెడీ చేసి, షూటింగ్‌ కు వశిష్ట రెడీ అవుతున్నాడనే వార్తలు వస్తున్నాయి. కానీ ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం విశ్వంభర విడుదలైతే తప్ప వశిష్ట కొత్త సినిమా మొదలు పెట్టే పరిస్థితి లేదట.

బాలకృష్ణ వారసుడి ఎంట్రీ...

విశ్వంభర సినిమాను థియేటర్లకు తీసుకు వచ్చే వరకు వశిష్ట మరో ప్రాజెక్ట్‌ను మొదలు పెట్టకూడదు అనే ఒప్పందంలో ఉన్నారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అదే నిజం అయితే విశ్వంభర సినిమా విడుదల అయ్యే వరకు నందమూరి మోక్షజ్ఞ సినిమా షూటింగ్‌ ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. విశ్వంభర సినిమాను ఈ ఏడాదిలో కచ్చితంగా విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. విశ్వంభర విడుదల అయిన వెంటనే మోక్షజ్ఞతో సినిమాను మొదలు పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఆరంభంలో సినిమాను మొదలు పెడితే వచ్చే ఏడాదిలోనే మోక్షజ్ఞ సినిమా విడుదల అయ్యే అవకాశం ఉంది. మొత్తానికి బాలయ్య కొడుకు సినిమాకు మెగాస్టార్ చిరంజీవి సినిమా అడ్డుగా ఉందనే టాక్‌ వినిపిస్తుంది. మరి ఈ విషయమై దర్శకుడు వశిష్ట ఎలా స్పందిస్తాడు అనేది చూడాలి.