Begin typing your search above and press return to search.

మోక్షజ్ఞ డెబ్యూ.. హ్యాపీ కంటే అనుమానాలే ఎక్కువ

మోక్షజ్ఞ మొదటి సినిమా ఎట్టకేలకు వశిష్ఠ దర్శకత్వంలో ఫిక్స్ అయింది. మైత్రీ మూవీ మేకర్స్ కూడా అధికారికంగా ప్రకటించింది.

By:  M Prashanth   |   16 Sept 2026 11:08 AM IST
మోక్షజ్ఞ డెబ్యూ.. హ్యాపీ కంటే అనుమానాలే ఎక్కువ
X

మోక్షజ్ఞ మొదటి సినిమా ఎట్టకేలకు వశిష్ఠ దర్శకత్వంలో ఫిక్స్ అయింది. మైత్రీ మూవీ మేకర్స్ కూడా అధికారికంగా ప్రకటించింది. నందమూరి అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న అప్డేట్ ఇదే. కానీ అనౌన్స్‌మెంట్ వచ్చిన వెంటనే మరో డౌట్ కూడా మొదలైంది. సినిమా ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుంది? ఎందుకంటే మోక్షజ్ఞ డెబ్యూ విషయంలో గతంలో ఒకసారి సినిమా ప్రకటించి కూడా ముందుకు వెళ్లలేదు.

ముందుగా ప్రశాంత్ వర్మతో మోక్షజ్ఞను పరిచయం చేయాలని ప్లాన్ చేశారు. 2024లోనే ఆ ప్రాజెక్ట్ అధికారికంగా అనౌన్స్ అయింది. పూజ కార్యక్రమం వరకు వచ్చి చివరి సమయంలో ఆగిపోయింది. ఆ తర్వాత సినిమా కొనసాగుతుందని అప్పట్లో నిర్మాతలు చెప్పినా, చివరకు ఆ కాంబినేషన్‌లో మోక్షజ్ఞ డెబ్యూ జరగలేదు. ఇప్పుడు వశిష్ఠ సినిమా రావడంతో మళ్లీ పోస్టర్ కంటే షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందన్న దాని గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు.

వశిష్ఠ ప్రస్తుతం విశ్వంభరకు ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాడు. ఆ సినిమా చాలా కాలంగా రిలీజ్ కోసం ఎదురుచూస్తోంది. వీఎఫ్ఎక్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా ఆలస్యం జరిగింది. సంక్రాంతి అంటున్నా ఇంకా మేకర్స్ నుంచి కొత్త రిలీజ్ డేట్ అధికారికంగా రాలేదు. ఇటీవల ఓటీటీ డీల్ విషయంలో కదలిక వచ్చిందనే రిపోర్ట్స్ ఉన్నా, సినిమా థియేటర్లలోకి ఎప్పుడు వస్తుందనే విషయం ఇంకా ఫిక్స్ కాలేదు.

అయితే విశ్వంభర రిలీజ్ అయ్యే వరకు వశిష్ఠ మరో సినిమా మొదలుపెట్టకూడదనే రూల్ ఏమీ లేదు. వీఎఫ్ఎక్స్, ఫైనల్ ఎడిట్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ లాంటి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో కూడా దర్శకుడి ఇన్‌వాల్వ్‌మెంట్ ఉంటుంది. ఇదే సమయంలో మోక్షజ్ఞ సినిమా ప్రీ ప్రొడక్షన్ కూడా మొదలైతే వశిష్ఠ రెండు సినిమాల మధ్య టైమ్ పంచుకోవాల్సి వస్తుంది. అందుకే మోక్షజ్ఞ సినిమా వెంటనే సెట్స్‌పైకి వెళ్తుందా, లేక విశ్వంభర రిలీజ్ డేట్ ఫిక్స్ అయిన తర్వాత రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందా అనే డౌట్ వస్తోంది.

కానీ మోక్షజ్ఞ విషయంలో టైమింగ్ మాత్రం ముఖ్యమే. ఇప్పటికే ఆయన ఎంట్రీ గురించి రెండేళ్లుగా అనేక అప్డేట్స్ వచ్చాయి. ప్రశాంత్ వర్మ సినిమా ఆగిపోయిన తర్వాత ఇప్పుడు మళ్లీ కొత్త దర్శకుడితో మొదటి నుంచి వెళ్లాల్సి వస్తోంది. వశిష్ఠ కథతో పాటు మోక్షజ్ఞ లుక్, ఇతర నటీనటులు, టెక్నికల్ టీమ్, షూటింగ్ షెడ్యూల్స్ అన్నీ ఫైనల్ కావాలి. డెబ్యూ సినిమా కావడంతో తొందరగా మొదలుపెట్టి మధ్యలో గ్యాప్స్ రావాలని కూడా టీమ్ కోరుకోదు.

ప్రస్తుతానికి మైత్రీ నుంచి వచ్చిన క్లారిటీ మాత్రం ‘త్వరలో ప్రారంభం’ అనే వరకు ఉంది. షూటింగ్ మొదలయ్యే తేదీని ఇంకా ప్రకటించలేదు. మరోవైపు నవంబర్ చివరి వారంలో ఓపెనింగ్ ఉండొచ్చనే కామెంట్స్ వస్తున్నాయి. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే, దర్శకుడు మారినా మోక్షజ్ఞ డెబ్యూ జోన్ మాత్రం పెద్దగా మారకపోవచ్చనే టాక్ ఉంది. ప్రశాంత్ వర్మ సినిమా కూడా ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లోనే ఉండాల్సింది. ఇప్పుడు వశిష్ఠ కూడా బింబిసార, విశ్వంభర తర్వాత అదే తరహా జానర్‌లో మోక్షజ్ఞను పరిచయం చేస్తారనే టాక్ వస్తోంది.