మోక్షజ్ఞ కోసం రంగంలోకి సందీప్ వంగ!
తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్టుకు మరింత పదును పెట్టేందుకు `యానిమల్` ఫేమ్ సందీప్ రెడ్డి వంగ పేరు బలంగా వినిపిస్తోంది.
By: Srikanth Kontham | 10 July 2026 4:00 AM ISTనందమూరి వారసుడు మోక్షజ్ఞ తేజ వెండితెర అరంగేట్రం కోసం నందమూరి అభిమానులు ఎన్నో ఏళ్లుగా వేచి చూస్తున్నారు. బాలకృష్ణ తనయుడిగా ఆయన ఎంట్రీ ఎలా ఉండబోతుందనేది? టాలీవుడ్‌లో ఎప్పుడూ హాట్ టాపిక్కే. గతంలో ప్రశాంత్ వర్మ వంటి దర్శకులతో ప్రాజెక్టులు చర్చల్లోకి వచ్చి నిలిచిపోవడం అభిమానులను నిరాశపరిచినప్పటికీ ఇప్పుడు కథలో కొత్త మలుపులు చోటుచేసుకుంటున్నట్లు సమాచారం. బాలకృష్ణ స్వయంగా కథను పర్యవేక్షిస్తూ కొడుకు లాంచ్ కోసం అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల టాక్.
తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్టుకు మరింత పదును పెట్టేందుకు `యానిమల్` ఫేమ్ సందీప్ రెడ్డి వంగ పేరు బలంగా వినిపిస్తోంది. బాలయ్య రాసుకున్న కథాంశానికి సందీప్ వంగ తనదైన శైలిలో మార్పులు చేస్తున్నారని, ముఖ్యంగా కథనం పాత్రల చిత్రీకరణలో వంగ ప్రత్యేకమైన ముద్ర ఉండేలా ప్లాన్ చేస్తున్నారని సన్నిహితులు చెబుతున్నారు. సందీప్ వంగ తన సినిమాల్లో ఎమోషన్స్‌ని, ఇంటెన్సిటీని ఎలా చూపిస్తారో ? తెలిసిందే. అదే స్థాయిలో మోక్షజ్ఞ డెబ్యూని తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతోందట.
వాస్తవానికి ఒక పెద్ద స్టార్ వారసుడి ఎంట్రీ అంటే ప్రేక్షకుల అంచనాలు ఆకాశాన్నంటుతాయి. ఆ అంచనాలు అందుకోవాలంటే? కథ ఒక్కటే సరిపోదు. దానిని ఎలివేట్ చేసే స్క్రీన్‌ప్లే కీలకం. అందుకే బాలకృష్ణ తన సొంత కథకు సందీప్ వంగ వంటి క్రియేటివ్ మేకర్ ఇన్పుట్స్ తీసుకోవడం అనేది తెలివైన వ్యూహంగా కనిపిస్తోంది. వంగ అందించే కరెక్షన్స్ కథను కొత్త పుంతలు తొక్కించే అవకాశం ఉంది. దీనివల్ల సినిమాకు మాస్ అప్పీల్‌తో పాటు క్లాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు తోడవుతాయి.
సందీప్ వంగ లాంటి దర్శకుడు కథా చర్చల్లో పాల్గొనడం వల్ల ఆ ప్రాజెక్టుకు పాన్-ఇండియా రేంజ్ క్రేజ్ వస్తుందనడంలో సందేహం లేదు. నందమూరి అభిమానులు కోరుకుంటున్నట్లుగా ఒక పవర్ ఫుల్ ఎంట్రీ ఇచ్చేందుకు బాలయ్య టీమ్ ప్రతీ అడుగు చాలా పక్కాగా వేస్తోంది. ఈ మార్పులు సినిమా నాణ్యతను పెంచడమే కాకుండా మోక్షజ్ఞ తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకోవడానికి దోహదపడతాయి. సాధారణ లాంచింగ్ సినిమాలా కాకుండా? ఒక కల్ట్ క్లాసిక్‌గా ఈ చిత్రాన్ని మలచాలనేదే మేకర్స్ తాపత్రయం కనిపిస్తోంది.
సందీప్ వంగ స్టైలిష్ మేకింగ్ ..నందమూరి వారసత్వం కలిస్తే బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. మొత్తానికి నందమూరి అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు త్వరలోనే తెరపడనుందని తెలుస్తోంది. మరి ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఎదురు చూడాల్సిందే.
