బాలయ్య వారసుడు.. అసలు కథ ఎంతవరకు వచ్చింది?
నందమూరి అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మూమెంట్.. నటసింహం బాలకృష్ణ వారసుడు నందమూరి మోక్షజ్ఞ తేజ ఎంట్రీ అని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.
By: M Prashanth | 5 April 2026 1:33 PM ISTనందమూరి అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మూమెంట్.. నటసింహం బాలకృష్ణ వారసుడు నందమూరి మోక్షజ్ఞ తేజ ఎంట్రీ అని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. కొన్నేళ్లుగా మోక్షు బాబు డెబ్యూ గురించి వార్తలు వస్తూనే ఉన్నప్పటికీ, ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం వెలువడకపోవడం అభిమానుల్లో కొంత నిరాశ కలిగిస్తోంది.
నిజానికి టాలీవుడ్ లో స్టార్ హీరోల వారసుల ఎంట్రీలు ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటాయి. ఆ నేపథ్యంలో మోక్షజ్ఞ ఎంట్రీపై ప్రతి చిన్న సమాచారం కూడా సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతోంది. తాజాగా కూడా కొన్ని కొత్త వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అవి ఎంతవరకు నిజమో అన్నది మాత్రం స్పష్టంగా తెలియడం లేదు. దీంతో అంతా డిస్కస్ చేసుకుంటున్నారు.
మొదటగా హనుమాన్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞను లాంచ్ చేయనున్నట్లు అనౌన్స్మెంట్ వచ్చింది. కానీ ఆ ప్రాజెక్ట్ అనివార్య కారణాల వల్ల ముందుకు సాగలేదని చెప్పాలి. ఆ తర్వాత దర్శకులు తేజ, బోయపాటి శ్రీను పేర్లు కూడా వినిపించాయి. కానీ ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాలేదు.
రీసెంట్ గా మరో కొత్త కాంబినేషన్ చర్చనీయాంశంగా మారింది. యంగ్ హీరో నానితో సరిపోదా శనివారం సినిమాతో గుర్తింపు పొందిన దర్శకుడు వివేక్ ఆత్రేయతో మోక్షజ్ఞ సినిమా చేయనున్నారనే టాక్ కొన్ని రోజుల పాటు నెట్టింట వైరల్ అయింది. ఆ కాంబినేషన్ పై అధికారికంగా ఎలాంటి ప్రకటన లేకపోయినా, ఇది అభిమానుల్లో కొత్త ఆసక్తి రేకెత్తిస్తోంది.
మరోవైపు, మోక్షజ్ఞ తొలి సినిమా ఆదిత్య 369కు సీక్వెల్ గా ఆదిత్య 999 మ్యాక్స్ తెరకెక్కించనున్నట్లు కూడా చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఆ ప్రాజెక్ట్ ను దర్శకుడు క్రిష్ జాగర్లమూడి రూపొందించనున్నారని వార్తలు వచ్చినప్పటికీ, దీనిపై కూడా ఇప్పటివరకు ఎలాంటి అధికారిక అప్డేట్ లేదు. అంతేకాకుండా, ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయని, ఏప్రిల్ నెలలో షూటింగ్ ప్రారంభమవుతుందని కూడా ఇటీవల వార్తలు వినిపించాయి.
కానీ ఇప్పటికే ఏప్రిల్ నెల ప్రారంభమై ఐదు రోజులు గడిచినా, ఎలాంటి ప్రకటన లేదా అప్డేట్ వెలువడకపోవడం గమనార్హం. దీంతో అభిమానుల్లో మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి. మోక్షజ్ఞ ఎంట్రీపై అదిగో వస్తోంది… ఇదిగో ప్రారంభం… అనే మాటలు చాలాకాలంగా వినిపిస్తున్నప్పటికీ, ఇప్పటికీ స్పష్టత లేకపోవడం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది.
కనీసం అఫీషియల్ అనౌన్స్మెంట్ అయినా ఇవ్వాలని వారు సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు. అసలు ప్లాన్ ఏంటంటూ క్వశ్చన్ చేస్తున్నారు. మొత్తానికి, మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది? ఏ దర్శకుడితో మొదటి సినిమా వస్తుంది? అనే ప్రశ్నలు.. ఇంకా సమాధానం కోసం వేచి చూస్తూనే ఉన్నాయి. ఏదేమైనా నందమూరి అభిమానులు మాత్రం ఆ రోజు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరెప్పుడు క్లారిటీ వస్తుందో ఏంటో..
