నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ ముహూర్తం?
విశ్వవిఖ్యాత నవరసనటసార్వభౌముడు నందమూరి తారక రామారావు నటవారసుడిగా నందమూరి బాలకృష్ణ లెగసీని విజయవంతంగా ముందుకు నడిపిస్తున్న సంగతి తెలిసిందే.
By: Sivaji Kontham | 21 Aug 2025 9:34 AM ISTవిశ్వవిఖ్యాత నవరసనటసార్వభౌముడు నందమూరి తారక రామారావు నటవారసుడిగా నందమూరి బాలకృష్ణ లెగసీని విజయవంతంగా ముందుకు నడిపిస్తున్న సంగతి తెలిసిందే. పరిశ్రమ నాలుగు స్థంభాల్లో ఒకరిగా ఆయన గొప్ప హోదాను కలిగి ఉన్నారు. నటసింహం ఇప్పటికే 100 పైగా చిత్రాలతో అప్రతిహతంగా జైత్రయాత్రను సాగిస్తున్నారు. అయితే ఎన్బీకే నటవారసుడు మోక్షజ్ఞ సినీ ఆరంగేట్రం అంతకంతకు ఆలస్యమవుతుండడం అభిమానుల్లో ఆందోళన పెంచుతోంది. బాలయ్య బాబు చిన్న వయసు నుంచే నటుడిగా తన ప్రతిభను నిరూపించారు. యుక్తవయసులో కథానాయకుడిగా ఆరంగేట్రం చేసి పరిశ్రమ అగ్ర కథానాయకులలో ఒకరిగా ఎదిగారు. కానీ మోక్షజ్ఞ సినీఆరంగేట్రం విషయంలో స్పష్ఠత లేకుండా పోయిందనే ఆందోళన అభిమానుల్లో ఉంది.
2018 నుంచి మోక్షజ్ఞ డెబ్యూ సినిమాని తొందర్లోనే ప్రకటిస్తామని నందమూరి కుటుంబం ఊరిస్తూనే ఉంది. కానీ ఇప్పటికీ ఆ ఒక్క పెద్ద ప్రకటన రాలేదు. ఎన్బీకే నటించిన క్లాసిక్ మూవీ ఆదిత్య 369 సీక్వెల్ గా ఆదిత్య 999 స్క్రిప్టు రెడీ అయిందని, ఈ చిత్రంలో మోక్షజ్ఞ నటిస్తారని కొంతకాలం ప్రచారమైంది. కానీ అది నిజం కాలేదు. ఆ తర్వాత బోయపాటి శ్రీను, మలినేని గోపిచంద్, అనీల్ రావిపూడి వంటి దర్శకుల పేర్లు మోక్షు డెబ్యూ సినిమా జాబితాలో వినిపించాయి. కానీ వీళ్లలో ఎవరూ ఫైనల్ కాలేదని తాజా పరిణామం చెబుతోంది.
ఇప్పటికీ మోక్షజ్ఞ డైలమాలోనే ఉన్నాడా? అంటే.. ఈ ప్రశ్నకు తాజా ఇంటర్వ్యూలో హీరో నారా రోహిత్ జవాబిచ్చారు. మోక్షజ్ఞ డెబ్యూ సినిమా 2025 చివరిలో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో ఉండేందుకు ఆస్కారం ఉందని చెప్పుకొచ్చారు. ఒక హీరోగా అవసరమైన శారీరక పరివర్తన కూడా ఇప్పుడు ఉంది. అతడు పర్ఫెక్ట్ ఫిట్ గా ఉన్నాడు. చాలా మారాడు అని తెలిపారు రోహిత్. ఇటీవలే నేను మోక్షజ్ఞతో మాట్లాడాను. అతడు ప్రస్తుతం సరైన స్క్రిప్టు గురించి వెతుకుతున్నాడు. ఏదో ఒక నచ్చిన స్క్రిప్టును ఫైనల్ చేసే దిశగా ఆలోచిస్తున్నారని కూడా నారా రోహిత్ వెల్లడించారు. అయితే మోక్షజ్ఞ డెబ్యూ మూవీ గురించి ఇంకా నందమూరి కుటుంబం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
