Begin typing your search above and press return to search.

లేట్ డెబ్యూ.. మోక్షజ్ఞ కథ లెక్క మారాల్సిందేనా..

స్టార్ హీరో కొడుకు ఎంట్రీ అంటే నార్మల్ గానే ఒక లెక్క ఉంటుంది. ఇరవై ఏళ్ల వయసులోనే హీరోగా వచ్చేస్తాడు.

By:  M Prashanth   |   28 Aug 2026 10:56 AM IST
లేట్ డెబ్యూ.. మోక్షజ్ఞ కథ లెక్క మారాల్సిందేనా..
X

స్టార్ హీరో కొడుకు ఎంట్రీ అంటే నార్మల్ గానే ఒక లెక్క ఉంటుంది. ఇరవై ఏళ్ల వయసులోనే హీరోగా వచ్చేస్తాడు. లవ్ స్టోరీనో, యాక్షన్ సినిమానో పట్టుకుని మొదటి సినిమాతో తనను పరిచయం చేసుకుంటాడు. కానీ మోక్షజ్ఞ విషయంలో ఆ లెక్క ఇప్పటికే మారిపోయింది. ప్రస్తుతం వయసు 31 ఏళ్లు. ఇంతకాలం ఎదురుచూసిన తర్వాత ఇప్పుడు చేసే మొదటి సినిమా కూడా రెగ్యులర్ లాంచ్ మూవీలా ఉండటం అంత ఈజీ కాదు.

ఎందుకంటే 21, 22 ఏళ్ల హీరోకు సెట్ అయ్యే కథను 31 ఏళ్ల మోక్షజ్ఞకు అలాగే చేయలేరు. కాలేజ్ బ్యాక్‌డ్రాప్, కొత్తగా ప్రేమలో పడే కుర్రాడు, హీరోను పరిచయం చేయడం కోసమే పెట్టే నాలుగు ఫైట్లు లాంటి పాత లాంచ్ ఫార్ములా ఇప్పుడు సరిపోకపోవచ్చు. మొదటి సినిమానే అయినా పాత్రలో కాస్త మెచ్యూరిటీ ఉండాల్సిన అవసరం వస్తుంది. ఇక్కడే కథ ఎంపిక చాలా కీలకంగా మారుతుంది.

నిజానికి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ప్రయత్నాలు ఇప్పటివి కావు. 2024లోనే ప్రశాంత్ వర్మతో సినిమాను ప్రకటించారు. ఫస్ట్ లుక్ కూడా వచ్చింది. మైథాలజీ టచ్ ఉన్న సోషియో ఫాంటసీగా ఆ సినిమాను ప్లాన్ చేశారు. కానీ అది సెట్స్‌పైకి వెళ్లలేదు. ఇప్పుడు వశిష్ఠ పేరు వినిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే అవకాశం ఉందనే టాక్ ఉంది. అయితే కాంబినేషన్‌పై ఇంకా అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.

అందుకే ఈసారి దర్శకుడు ఎవరు అన్నదానికంటే కథ ఏంటి అన్నదే పెద్ద విషయం. మోక్షజ్ఞను బాలకృష్ణ వారసుడిగా చూపించే సినిమా చేస్తే మొదటి రోజు వరకు హైప్ తీసుకురావచ్చు. కానీ హీరోగా నిలబడాలంటే తన వయసుకు, లుక్‌కు సెట్ అయ్యే పాత్ర కావాలి. మొదటి సినిమానే అయినా కొత్త హీరో కోసం రాసిన పాత్రలా కాకుండా, కథలోనే బరువు ఉన్న క్యారెక్టర్ దొరికితే పరిస్థితి వేరుగా ఉంటుంది.

పైగా ఇప్పుడు ప్రేక్షకులు కూడా స్టార్ కిడ్ డెబ్యూ అని ప్రత్యేకంగా సాఫ్ట్ కార్నర్ చూపించే పరిస్థితి లేదు. సినిమా మొదలైన కొద్దిసేపటికే హీరో ఎలా ఉన్నాడు, నటన ఎలా ఉంది, స్క్రీన్ మీద సెట్ అయ్యాడా లేదా అన్న లెక్క మొదలవుతుంది. మోక్షజ్ఞ విషయంలో ఎదురుచూపులు చాలా కాలంగా ఉండటంతో ఆ పరీక్ష ఇంకాస్త ఎక్కువగానే ఉంటుంది.

ఆలస్యమైన డెబ్యూ మొత్తం మైనస్ అని చెప్పలేం. సరైన కథ దొరికితే అదే మోక్షజ్ఞకు ప్లస్ కూడా కావచ్చు. చిన్న వయసులో చేసే రెగ్యులర్ లాంచ్ సినిమా దాటేసి, మొదటి సినిమాతోనే కాస్త సెటిల్డ్ క్యారెక్టర్‌లో కనిపించే ఛాన్స్ ఉంది. ఇప్పుడు వశిష్ఠ అయినా మరో దర్శకుడు అయినా, మోక్షజ్ఞను ఎవరు లాంచ్ చేస్తారన్నదానికంటే ఎలాంటి పాత్రతో లాంచ్ చేస్తారన్నదే అసలు లెక్క. మోక్షజ్ఞ పుట్టినరోజు సెప్టెంబర్ 6. మరి ఆ రోజు అయినా ఏమైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి.