Begin typing your search above and press return to search.

ఉర్మిళా మటోండ్కర్ మాజీ భర్త రెండో పెళ్లి ఫోటోలు వైరల్

బాలీవుడ్ నటి ఉర్మిళా మటోండ్కర్ మాజీ భర్త, వ్యాపారవేత్త కం మోడల్ అయిన మొహసిన్ అక్తర్ మీర్ తన రెండో పెళ్లికి సంబంధించిన రిసెప్షన్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసారు.

By:  Sivaji Kontham   |   13 Aug 2026 5:00 AM IST
ఉర్మిళా మటోండ్కర్ మాజీ భర్త రెండో పెళ్లి ఫోటోలు వైరల్
X

బాలీవుడ్ నటి ఉర్మిళా మటోండ్కర్ మాజీ భర్త, వ్యాపారవేత్త కం మోడల్ అయిన మొహసిన్ అక్తర్ మీర్ తన రెండో పెళ్లికి సంబంధించిన రిసెప్షన్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసారు. నిధా భట్‌ను వివాహం చేసుకున్న కొద్ది నెలల తర్వాత ఈ వేడుకకు సంబంధించిన అందమైన ఫోటోలను అభిమానులతో షేర్ చేస్తూ తన భార్యపై ఉన్న ప్రేమను వ్యక్తపరిచారు. నిధా తన జీవితంలోకి వచ్చాక తనకు ఎంతో ప్రశాంతత లభించిందని.. ఆమెనే తన 'ఇల్లు', 'శాంతి' అని సంబోధిస్తూ సోషల్ మీడియాలో ఒక భావోద్వేగమైన నోట్‌ను పోస్ట్ చేశారు.




ఈ ఏడాది జూన్ నెలలోనే మొహసిన్ తన పెళ్లి వార్తను అధికారికంగా ప్రకటిస్తూ నిధా భట్‌తో కలిసి ఉన్న వివాహ ఫోటోలను పంచుకున్నారు. తాజాగా జరిగిన రిసెప్షన్ వేడుకకు సంబంధించిన కొత్త ఫోటోలను విడుదల చేస్తూ.. ''నువ్వు కేవలం నా భార్యవి మాత్రమే కాదు.. నా ఇల్లు.. నా మనశ్శాంతి... నా ప్రతి రోజులో నాకు అత్యంత ఇష్టమైన భాగం అయ్యావు. నిన్ను నా జీవితంలోకి తీసుకొచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మన ప్రయాణంలో ప్రతి అడుగునా నిన్ను గుండెల్లో పెట్టుకుని ప్రేమిస్తానని మాటిస్తున్నాను'' అని రాసుకొచ్చారు.




గతంలో తమ వివాహాన్ని మొదట ప్రకటించిన సమయంలో కూడా మొహసిన్ దేవుడి స్క్రిప్ట్, సహనం, నమ్మకం గురించి ఒక వ్యక్తిగత సందేశాన్ని రాశారు. పవిత్రమైన ఆలోచనలు.. నిజాయితీ గల ప్రేమ.. హృదయం నిండా సహనం .. కృతజ్ఞతా భావం ఉంటే అల్లాహ్ రాసే స్క్రిప్ట్ ఎప్పుడూ అద్భుతంగా ఉంటుంది. సరైన సమయంలో నా జీవితంలోకి నా అందమైన భార్య నిధాను పంపి దేవుడు నన్ను దీవించాడు. నా జీవితంలో వెలుగులు నింపినందుకు థ్యాంక్స్ మై లవ్! అని ఆయన ఆ నోట్‌లో పేర్కొన్నారు.




నిధా భట్‌తో పెళ్ళికి ముందు మొహసిన్ అక్తర్ మీర్... ప్రముఖ నటి ఉర్మిళా మటోండ్కర్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 4 ఫిబ్రవరి 2016న అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. కాశ్మీర్‌కు చెందిన వ్యాపారవేత్త - మోడల్ అయిన మొహసిన్.. ఉర్మిళ కంటే దాదాపు 10 ఏళ్లు చిన్నవాడు కావడం .. వీరిది భిన్న మతాల వివాహం కావడంతో ఆ సమయంలో వీరి పెళ్లి మీడియాలో విశేషంగా నిలిచింది. ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా మేనకోడలి పెళ్లిలో 2014లో వీరిద్దరూ మొదటిసారి కలుసుకున్నారు.

సుదీర్ఘ కాలం పాటు కలిసి ఉన్న ఈ దంపతులు ఎనిమిదేళ్ల దాంపత్య జీవితం తర్వాత విభేదాల కారణంగా విడిపోయారు. 2024లో ఉర్మిళా మటోండ్కర్, మొహసిన్ అక్తర్ మీర్ నుండి విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించినట్లు కథనాలు నిర్ధారించాయి. విడాకుల ప్రక్రియ పూర్తయిన అనంతరం మొహసిన్ తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తూ నిధా భట్‌ను వివాహం చేసుకోగా.. ప్రస్తుతం వీరి రిసెప్షన్ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. రంగీలా చిత్రంతో బాలీవుడ్ కి ప‌రిచ‌య‌మైన ఊర్మిల ఆర్జీవీ డిస్క‌వ‌రీగా పాపుల‌రైన సంగ‌తి తెలిసిందే. న‌టించిన మొద‌టి సినిమాతోనే సంచ‌ల‌న న‌టిగా పాపుల‌రై, ఆ త‌ర్వాత ప‌రిశ్ర‌మ హిందీ అగ్ర హీరోల స‌ర‌స‌న న‌టించిన ఊర్మిళ తెలుగులోను అగ్ర హీరోల స‌ర‌స‌న న‌టించింది. ఆ త‌ర్వాత కెరీర్ ముగిసే క్ర‌మంలోనే మోడ‌ల్ కం వ్యాపార‌వేత్త మోహసిన్ ని పెళ్లాడారు ఊర్మిళ‌. కానీ విభేధాల‌తో ఆ ఇద్ద‌రూ విడిపోయారు. ఇప్పుడు ఊర్మిళ మాజీ భ‌ర్త వేరొక‌రిని పెళ్లాడారు.