త్రోబ్యాక్: 'ఆదిత్య 369' బ్యూటీ సంచలన ఆరోపణలు
స్విమ్ సూట్ సీన్ లో నటించే ముందు తాను ఏడ్చానని కూడా మోహిని గుర్తు చేసుకున్నారు. మొదట నిరాకరించాను.
By: Sivaji Kontham | 15 Sept 2025 1:00 AM ISTనందమూరి బాలకృష్ణ నటించిన `ఆదిత్య 369`లో నటించింది మోహిని. గాజు కళ్లు, తనదైన అందం, అద్భుత హావభావాలతో ఆకర్షించిన ఈ బ్యూటీ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ సినిమా తెలుగు సినిమా క్లాసిక్స్ లో ఒకటిగా నిలిచిన సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో నటించిన మోహిని ఇటీవల సినీరంగానికి దూరంగా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి `హిట్లర్`లో సోదరి పాత్రలోను మోహిని నటించింది. కెరీర్ లో మోహన్‌లాల్, మమ్ముట్టి, విజయకాంత్, శివరాజ్‌కుమార్, విష్ణువర్ధన్, విక్రమ్, శరత్‌కుమార్ , సురేష్ గోపి వంటి దిగ్గజాల సరసనా నటించింది. ఆదిత్య 369, హిట్లర్, నాడోడి, సైన్యం, వేషం, ఒరు మరవత్తూర్ కనవు, గదిబిడి అలియా, త్యాగం వంటి చిత్రాలలో నటించింది. 2011లో మలయాళ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ కలెక్టర్‌లో చివరిసారిగా నటించింది. ఈ దశాబ్ధ కాలంలో మోహిని తిరిగి తెరపైకి రాలేదు.
కానీ చాలా కాలానికి ఒక ఇంటర్వ్యూ కారణంగా మోహిని పేరు మరోసారి మార్మోగుతోంది. ఇటీవల అవల్ వికటన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూపలో తన కెరీర్‌లో జరిగిన ఒక బలవంతపు ఎపిసోడ్ గురించి మాట్లాడారు. దర్శకుడు ఆర్‌కె సెల్వమణి చిత్రం కన్మణిలో తన అనుమతి లేకుండా స్టీమీ స్విమ్‌సూట్ సన్నివేశాల్లో కనిపించాలని తనపై ఒత్తిడి తెచ్చారని మోహిని వెల్లడించారు. తన అసౌకర్యాన్ని పదేపదే వ్యక్తపరిచినా కానీ, ఆ సీన్స్ చేయాల్సిందేనని అతడు పట్టుబడట్టడంతో తాను చేయవలసి వచ్చిందని గుర్తుచేసుకున్నారు.
స్విమ్ సూట్ సీన్ లో నటించే ముందు తాను ఏడ్చానని కూడా మోహిని గుర్తు చేసుకున్నారు. మొదట నిరాకరించాను. దానివల్ల సగం రోజు షూట్ ఆగిపోయింది. నాకు ఈత కొట్టడం కూడా తెలియదని చెప్పాను. నేను మగాళ్ల ముందు సగం దుస్తులతో కనిపించడాన్ని ఊహించలేకపోయానని మోహిని తెలిపారు. ఆ సీన్ బలవంతంగా చేసినట్టు అనిపించిందని కూడా మోహిని అన్నారు. చివరికి దర్శకుడి ఒత్తిడికి తలొంచి, మోహిని చివరికి షూటింగ్ పూర్తి చేయడానికి లొంగిపోయానని తెలిపింది.
నేను అలా చేస్తే సినిమాకు నష్టం ఏమీ లేదు. కానీ అది నాకు అనుభవంగా మిగిలిపోయిందని మోహిని వెల్లడించింది. సగం రోజు పని చేసినా వారు అడిగినది ఇచ్చాను. అదే సీన్ ని ఊటీలోను ప్లాన్ చేసారు. కానీ నేను నిరాకరించాను. ఇకపై షూటింగు కొనసాగదు! అని వారు బెదిరించినా.. అది మీ సమస్య.. నాది కాదు! అని అన్నాను అని గుర్తు చేసుకుంది.
కన్మణి తన ఇష్టానికి వ్యతిరేకంగా ఎక్కువ గ్లామరస్ గా కనిపించిన సినిమా అని తెలిపింది. కొన్నిసార్లు జీవితంలో ఇష్టానికి వ్యతిరేకంగా జరుగుతుంటాయని కూడా అంగీకరించింది. చాలా గ్లామరస్ గా సవాల్ తో కూడుకున్న పాత్రలో నటించినా దానికి సరైన గుర్తింపు దక్కలేదని మోహిని తెలిపింది. చాలా మంది మహిళలు సినీపరిశ్రమలో ఒత్తిళ్ల కారణంగా చివరికి ఇలాంటి పరిస్థితుల్లోకి నెట్టబడతారని తెలిపింది.
