మరో స్టార్ హీరో డాటర్ ఎంట్రీ షురూ!
మాలీవుడ్ స్టార్ మోహన్ లాల్ ఎంత పెద్ద స్టార్ అన్నది చెప్పాల్సిన పనిలేదు. దాదాపు ఐదు దశాబ్దాల అనుభవం ఉన్న నటుడు.
By: Srikanth Kontham | 31 Oct 2025 1:30 PM ISTమాలీవుడ్ స్టార్ మోహన్ లాల్ ఎంత పెద్ద స్టార్ అన్నది చెప్పాల్సిన పనిలేదు. దాదాపు ఐదు దశాబ్దాల అనుభవం ఉన్న నటుడు. మాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్, శాండిల్ వుడ్ ఇలా అన్ని భాషల్లోనూ సినిమాలు చేసారు. మాలీవుడ్ లో మాత్రం మెగాస్టార్ గా నీరాజనాలు అందుకుంటున్నారు. ఆయన వారసత్వంతో కుమారుడు ప్రణవ్ లాల్ కూడా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రణవ్ హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇతడు పరిశ్రమకు వచ్చి చాలా కాలమవుతున్నా? కెరీర్ పై సీరియస్ గా ఫోకస్ చేయలేదు. లేదంటే ప్రణవ్ ట్యాలెంట్ కి పెద్ద స్టార్ అయ్యేవాడు.
డైరెక్టర్ కుమారుడే హీరోగా:
సీరియస్ గా ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నాడు. సౌత్ మార్కెట్ ని టార్గెట్ చేసి సినిమాలు చేస్తున్నాడు. తెలుగులోనూ రాణించడానికి రెడీ అవుతున్నాడు. ఈ నేపథ్యంలో మోహన్ లాల్ కుమార్తె విస్మయ కూడా తెరంగేట్రం చేస్తోన్న విషయం వెలుగులోకి వచ్చింది. `తుడక్కమ్` సినిమాతో అమ్మడు హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది. జుడే అంథోనీ జోసెఫ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో ఆంథోనీ కుమారుడే హీరోగా నటిస్తున్నాడు. అతడి పేరు అశిష్ జో ఆంటోనీ. ఈ సినిమా ప్రారంబోత్సవం ఇటీవలే జరిగింది. ఈ సందర్భంగా కుమార్తె ఎంట్రీని ఉద్దేశించి మోహన్ లాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
నటన అంత సులభం కాదు:
తాను ఎప్పుడు నటుడు అవ్వాలనుకోలేదని.. విధి మాత్రమే తనని నటుడిని చేసిందన్నారు. ఇప్పుడు తన కుమార్తె సినిమాల్లో నటించాలని విధి కోరుకుందన్నారు. దాన్ని సాధ్యం చేయడానికి తమకు అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ నటన మాత్రం అనుకున్నంత సులభం కాదన్నారు. సినిమా అనేది ఎప్పుడు వన్ మ్యాన్ షో కాదని, మంచి కథతో పాటు అందులో నటించే మిగతా నటీనటులు, పనిచేసే సాంకేతిక బృందం అంతా బాగున్నప్పుడే సక్సస్ సాధ్యమవుతుందన్నారు. ఆ విషయంలో విస్మయ అదృష్ట వంతురాలిగా ఉండాలని కోరుకున్నారు.
సెంటిమెంట్ బ్రేక్ చేస్తుందా?
మరి విస్మయ ఎంతటి ప్రతిభావంతురాలు అన్నది చూడాలి. చిత్ర పరిశ్రమలో వారసులు సక్సెస్ అయినంతగా వారసురాళ్లు సక్సెస్ అవ్వడం లేదు. కొన్ని సినిమాలు చేసి వెళ్లిపోవడం తప్ప సీరియస్ గా కెరీర్ పై దృష్టి పెట్టడం లేదనే ఆరోపణ చాలా కాలంగా ఉంది. రాధ కుమార్తెలు కార్తీక, తులసి హీరోయిన్లు అవ్వాలని వచ్చారు. కానీ నిలదొక్కుకోలేపోయారు. నాగబాబు కుమార్తె కూడా పెద్ద హీరోయిన్ అవ్వాలనుకున్నారు. కానీ అవ్వలేదు. మరి లాల్ కుమార్తె ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేసి అగ్ర హీరోయిన్ గా ఎదుగుతుందేమో చూడాలి.
