సక్సెస్‌ఫుల్ హీరో సినిమాకు దారుణమైన రిజల్ట్
వరుస హిట్లలో ఉన్న వారి నుంచి ఏదైనా సినిమా వస్తుందంటే దానికి మంచి క్రేజ్, ఓపెనింగ్స్ రావడం సహజం.
By: Sravani Lakshmi Srungarapu | 2 Jan 2026 12:20 PM ISTవరుస హిట్లలో ఉన్న వారి నుంచి ఏదైనా సినిమా వస్తుందంటే దానికి మంచి క్రేజ్, ఓపెనింగ్స్ రావడం సహజం. అయితే అన్ని సార్లూ ఇదే జరుగుతుందని చెప్పలేం. ఎక్కువ శాతం మంచి క్రేజ్, హైప్, ఓపెనింగ్స్ వస్తుంటాయి కానీ కొన్నిసార్లు మాత్రం కనీస బజ్ లేకుండా సినిమా థియేటర్లలోకి ఎప్పుడొచ్చిందనేది కూడా తెలియకుండా ఉంటుంది.
ఎల్2: ఎంపురాన్ తో ఇండస్ట్రీ హిట్
ఇప్పుడు మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్‌కు అదే పరిస్థితి ఎదురైంది. గతేడాది మొత్తం మోహన్ లాల్ మంచి ఫామ్ లో ఉన్నారు. ఈ సీనియర్ హీరో నుంచి గతేడాది రిలీజైన సినిమాలన్నీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకున్నాయి. గతేడాది మార్చిలో వచ్చిన ఎల్2: ఎంపురాన్ డివైడ్ టాక్ తోనే మలయాళ ఇండస్ట్రీలో హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచిన సంగతి తెలిసిందే.
మంచి సక్సెస్ లుగా తుదరమ్, హృదయపూర్వమ్
ఆ తర్వాత వచ్చిన తుదరమ్ మూవీ ఇండియాలో హయ్యెస్ట్ కలెక్షన్స్ అందుకున్న మలయాళ సినిమాగా రికార్డు అందుకుంది. తుదరమ్ రూ.240 కోట్లను వసూలు చేసింది. ఇక తర్వాత వచ్చిన హృదయపూర్వం మూవీ కూడా రూ.100 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. అలాంటి వరుస హిట్లలో ఉన్న హీరో నుంచి ఇయర్ ఎండింగ్ లో వృషభ అనే సినిమా వచ్చింది.
ఎలాంటి బజ్ లేకుండా వచ్చిన వృషభ
వృషభ సినిమా మొదలైనప్పుడు మంచి బజ్ ఉంది. కానీ తర్వాత్తర్వాత సినిమాను సరిగా ప్రమోట్ చేయకపోవడం వల్లనో ఏమో రిలీజ్ డేట్ గురించి ఆడియన్స్ కు మినిమం ఇన్ఫర్మేషన్ లేదు. బజ్ లేకుండా రిలీజవడంతో ఓపెనింగ్స్ కూడా సరిగా రాలేదు. క్రిస్మస్ కానుకగా రిలీజైన ఈ మూవీ దారుణమైన ఓపెనింగ్స్ ను తెచ్చుకుంది. క్రిస్మస్ వీకెండ్ అయినప్పటికీ ఈ మూవీకి ఇప్పటివరకు రూ.2 కోట్ల కలెక్షన్లు కూడా రాకపోవడం అందరికీ షాకింగ్ గా మారింది.
వరుస హిట్లలో ఉన్న హీరో నుంచి వచ్చిన ఈ సినిమా ఈ తరహా కలెక్షన్లను అందుకోవడం చాలా వింతగా ఉంది. కనీసం మోహన్ లాల్ ఫ్యాన్స్ అందరూ ఈ సినిమా చూసినా వృషభకు కలెక్షన్లు ఇంకా మెరుగ్గా ఉండేవి. కానీ ఈ సినిమా విషయంలో అది కూడా జరగలేదని స్పష్టంగా అర్థమవుతుంది. పైగా సినిమాకు ఇంకా డిజిటల్, శాటిలైట్ రైట్స్ అమ్ముడవలేదని తెలుస్తోంది. బాక్సాఫీస్ వద్ద వృషభ పెర్ఫార్మెన్స్ చూశాక ఇప్పుడు ఈ సినిమాకు ఆ బిజినెస్ జరగడం కూడా కష్టమే. ఇవన్నీ చూస్తుంటే నిర్మాతకు ఈ సినిమా కోసం పెట్టిన ప్రతీ పైసా నష్టమే అని క్లారిటీ వస్తోంది.
