Begin typing your search above and press return to search.

మోహ‌న్ లాల్ వ‌ద్ద‌నుకుని మంచి పనే చేశారా?

ఎలాంటి పాత్ర‌లోనైనా, ఏ విధ‌మైన స‌న్నివేశంలోనైనా ఆయ‌న ఇట్టే ఇమిడిపోయి, ఆ పాత్ర‌కు ఎంత కావాలో స‌రిగ్గా తూకం వేసిన‌ట్టు న‌టించ‌డంలో ఆయ‌న దిట్ట‌

By:  Sravani Lakshmi Srungarapu   |   5 Oct 2025 4:27 PM IST
మోహ‌న్ లాల్ వ‌ద్ద‌నుకుని మంచి పనే చేశారా?
X

మ‌ల‌యాళ న‌టుడు మోహ‌న్ లాల్ కు కంప్లీట్ యాక్ట‌ర్ అనే పేరు ఊరికే రాలేదు. ఎలాంటి పాత్ర‌లోనైనా, ఏ విధ‌మైన స‌న్నివేశంలోనైనా ఆయ‌న ఇట్టే ఇమిడిపోయి, ఆ పాత్ర‌కు ఎంత కావాలో స‌రిగ్గా తూకం వేసిన‌ట్టు న‌టించ‌డంలో ఆయ‌న దిట్ట‌. కంప్లీట్ యాక్ట‌ర్ అనేది మోహ‌న్ లాల్ ఎన్నో ఏళ్లు క‌ష్ట‌ప‌డి తెచ్చుకున్న ట్యాగ్ లైన్. అందుకే దాన్ని చాలా జాగ్ర‌త్త‌గా కాపాడుకుంటూ వ‌స్తున్నారాయ‌న‌.

వ‌రుస స‌క్సెస్‌ల‌తో మోహ‌న్ లాల్

వ‌చ్చే ప్రతీ అవ‌కాశాన్నీ ఎంతో క్షుణ్ణంగా ప‌రిశీలించి, ఒక‌టికి ప‌ది సార్లు ఈ సినిమా చేయొచ్చా అని ఆలోచించి, అప్ప‌టికీ ఓకే అనుకుంటేనే ఆ సినిమాను ఓకే చేస్తున్నారు త‌ప్పించి ఏది ప‌డితే అది చేయ‌డం లేదు. అందులో భాగంగానే మోహ‌న్ లాల్ ఇప్పుడో బ‌యోపిక్ ఆఫ‌ర్ ను రిజెక్ట్ చేశారని తెలుస్తోంది. ఆల్రెడీ ఈ ఇయ‌ర్ లో ఎంపురాన్, తుద‌ర‌మ్, హృద‌య‌పూర్వం లాంటి సినిమాల‌తో మోహ‌న్ లాల్ బాక్సాఫీస్ వ‌ద్ద మంచి స‌క్సెస్ ను అందుకున్నారు.

టిజె జ్ఞాన‌వేల్ తో సినిమా అని వార్త‌లు

ఎంపురాన్, తుదుర‌మ్ సినిమాల‌తో ఇండ‌స్ట్రీ హిట్ ను అందుకోవ‌డంతో పాటూ స్థానికంగా అత్య‌ధిక క‌లెక్ష‌న్ల‌ను సాధించారు. అయితే కొన్నాళ్ల కింద‌ట మోహ‌న్ లాల్, ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ టిజె జ్ఞాన‌వేల్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్నార‌ని, ఆ సినిమా ఓ రియ‌ల్ లైఫ్ వ్య‌క్తి జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్క‌నుంద‌ని, ఆ మూవీలో మోహ‌న్ లాల్ లీడ్ రోల్ చేయ‌నున్నార‌ని వార్త‌లొచ్చాయి.

బ‌యోపిక్ ను రిజెక్ట్ చేసిన మోహ‌న్ లాల్

శ‌ర‌వ‌ణ భ‌వ‌న్ ఫౌండ‌ర్ రాజ‌గోపాల్ జీవిత క‌థపై జ్ఞాన‌వేల్ సినిమా చేస్తున్నార‌ని, అందులో మోహ‌న్ లాల్ న‌టిస్తున్నార‌ని, ఆ సినిమాకు దోస కింగ్ అనే టైటిల్ ను అనుకుంటున్నార‌ని వార్త‌లు రాగా, మోహ‌న్ లాల్ ఇప్పుడా ప్రాజెక్టును రిజెక్ట్ చేశార‌ని తెలుస్తోంది. రాజ‌గోపాల్ జీవిత క‌థ అంత ఆషామాషీది కాదు. ఆయ‌న జీవితంలో ఎన్నో మ‌లుపులున్నాయి. పైగా హ‌త్య ఆరోప‌ణ‌ల‌పై జీవిత ఖైదు విధించ‌బ‌డిన వ్య‌క్తి ఆయ‌న‌. ఈ ప్రాజెక్టు గురించి జ్ఞాన‌వేల్, మోహ‌న్ లాల్ కు చెప్ప‌గా, ఇద్ద‌రి మ‌ధ్య కొన్ని చ‌ర్చ‌ల త‌ర్వాత మోహ‌న్ లాల్ ఆ బ‌యోపిక్ ను రిజెక్ట్ చేశార‌ని స‌మాచారం. అయితే జ్ఞాన‌వేల్ ఇప్పుడ‌దే క‌థ‌తో స‌త్య‌రాజ్ ను సంప్ర‌దించార‌ని కోలీవుడ్ మీడియా వ‌ర్గాల్లో వార్త‌లు వినిపిస్తున్నాయి. కాగా మోహ‌న్ లాల్ ఆ సినిమా వ‌ద్ద‌నుకుని మంచి ప‌నే చేశార‌ని అత‌ని అభిమానులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.