అభిమానులకు సూపర్ స్టార్ భావోద్వేగ క్షమాపణలు!
మలయాళ సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న లెజెండరీ యాక్టర్ మోహన్‌లాల్‌కు ఊహించని షాక్ తగిలింది.
By: Srikanth Kontham | 8 Aug 2026 11:32 PM ISTమలయాళ సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న లెజెండరీ యాక్టర్ మోహన్‌లాల్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆస్ట్రేలియాలోని సిడ్నీ వేదికగా జరగాల్సిన ప్రతిష్టాత్మక లైవ్ స్టేజ్ షో చివరి నిమిషంలో వాయిదా పడింది. ఆయనకు సకాలంలో వీసా మంజూరు కాకపోవడంతో ఈ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఈ సంఘటనపై మోహన్‌లాల్ స్వయంగా అభిమానులకు క్షమాపణలు తెలిపారు. ఆస్ట్రేలియాలోని నార్త్‌వెస్ట్ కన్వెన్షన్ సెంటర్‌లో `వైకిట్టు ఎంధా పరిపాడి` (ఈ సాయంత్రం ఏంటి ప్లాన్?) పేరిట ఆగస్టు 8న భారీ కార్యక్రమం జరగాల్సి ఉంది.
ఈవెంట్ కోసం సింగర్ కేఎస్ చిత్ర, మనోజ్ కే జయన్ తదితర ప్రముఖ కళాకారులు, సాంకేతిక నిపుణులు ఇప్పటికే సిడ్నీ చేరుకున్నారు. అయితే ప్రధాన ఆకర్షణగా నిలవాల్సిన మోహన్‌లాల్ మాత్రం వీసా క్లియరెన్స్ కోసం సింగపూర్‌లో నిరీక్షించాల్సి వచ్చింది. చివరి వరకు ప్రయత్నించినప్పటికీ సమయానికి వీసా లభించకపోవడంతో ఆస్ట్రేలియా ప్రయాణం రద్దయింది. దీనిపై సింగపూర్ నుంచి ఒక వీడియో సందేశాన్ని విడుదల చేసిన మోహన్‌లాల్ ఆవేదన వ్యక్తం చేశారు. తన 50 ఏళ్ల సినీ కెరీర్‌లో ఇలాంటి పరిస్థితి ఎదురుకావడం ఇదే మొదటిసారని పేర్కొన్నారు. టెక్నికల్ పొరపాటు కారణంగా ఈ సమస్య తలెత్తి ఉండవచ్చని తెలిపారు.
ఈ సమస్యకు ఎవరినీ తప్పుపట్టబోనని స్పష్టం చేసిన మోహన్‌లాల్ జరిగిన అసౌకర్యానికి పూర్తి బాధ్యత తనదేనని ప్రకటించారు. షో కోసం ఎంతో కష్టపడిన నిర్వాహకులు కాయల్ ఈవెంట్స్ బృందానికి ..ఇతర కళాకారులకు కృత జ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా ఈ కార్యక్రమం కోసం ఎంతో దూరం నుంచి ప్రయాణించి వచ్చిన అభిమానులను క్షమించాల్సిందిగా మనస్పూర్తిగా కోరారు. నిర్వాహకులు వెల్లడించిన వివరాల ప్రకారం మోహన్‌లాల్ వీసా తిరస్కరణకు గురికాలేదని కేవలం ప్రక్రియలో జరిగిన జాప్యం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని స్పష్టం చేశారు.
త్వరలోనే అన్ని సమస్యలను పరిష్కరించుకుని సరికొత్త తేదీతో అదే బృందంతో సిడ్నీలో అద్భుతమైన ప్రదర్శనను ఏర్పాటు చేస్తామని అభిమానులకు హామీ ఇచ్చారు. అగ్ర నటుడిగా దశాబ్దాలుగా ఎన్నో స్టేజ్ షోలలో విజయవంతంగా పాల్గొన్న మోహన్‌లాల్ వీసా సాంకేతిక సమస్యల కారణంగా ఈవెంట్ రద్దు కావడం పట్ల బాధపడటం గమనార్హం. ఏది ఏమైనా వివాదాలకు తావులేకుండా బాధ్యతను తనపై వేసుకుని అభిమానులకు క్షమాపణలు చెప్పిన లాల్ గొప్ప మనసును అంతా ప్రశంసిస్తున్నారు.
ఈ పరిణామం ఆస్ట్రేలియాలోని మలయాళీ సంఘాలకు, మోహన్‌లాల్ అభిమానులకు కొంత నిరాశ కలిగించినా? లాల్ చూపిన బాధ్యతాయుతమైన వైఖరి అందరినీ ఆకట్టుకుంటుంది. కేవలం వ్యాపార దృక్పథంతో కాకుండా అభిమానుల మనసులను గౌరవిస్తూ ఆయన స్పందించిన తీరు నిజమైన స్టార్‌కు ఉండాల్సిన లక్షణాలను మరోసారి గుర్తు చేసింది. ఇలాంటి ఊహించని అడ్డంకులు ఎదురైనప్పుడు సంయమనం పాటిస్తూ త్వరలోనే సరికొత్త శక్తితో తిరిగి వస్తామని భరోసా ఇవ్వడం ద్వారా ఆయనకు అభిమానుల పట్ల ఉన్న అంకితభావాన్ని తెలియజేస్తుంది.
