38 ఏళ్ల వైవాహిక బంధం భార్య కు రొమాంటిక్ నోట్!
38 ఏళ్లు గడిచినా వారి మధ్య ఉన్న ఆ సాన్నిహిత్యం , పరస్పర గౌరవం నేటి తరానికి ఒక స్ఫూర్తిగా నిలుస్తోంది.
By: Srikanth Kontham | 29 April 2026 8:00 PM ISTకంప్లీట్ స్టార్ మోహన్‌లాల్ వ్యక్తిగత జీవితంలోని ఓ మధురమైన మైలురాయిని చేరుకున్నారు. మోహన్ లాల్- సుచిత్రల వైవాహిక బంధానికి 38 ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా మోహన్ లాల్ పంచుకున్న ఓ రొమాంటిక్ నోట్ అభిమానుల్ని ఆకట్టుకుంటుంది. సుదీర్ఘకాలం సాగిన ఈ ప్రయాణం తమ మధ్య ప్రేమని ఏమాత్రం తగ్గించలేదన్నారు. ఈ 38 ఏళ్ల బంధం ఇప్పటికీ ఓ కొత్త ఆరంభంలాగే అనిపిస్తోందని భావోద్వేగంగా పేర్కొన్నారు. మోహన్‌లాల్ - సుచిత్రల వివాహం 1988లో జరిగింది. నాటి నుండి నేటి వరకు అదర్శ జంటగా నిలుస్తున్నారు.
సినిమా ప్రపంచంలోని ఒడిదుడుకులను, బిజీ షెడ్యూళ్లను తట్టుకుని బంధాన్ని ఇంత బలంగా కాపాడుకోవడంలో సుచిత్ర పాత్ర ఎంతో ఉందని మోహన్‌లాల్ గతంలో పలుమార్లు వెల్లడించారు. తాజా పోస్ట్‌లో ఆయన తన భార్యతో కలిసి ఉన్న ఓ అందమైన ఫోటోను పంచుకుంటూ తమ ప్రయాణంలో తోడుగా ఉన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ పోస్ట్ చూసిన సినీ ప్రముఖులు , అభిమానులు మోహన్‌లాల్ దంపతులకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వెండితెరపై ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించిన లాల్ నిజ జీవితంలోనూ బాధ్యతాయుతమైన భర్తగా, తండ్రిగా నిలవడం గొప్ప విషయమని నెటిజన్లు కొనియాడుతున్నారు.
38 ఏళ్లు గడిచినా వారి మధ్య ఉన్న ఆ సాన్నిహిత్యం , పరస్పర గౌరవం నేటి తరానికి ఒక స్ఫూర్తిగా నిలుస్తోంది.
సెలబ్రిటీల జీవితాల్లో నిలకడైన బంధాలు అరుదుగా కనిపిస్తున్న ఈ రోజుల్లో మోహన్‌లాల్-సుచిత్రల ప్రయాణం ఒక చక్కని ఉదాహరణ. కెరీర్ లో అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తున్నా? కుటుంబానికి ఇచ్చే ప్రాధాన్యత విషయంలో మోహన్ లాల్ ఎక్కడా తగ్గలేదని ఈ సందర్భం మరోసారి రుజువు చేస్తుంది. ఈ అన్యోన్య జంట ఇలాగే మరెన్నో ఏళ్లు సంతోషంగా గడపాలని, మరిన్ని పెళ్లి రోజు వేడుకలు జరుపుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
ఈ జంటకు ప్రణవ్ మోహన్‌లాల్ - విస్మయ మోహన్‌లాల్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. తండ్రి వారసత్వాన్ఇన అందుకుని ప్రణవ్ ఇప్పటికే పరిశ్రమలోకి నటుడిగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే అతడికి సినిమాలు కంటే ప్రపంచాన్ని ఆస్వాదించడం అంటే ఎంతో ఇష్టం. సినిమాలంకే ఎక్కువగా బయట తిరగడానికే ఇష్టపడతాడు. కుమారుడు తనకు భిన్నంగా ఆలోచించడం పట్ల మోహన్ లాల్ కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తుంటారు. తాను చేయలేకపోయిన కొన్ని రకాల పనులు కుమారుడు రూపంలో చూసుకుంటానని ఆనందపడతారు. ప్రస్తుతం మోహన్ లాల్ నటుడిగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మలయాళంతో పాటు దేశంలో ఏ భాషలో అవకాశం వచ్చినా కాదన కుండా పని చేస్తారు. స్టార్ హీరోల చిత్రాల్లో కీలక పాత్రలకు సైతం వెనుకాడరు. మెగాస్టార్ చిరంజీవి 158వ చిత్రంలోనూ మోహన్ లాల్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే.
