మొదటి హీరోతోనే 100వ సినిమా కూడా!
మలయాళ సినీ పరిశ్రమలో అరుదైన చారిత్రాత్మక క్షణం సాక్ష్యమవుతోంది. లెజెండరీ యాక్టర్ మోహన్ లాల్ మరియు ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ మరోసారి చేతులు కలపబోతున్నారు.
By: Sravani Lakshmi Srungarapu | 23 March 2026 6:00 AM ISTమలయాళ సినీ పరిశ్రమలో అరుదైన చారిత్రాత్మక క్షణం సాక్ష్యమవుతోంది. లెజెండరీ యాక్టర్ మోహన్ లాల్ మరియు ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ మరోసారి చేతులు కలపబోతున్నారు. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే పలు సినిమాలు రాగా, ఈసారి కారణం మరింత ప్రత్యేకం. ప్రస్తుతం ప్రియదర్శన్ తన 100వ సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం వీరిద్దరూ మళ్లీ కలవడం ఇండియన్ సినీ హిస్టరీలో ఒక విశేష మైలురాయిగా నిలవనుంది.
ఫుల్ సర్కిల్ మూమెంట్ గా భావిస్తున్న అభిమానులు
వీరిద్దరి కలయికకు ఇంత ప్రత్యేకత రావడానికి కారణం లేకపోలేదు. ప్రియదర్శన్ డైరెక్టర్ గా తన మొదటి సినిమా ప్రారంభించినప్పుడు కూడా హీరోగా మోహన్‌లాల్ ఉన్నారు. ఇప్పుడు అదే హీరోతో తన 100వ సినిమాను రూపొందించడం ఫుల్ సర్కిల్ మూమెంట్‌గా భావిస్తున్నారు. ఒక దర్శకుడి తొలి సినిమా మరియు 100వ సినిమాల్లో ఒకే హీరో నటించడం అనేది ఇండస్ట్రీలోనే ఒక రికార్డు సృష్టించే అవకాశంగా సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇంకా టైటిల్ ఫిక్స్ కాలేని ఈ సినిమా సంగీత ప్రాధాన్యత కలిగిన కథగా తెరకెక్కనుందని సమాచారం. ప్రియదర్శన్ తన కెరీర్‌లో ఎక్కువగా కామెడీ చిత్రాలతో గుర్తింపు పొందినప్పటికీ, ఈసారి మ్యూజికల్ జానర్‌ను ఎంచుకోవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. కథ వివరాలు గోప్యంగా ఉంచినప్పటికీ, ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను ఆంటోనీ పెరంబవూర్ తన ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై నిర్మించనున్నారు. బిను జార్జ్ అలెంగ్జాడర్ కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించనున్నారు. మోహన్‌లాల్‌కు అత్యంత సన్నిహితుడైన ఆంటోనీ పెరుంబవూర్ నిర్మాణంలో రావడం కూడా ఈ ప్రాజెక్ట్‌కు మరింత బలం చేకూరుస్తోంది.
ఈ సందర్భంగా మోహన్‌లాల్ సోషల్ మీడియా ద్వారా ఓ ఎమోషనల్ మెసేజ్ ను పంచుకున్నారు. ప్రియదర్శన్ 100వ సినిమాకు చేరుకోవడం కేవలం ఒక నెంబర్ కాదని, అది జీవితకాలం పాటు సినిమాపై ఆయనకు ఉన్న డెడికేషన్, కథలపై ఉన్న నమ్మకం, కృషి కి దక్కిన ఫలితమని తెలిపారు. ఈ ప్రయాణంలో తాను కూడా భాగస్వామిగా ఉండటం తనకు గౌరవంగా భావిస్తున్నానని, కొన్ని క్షణాలు మాటల్లో చెప్పలేం, అవి కేవలం అనుభూతి చెందాల్సినవేనంటూ తన స్నేహితుడైన ప్రియదర్శన్‌కు శుభాకాంక్షలు తెలిపారు మోహన్‌లాల్. ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం, సినీ ప్రయాణం ఈ ప్రాజెక్ట్ ద్వారా మరోసారి తెరపై ప్రత్యక్షమవుతుండటంతో అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి, ఒక దర్శకుడి తొలి సినిమా మరియు 100వ సినిమా వరకు ఒకే హీరోతో సక్సెస్‌ఫుల్ జర్నీ కొనసాగించడం భారతీయ సినీ పరిశ్రమలో అరుదైన ఘట్టంగా నిలవనుంది. ఈ సినిమా కేవలం ఒక సినిమా మాత్రమే కాకుండా, ఇద్దరు దిగ్గజాల అనుబంధానికి ప్రతీకగా నిలిచే అవకాశం ఉంది.
