హీరో మోహన్ లాల్ కి మాతృవియోగం.. అసలే కలిసిరాని 2025!
2025.. ఈ ఏడాది కొంతమంది జీవితాలలో వెలుగులు నింపితే.. మరికొంతమంది జీవితాలలో తీరని విషాదాన్ని మిగిల్చింది.
By: Madhu Reddy | 30 Dec 2025 6:28 PM IST2025.. ఈ ఏడాది కొంతమంది జీవితాలలో వెలుగులు నింపితే.. మరికొంతమంది జీవితాలలో తీరని విషాదాన్ని మిగిల్చింది. ముఖ్యంగా ఏడాది ఆఖరిలో కూడా విషాదాన్ని నింపడం ఇప్పుడు అభిమానులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఇంట విషాదఛాయలు నెలకొన్నాయి. ఆయన తల్లి శాంతకుమారి స్వర్గస్తులయ్యారు. గత కొన్ని సంవత్సరాలుగా వృద్ధాప్య సమస్యలతో.. పక్షవాతంతో బాధపడుతున్న శాంతకుమారి మంగళవారం కొచ్చిలోని ఎలమక్కరలోని మోహన్ లాల్ నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె వయసు 90 సంవత్సరాలు.
పక్షవాతం కారణంగా కొన్నాళ్లుగా మంచానికే పరిమితమైన ఆమెను.. మోహన్ లాల్ ఎంతో జాగ్రత్తగా చూసుకునేవారట. ప్రత్యేకమైన వైద్య బృందం సమక్షంలో తన తల్లికి చికిత్సను కూడా అందిస్తున్నారు మోహన్ లాల్. ఇలా గత కొంతకాలంగా మంచానికే పరిమితమైన ఆమె నేడు తుది శ్వాస విడిచారు. ఇకపోతే ఆమె భర్త , మోహన్ లాల్ తండ్రి ఎవరో కాదు దివంగత విశ్వనాథన్ నాయర్ . కేరళ ప్రభుత్వ మాజీ లా సెక్రెటరీగా పనిచేశారు. తల్లి మరణ వార్త వినగానే హుటాహుటిన ఎర్నాకులంలోని తన ఇంటికి చేరుకున్నారు మోహన్ లాల్. రేపు ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం.
ఇకపోతే ఈ విషయం తెలియడంతో ఈ ఏడాది మోహన్ లాల్ కు కలిసి రాలేదు అని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. వాస్తవానికి గత సెప్టెంబర్ వరకు మోహన్ లాల్ కి మంచి విజయాలే వరించాయి. ముఖ్యంగా ఆయన నటించిన L2 ఎంపురాన్, హృదయపూర్వం, తుడరుమ్ వంటి చిత్రాలు మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా భారీ కలెక్షన్లు వసూలు చేశాయి. అంతేకాదు మలయాళ సినీ ఇండస్ట్రీలో వరుసగా 50 కోట్ల క్లబ్ లో చేరిన చిత్రాలుగా నిలిచాయి. అంతేకాదు ఇలా హ్యాట్రిక్ తో భారీ సక్సెస్ అందుకున్న మోహన్ లాల్ వృషభ అంటూ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమాను విడుదల చేశారు. ముఖ్యంగా హ్యాట్రిక్ కొట్టిన తర్వాత రిలీజ్ అయిన చిత్రం కావడంతో అటు అభిమానులలో కూడా ఈ సినిమాపై హైప్ భారీగా పెరిగింది. కానీ సినిమా విడుదలయ్యాక ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయింది వృషభ. ముఖ్యంగా ఇందులో మోహన్ లాల్ నటన 100% ఉన్నా.. కథ సాగదీత కారణంగానే సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అలా ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచి.. మోహన్ లాల్ ను నిరాశపరిచింది. దీనికి తోడు తన తల్లి కూడా ఆ మరణించడంతో విషాదాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. మొత్తానికైతే తన మూడు చిత్రాలతో మంచి విజయాన్ని అందుకున్నా.. ఇప్పుడు అటు సినిమా డిజాస్టర్ గా మిగలడం.. ఆ నిరాశ నుండి బయటపడకుండానే ఇటు తల్లి మరణం రెండు ఆయనను దిగ్భ్రాంతిలోకి నెట్టివేశాయి. ప్రస్తుతం ఈ విషయాలు తెలిసిన తర్వాత మోహన్ లాల్ కి ఈ ఏడాది అస్సలు కలిసి రాలేదని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
