ఎంత చేసినా భార్యలు ఇంప్రెస్ అవ్వరు.. మోహన్‌లాల్ సెన్సేషనల్ కామెంట్స్
మలయాళ సినీ పరిశ్రమలో అత్యంత గౌరవనీయ నటుల్లో ఒకరైన మోహన్‌లాల్ తన నటనతోనే కాదు, వ్యక్తిత్వంతోనూ అభిమానుల మనసులు గెలుచుకుంటూ వస్తున్నారు.
By: Sravani Lakshmi Srungarapu | 1 Jun 2026 2:48 PM ISTమలయాళ సినీ పరిశ్రమలో అత్యంత గౌరవనీయ నటుల్లో ఒకరైన మోహన్‌లాల్ తన నటనతోనే కాదు, వ్యక్తిత్వంతోనూ అభిమానుల మనసులు గెలుచుకుంటూ వస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ముఖ్యంగా భార్యాభర్తల సంబంధాల గురించి, తన భార్య సుచిత్రతో ఉన్న అనుబంధం గురించి మోహన్‌లాల్ చెప్పిన మాటలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
ఈ సందర్భంగా మీ భార్యను ఇంప్రెస్ చేయడానికి మీరు ఏమి చేస్తారనే ప్రశ్న ఎదురవగా మోహన్‌లాల్ తనదైన శైలిలో స్పందించారు. భర్తలు ఏం చేసినా భార్యలు పూర్తిగా ఇంప్రెస్ అవ్వరని, తాను కూడా తన భార్యను ఆకట్టుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను. కానీ ఇప్పటివరకు వాటిలో ఏదీ పూర్తిగా పనిచేయలేదని, నిజానికి ఎవరినైనా కావాలని ఇంప్రెస్ చేయాలని ట్రై చేస్తే అది సులభంగా కనిపెట్టేస్తారని, ఎందుకంటే ఎదుటి వ్యక్తి అంత తెలివిగా ఉంటారని, అందుకే సహజంగా ఉండటమే మంచిదని ఆయన అన్నారు. మోహన్ లాల్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీశాయి.
ఇదే సందర్భంలో భార్యకు దాచిపెట్టే విషయాల గురించి అడిగిన ప్రశ్నకు కూడా మోహన్‌లాల్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. తనకు అబద్ధం చెప్పడం కూడా సరిగా రాదని, భార్య దగ్గర తనకు దాచిపెట్టాల్సిన విషయాలేమీ లేవని, కొన్ని సందర్భాల్లో వెంటనే చెప్పలేని విషయాలు ఉండొచ్చు. కానీ తరువాత వాటిని తప్పకుండా చెబుతానని, ఆమెకు తెలియకుండా తానేదీ దాచనని క్లారిటీ ఇచ్చారు. భార్యాభర్తల మధ్య నమ్మకం, పారదర్శకత ఎంత ముఖ్యమో తన మాటల ద్వారా వివరించినట్లు అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
మోహన్‌లాల్ భార్య సుచిత్ర కూడా సినీ అభిమానులకు సుపరిచితమే. ప్రముఖ తమిళ సినీ నిర్మాత కుమార్తె అయిన ఆమె, మోహన్‌లాల్ సినిమాలకు అభిమానిగా ఉండేది. ఆ అభిమానం క్రమంగా ప్రేమగా మారి, కుటుంబ సభ్యుల అంగీకారంతో ఇద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. జాతకాల విషయంలో కొన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించి 1988 ఏప్రిల్ 28న వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి దాదాపు నాలుగు దశాబ్దాలుగా అన్యోన్య దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తున్నారు.
మలయాళ సినీ పరిశ్రమలో ఆదర్శ దంపతులుగా గుర్తింపు పొందిన ఈ జంట, కుటుంబ విలువలకు పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతోంది. మోహన్‌లాల్ కెరీర్‌లో ఎన్నో సక్సెస్‌లు వచ్చినప్పటికీ ప్రతి దశలోనూ సుచిత్ర అండగా నిలిచిందని సినీ వర్గాలు చెబుతుంటాయి. ఇద్దరు పిల్లలకు తల్లిగా, కుటుంబ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తూ ఎంతో సాధారణ జీవనశైలిని కొనసాగిస్తున్న సుచిత్ర, స్టార్ హీరో భార్య అనే హోదాను ఎప్పుడూ ప్రదర్శించలేదు. క్రాఫ్ట్ వర్క్, కుటుంబ కార్యక్రమాలు, విదేశీ పర్యటనలు వంటి ఆసక్తులతో తన ప్రపంచాన్ని నిర్మించుకున్న ఆమె, అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు. ఇక మోహన్‌లాల్ చేసిన తాజా వ్యాఖ్యలు మాత్రం అభిమానుల్లో ప్రత్యేక చర్చకు కారణమయ్యాయి. సినీ కెరీర్‌లో ఎంత పెద్ద స్టార్ అయినా, కుటుంబ బంధాలకు ఇచ్చే విలువ విషయంలో మోహన్‌లాల్ ఎప్పుడూ ప్రత్యేకంగా నిలుస్తారని ఈ వ్యాఖ్యలు మరోసారి నిరూపించాయి.
