కృష్ణ 11 సినిమాలు - మోహన్ లాల్ 34 సినిమాలు
ఒక ఏడాదిలో అత్యధిక చిత్రాల్లో నటించిన మేటి నటుడు ఎవరు? అని ప్రశ్నిస్తే, భారతదేశంలో ఇద్దరి పేర్లు వినిపిస్తాయి.
By: Sivaji Kontham | 21 Sept 2025 9:18 AM ISTఒక ఏడాదిలో అత్యధిక చిత్రాల్లో నటించిన మేటి నటుడు ఎవరు? అని ప్రశ్నిస్తే, భారతదేశంలో ఇద్దరి పేర్లు వినిపిస్తాయి. మళయాల నటుడు మోహన్ లాల్ ఒకే ఏడాదిలో ఏకంగా 34 సినిమాల్లో నటించడం ఒక రికార్డ్ కాగా, టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా ఎదిగిన ఘట్టమనేని కృష్ణ ఒక ఏడాదిలో 11 నుంచి 13 సినిమాల్లో నటించారని కథనాలొచ్చాయి. ఆ ఇద్దరూ మూడు కాల్షీట్లలో పని చేసిన హార్డ్ వర్కర్స్. ఆ రోజుల్లో అనవసర వ్యాపకాలు లేకుండా, కేవలం తమ వృత్తిపై మాత్రమే దృష్టి సారించేవారు గనుక ఇది సాధ్యమైంది.
కృష్ణ 5 దశాబ్దాల కెరీర్‌లో 350కి పైగా చిత్రాలలో నటించగలిగారు అంటే ఆయన స్పీడ్ ఒక కారణం. ఈ రోజుల్లో అగ్ర హీరోలు షష్ఠిపూర్తి వయసు నాటికి 150 సినిమాల్లో నటిస్తే గొప్ప. కానీ కృష్ణ అలా కాదు ఏడాదికి 11 సినిమాల యావరేజ్ చూసుకున్నా ఆయన దశాబ్ధం పాటు అలా నిరంతరం ఏవో సినిమాల్లో కనిపిస్తూనే ఉండేవారు.
కృష్ణ 1965లో ఆదుర్తి సుబ్బారావు తీసిన తేనే మనసులు సినిమాతో తెరంగేట్రం చేశారు. కెరీర్ మూడవ చిత్రం గూడచారి 116 చాలా గుర్తింపును ఇచ్చింది. మోసగాళ్లకు మోసగాడు, పండంటి కాపురం, దేవుడు చేసిన మనుషులు, అల్లూరి సీతారామ రాజు, మంచి కుటుంబం, రామ్ రాబర్ట్ రహీమ్, ముందడుగు, సింహాసనం వంటి విజయవంతమైన చిత్రాలలో కనిపించాడు. 1964-1995 మధ్య, కృష్ణ సగటున సంవత్సరానికి 11 చిత్రాలలో నటించారు. అతడు 1970లో తన నిర్మాణ సంస్థ పద్మాలయా స్టూడియోస్‌ను స్థాపించి సినిమాలను నిర్మించారు. కృష్ణ నటనతో పాటు 16 చిత్రాలకు దర్శకత్వం వహించారు.
అయితే ఇప్పుడు మోహన్ లాల్ దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా ఆయన ఏడాదికి 34 సినిమాల్లో నటించిన విషయం తెలుగు ఫిలిం సర్కిల్స్ లోను వైరల్ అవుతోంది. మలయాళంలో పరిమిత బడ్జెట్ లో అత్యంత వేగంగా సినిమాలు తీస్తారనే విషయం అందరికీ తెలుసు. లాల్ కూడా వేగంగా సినిమాలను పూర్తి చేయడంలో రికార్డులు బ్రేక్ చేసారు. అతడు ఒకే ఏడాదిలో ఏకంగా 34 సినిమాలలో నటించారు. పద్మశ్రీ, పద్మభూషణ్ అందుకున్న మేటి నటుడు. ఇప్పుడు ఫాల్కే పురస్కారాన్ని గెలుచుకున్న ఆనందంలో ఉన్నారు. ఈ ప్రయాణంలో తనతో పాటు ఉన్న ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.
