Begin typing your search above and press return to search.

ఇది క్లిక్ అయితే మోహ‌న్ బాబు దొర‌క‌డు

ఐతే మోహ‌న్ బాబును ఎలా ఒప్పించాడో కానీ ద‌స‌రా ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల.. త‌న కొత్త చిత్రం ది ప్యార‌డైజ్‌లో ఆయ‌న‌తో విల‌న్ పాత్ర చేయిస్తున్నాడు.

By:  Garuda Media   |   28 Sept 2025 10:30 AM IST
ఇది క్లిక్ అయితే మోహ‌న్ బాబు దొర‌క‌డు
X

ఇంకా ఎన్నేళ్లు క‌ష్ట‌ప‌డ‌డం అనుకున్నారో, బ‌య‌టి సినిమాల్లో చేయ‌డం ఇష్టం లేదో, పిల్ల‌ల‌కు వార‌స‌త్వాన్ని ఇచ్చేసి తాను త‌గ్గుదాం అనుకున్నారో.. కార‌ణాలు ఏవైనా కానీ గ‌త రెండు ద‌శాబ్దాలుగా మోహ‌న్ బాబు సినిమాలు బాగా త‌గ్గించేశారు.. అప్పుడ‌ప్పుడూ సొంత బేన‌ర్లో సినిమాలు చేసినా అవి ఆయ‌న స్థాయికి త‌గ్గ‌వి కాదు. బ‌య‌ట య‌మ‌దొంగ‌, బుజ్జిగాడు లాంటి సినిమాల్లో న‌టించ‌గా.. వాటిలో ఆయ‌న పాత్ర‌ల‌కు అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. కానీ మోహ‌న్ బాబు అలాంటివి మ‌రిన్ని పాత్ర‌లు చేస్తే చూడాల‌న్న అభిమానుల ఆశ నెర‌వేర‌లేదు.

క్ర‌మ క్ర‌మంగా సినిమాలు త‌గ్గించేసి లైమ్ లైట్‌కు దూరం అయిపోయారు మోహ‌న్ బాబు. హీరోగా, విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా అద్భుత‌మైన పాత్ర‌లు చేసి తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే మేటి న‌టుల్లో ఒక‌డిగా పేరు తెచ్చుకున్న న‌టుడు.. ఇలా సినిమాల‌కు దూరం అయిపోవ‌డం టాలీవుడ్ దుర‌దృష్టం అనే చెప్పాలి. మోహ‌న్ బాబు అందుబాటులో ఉండి, మంచి పాత్ర‌లిస్తే చేయ‌డానికైనా సిద్ధం అన్నాడంటే.. ఎంతోమంది యువ ద‌ర్శ‌కులు ఆయ‌న కోసం రెడీగా ఉంటార‌న‌డంలో సందేహం లేదు.

ఐతే మోహ‌న్ బాబును ఎలా ఒప్పించాడో కానీ ద‌స‌రా ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల.. త‌న కొత్త చిత్రం ది ప్యార‌డైజ్‌లో ఆయ‌న‌తో విల‌న్ పాత్ర చేయిస్తున్నాడు. ఈ న్యూస్ కొన్ని రోజుల ముందే బ్రేక్ అయింది. ఇప్పుడు అది అధికారికం అయింది. నాని సినిమాలో మోహ‌న్ బాబు విలన్ అంటే మామూలుగా ఉండ‌దంటూ.. ఈ సినిమాలో ఆయ‌న పాత్ర కోసం ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఇంత‌లో రెండు లుక్స్‌తో పోస్ట‌ర్లు వ‌దిలాడు శ్రీకాంత్ ఓదెల‌.

ఈ సినిమా హైప్‌ను ఇంకో లెవెల్‌కు తీసుకెళ్లేలా..మోహ‌న్ బాబు అభిమానుల‌ను ఉర్రూత‌లూగించేలా ఆ పోస్ట‌ర్ల‌ను డిజైన్ చేశారు. మోహ‌న్ బాబు అంటే ఏంటో తెలియ‌ని ఈ త‌రం ప్రేక్ష‌కుల‌కు ఈ సినిమాతో మైండ్ బ్లాంక్ కావ‌డం ఖాయ‌మనే సంకేతాలు ఇచ్చాయి ఈ పోస్ట‌ర్లు. ఈ సినిమాలో మోహ‌న్ బాబు పాత్ర బ‌లంగా ఉంటే చాలు. ఆయ‌న‌. పెర్ఫామెన్స్ అద‌ర‌గొట్టేస్తార‌న‌డంలో సందేహం లేదు. అదే జ‌రిగితే మోహ‌న్ బాబుకు టాలీవుడ్లో ఒక్క‌సారిగా డిమాండ్ పెరిగిపోవ‌డం, ఆయ‌న అంద‌రికీ దొర‌క‌నంత బిజీ అయిపోవ‌డం ఖాయం.