ది ప్యారడైజ్ : మోహన్ బాబుకు అన్యాయం జరిగిందట!
మోహన్ బాబు ఈ సినిమాలో చాలా పవర్ ఫుల్ రోల్, ఫుల్ లెంగ్త్ రోల్ అనే ప్రచారం మొదటి నుంచి జరిగింది.
By: Ramesh Palla | 1 Oct 2026 3:49 PM ISTనాని హీరోగా నటించిన ‘ది ప్యారడైజ్’ మూవీ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దసరా సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. బాక్సాఫీస్ వద్ద సినిమాకు మంచి వసూళ్లు నమోదు అవుతున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఇటీవలే సినిమా సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. సినిమాలో మోహన్ బాబు మెయిన్ విలన్ పాత్రను పోషించిన విషయం తెల్సిందే. ఆయన పాత్ర విషయంలో కొందరు పెదవి విరుస్తుంటే, కొందరు మాత్రం చాలా రోజుల తర్వాత మోహన్ బాబును చూసినందుకు సంతోషంగా ఉందంటూ కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి మోహన్ బాబు ప్రజెన్స్‌తో ది ప్యారడైజ్ మూవీ వెయిట్ పెరిగింది అనే మాట వాస్తవం అని అంతా ఒప్పుకుంటారు.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ది ప్యారడైజ్...
తాజాగా సినిమా పోస్ట్ రిలీజ్ ప్రమోషన్‌లో భాగంగా హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, మోహన్ బాబు ఒక ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో మోహన్ బాబు పలు విషయాలను ప్రస్థావించాడు. ప్రధానంగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తనకు అన్యాయం చేశాడు అంటూ మోహన్ బాబు ఆరోపించాడు. సినిమా కథ చెప్పిన సమయంలో నా పాత్రకు భార్య ఉంటుందని చెప్పాడు. ఆమెతో కొన్ని సన్నివేశాలను కూడా చెప్పాడు. ఆ సన్నివేశాలు నచ్చి, పాత్ర నచ్చి, నానిపై నాకు ఉన్న మంచి అభిప్రాయం కారణంగా 'ది ప్యారడైజ్' మూవీలో నటించేందుకు ఒప్పుకున్నాను. నా పక్కన హీరోయిన్ గా పాత హీరోయిన్‌ను కాకుండా కొత్తవారిని ఎంపిక చేయమని చెప్పాను. అందుకోసం ఆడిషన్స్ చేస్తున్నట్లుగానూ శ్రీకాంత్ చెప్పాడు. చాలా మందిని పరిశీలించాం, త్వరలోనే నాకు జోడీగా ఒక హీరోయిన్‌ను ఎంపిక చేస్తాను అని చెప్పాడు.
మోహన్ బాబు పాత్ర గురించి...
షూటింగ్ ప్రారంభం అయింది, ఒక షెడ్యూల్ పూర్తి చేశాక నా పాత్రకు భార్య అన్నావ్ కదా ఎక్కడ శ్రీకాంత్ అంటే తొలగించాం సర్ అని అప్పుడు చావు కబురు చల్లగా చెప్పాడు అంటూ మోహన్ బాబు ఆ ఇంటర్వ్యూలో సరదాగా చెప్పుకొచ్చాడు. అయితే శ్రీకాంత్ నిజంగానే మోహన్ బాబుకు మొదట జోడీ ఉంటుందని చెప్పాడా అనేది చర్చనీయాంశం అయింది. మోహన్ బాబుతో ఏది చెబితే అదే చేయాలి అంటాడని ఇండస్ట్రీలో టాక్. అలాంటిది తనకు జోడీ ఉంటుందని చెప్పి, షూటింగ్‌కు వెళ్లిన తర్వాత లేకుండా చేస్తే మోహన్ బాబు ఊరుకుంటాడా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. మొదట చెప్పి, ఆ తర్వాత మోహన్ బాబును శ్రీకాంత్ కన్విన్స్ చేసి ఉంటాడా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి మోహన్ బాబు చెప్పిన దాని ప్రకారం అయితే స్క్రిప్ట్ చెప్పిన సమయంలో ఒకటి, చేసిన సమయంలో మరోటి శ్రీకాంత్ చేశాడు అనేది వాస్తవం.
నాని, మోహన్ బాబు ఫైట్...
మోహన్ బాబు ఈ సినిమాలో చాలా పవర్ ఫుల్ రోల్, ఫుల్ లెంగ్త్ రోల్ అనే ప్రచారం మొదటి నుంచి జరిగింది. పవర్ ఫుల్ రోల్ అనే మాట వాస్తవం కానీ, ఇంకాస్త ఎక్కువ సమయం మోహన్ బాబు స్క్రీన్ పై కనిపించి ఉంటే బాగుండేది అని చాలా మంది భావిస్తున్నారు. మోహన్ బాబు, నాని కాంబోలో ఒక ఫైట్ సీన్ ఉంది. అందులో పూర్తిగా మోహన్ బాబు డామినేషన్ ఉంటుంది. శ్రీకాంత్, నాని అక్కడ మోహన్ బాబుకు గౌరవం ఇచ్చినట్లుగా ఉంది. ఆ సీన్‌లో నాని ప్రతిఘటించి రెండు దెబ్బలు మోహన్‌బాబును కొట్టి ఉంటే ఇంకాస్త బెటర్‌గా ఉండేది అనేది కొందరి అభిప్రాయం. మొత్తానికి మోహన్ బాబు విలన్‌గా చాలా కాలం తర్వాత కనిపించడంతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమా ఎక్స్‌పీరియన్స్‌తో ఆయన ముందు ముందు మరిన్ని విలన్ పాత్రలు పోషిస్తాడా, ఆయనతో వర్క్ చేసేందుకు ఇతర దర్శకులు రెడీగా ఉన్నారా అనేది చూడాలి.
