Begin typing your search above and press return to search.

పవర్ ఉంది.. పాత్ర ఎక్కడ?

మోహన్ బాబు కెరీర్‌లో పవర్ ఉన్న పాత్రలకు కొదవ లేదు. పెదరాయుడు, రాయలసీమ రామన్న చౌదరి లాంటి సినిమాల్లో ఆయన చూపించిన గాంభీర్యం వేరు.

By:  M Prashanth   |   26 Aug 2026 10:04 AM IST
పవర్ ఉంది.. పాత్ర ఎక్కడ?
X

మోహన్ బాబు ఇప్పుడు గ్యాప్ లేకుండా సినిమాలు చేసే నటుడు కాదు. ఇటీవలి చేసిన సినిమాలు చూస్తే కూడా పాత్ర నచ్చితేనే ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. హీరోగానే ఉండాలి అనే లెక్క కూడా లేదు. నెగెటివ్ షేడ్ అయినా, క్యారెక్టర్ రోల్ అయినా చేయడానికి సిద్ధంగానే ఉన్నారు. కానీ పాత్రలో దమ్ముండాలి. అయితే ఆయన నమ్మి చేసిన కొన్ని పాత్రలు మాత్రం తెరపై అనుకున్నంత స్థాయిలో నిలబడలేదు. అందుకే ఇప్పుడు ది ప్యారడైజ్‌లో శ్రీకాంత్ ఓదెల మోహన్ బాబును ఎలా వాడతాడన్నది అందరిలో మెదులుతున్న సందేహం.

మోహన్ బాబు కెరీర్‌లో పవర్ ఉన్న పాత్రలకు కొదవ లేదు. పెదరాయుడు, రాయలసీమ రామన్న చౌదరి లాంటి సినిమాల్లో ఆయన చూపించిన గాంభీర్యం వేరు. హీరోగా ఉంటూనే ఎదుటివాడిని భయపెట్టే వాయిస్, డైలాగ్ డెలివరీ ఆయనకు సహజంగా వచ్చేవి. 2007లో యమదొంగలో రాజమౌళి అదే బలాన్ని యమధర్మరాజు పాత్రకు వాడుకున్నాడు. ఎన్టీఆర్ ఎదురుగా ఉన్నా ఆ పాత్ర పవర్ ఎక్కడా తగ్గలేదు.

ఆ తర్వాత కూడా గాయత్రిలో గాయత్రి పటేల్, మహానటిలో ఎస్వీ రంగారావు, సన్ ఆఫ్ ఇండియా, శాకుంతలంలో దుర్వాస మహర్షి, కన్నప్పలో మహాదేవ శాస్త్రి లాంటి పాత్రలు చేశారు. కానీ వీటిలో కొన్ని చిన్న పాత్రలుగా మిగిలిపోయాయి. మరికొన్ని సినిమాలే వర్కవుట్ కాకపోవడంతో ఆయన పాత్ర కూడా హైలెట్ కాలేదు.

ఇటీవల వచ్చిన శ్రీనివాస మంగాపురంలో వెంకటప్ప నాయుడిగా మరోసారి పవర్ ఉన్న క్యారెక్టర్ దొరికింది. మోహన్ బాబు స్క్రీన్ ప్రెజెన్స్ గురించి రివ్యూల్లో కూడా మంచి మాటలే వచ్చాయి. కానీ పాత్రకు సరైన డెప్త్ లేదని, ఆయన డైలాగ్ డెలివరీని పూర్తి స్థాయిలో ఉపయోగించలేదనే విమర్శలు కూడా వచ్చాయి. అంటే సమస్య నటుడి దగ్గర లేదనే పాయింట్ మరోసారి బయటపడింది. సరైన రైటింగ్ పడితే ఇప్పటికీ ఆయన సీన్‌ను తనవైపు తిప్పుకోగలడనే విషయం కనిపించింది.

ఇప్పుడు ది ప్యారడైజ్‌లో ఆయన షికంజా మాలిక్‌గా కనిపిస్తున్నారు. మేకర్స్ క్యారెక్టర్‌ను పరిచయం చేసినప్పుడు విలనిజం షేడ్‌ను ముందుకు పెట్టారు. విక్రమ్ మాలిక్‌గా రాఘవ్ జుయల్ కూడా నెగెటివ్ రోల్‌లో ఉన్నాడు. కథలో ఈ ఇద్దరి స్థానం ఏంటి, నాని జడల్‌తో షికంజా మాలిక్ కనెక్షన్ ఎలా ఉంటుంది అన్నది చూడాలి.

ఇప్పటికే శ్రీకాంత్ ఓదెలపై అంచనా ఉంటుంది. ఇప్పుడు ఇండస్ట్రీలో మోహన్ బాబు తరహా వాయిస్, గాంభీర్యం, నెగెటివ్ షేడ్‌ను ఒకేసారి మోయగల సీనియర్ నటులు చాలా తక్కువ. పైగా ఆయన కూడా ప్రతి సినిమాలో కనిపించడం లేదు. అలాంటి నటుడిని తీసుకున్నప్పుడు రెండు మూడు పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో పని పూర్తి చేస్తే ఉపయోగం ఉండదు. కథలో క్యారెక్టర్ కు తగ్గ బలం ఉంటే.. చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఒక సరైన క్యారెక్టర్ చివరకు దొరికినట్టే.