Begin typing your search above and press return to search.

నా 50 ఏళ్ల న‌ట జీవితంలో ఎప్పుడూ చేయ‌నిది..'ది ప్యార‌డైజ్‌'పై మోహ‌న్ బాబు వ్యాఖ్య‌లు

నాని క‌థానాయ‌కుడిగా శ్రీ‌కాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం- ది ప్యార‌డైజ్. మంచు మోహ‌న్ బాబు కీల‌క పాత్ర‌ను పోషించారు.

By:  Sivaji Kontham   |   26 Sept 2026 10:48 PM IST
నా 50 ఏళ్ల న‌ట జీవితంలో ఎప్పుడూ చేయ‌నిది..ది ప్యార‌డైజ్‌పై మోహ‌న్ బాబు వ్యాఖ్య‌లు
X

నాని క‌థానాయ‌కుడిగా శ్రీ‌కాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం- ది ప్యార‌డైజ్. మంచు మోహ‌న్ బాబు కీల‌క పాత్ర‌ను పోషించారు. తాజాగా `ప్యారడైస్ మీడియా ములాఖత్` వేదికగా టాలీవుడ్ లెజెండరీ నటుడు మంచు మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. `దసరా` వంటి సంచలన చిత్రంతో టాలెంటెడ్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్ ఓదెల పనితీరును మోహన్ బాబు ఆకాశానికి ఎత్తేశారు. ఒక సినిమాకు దర్శకుడిని `కెప్టెన్` అని.. `రథసారథి` అని పోలుస్తూ.. మంచి కథను కృష్ణుడిలా నడిపించే గొప్ప ప్రతిభ శ్రీకాంత్‌ సొంతమని కొనియాడారు.

తన యాభై ఏళ్ల సుదీర్ఘ నట ప్రయాణంలో ఎప్పుడూ చేయని విధంగా అత్యంత భయంకరమైన, తీవ్రమైన పాత్రను ఈ చిత్రంలో శ్రీకాంత్ తనతో చేయించారని మోహన్ బాబు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మొదట ఈ పాత్ర స్వభావం గురించి తనకు పూర్తిగా తెలియదని.. ఒకసారి కమిట్ అయిన తర్వాత వెనకడుగు వేయకుండా ఆ క్యారెక్టర్‌ను పూర్తి చేశానని తెలిపారు. తెరపై తనను అంత ఉగ్రరూపంలో చూపిస్తారని ముందే తెలిసి ఉంటే బహుశా ఈ పాత్ర చేసేవాడిని కాదేమోనని సరదాగా వ్యాఖ్యానించారు.

షూటింగ్ సమయంలో శ్రీకాంత్ ఓదెల అనుసరించిన కఠినమైన పనితీరును మోహన్ బాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఒకే షాట్ కోసం కళ్ళు ఎర్రగా మార్చడం, చిన్నవి చేయడం, రౌద్రం ప్రదర్శించడం లాంటి అనేక వేరియేషన్లతో తనచేత శ్రీకాంత్ ఎన్నో టేక్‌లు చేయించుకున్నారని గుర్తుచేసుకున్నారు. తన కెరీర్‌లో ఇన్ని టేకులు తీసుకున్న దర్శకుడు బహుశా శ్రీకాంత్ ఒక్కరేనని చెబుతూనే.. చెరుకును పదేపదే పిండితేనే తీపి రసం వస్తుందని.. తనలోని నటుడిని పూర్తిగా బయటికి తీయడానికే అత‌డు తపించాడ‌ని ప్రశంసించారు.

కేవలం దర్శకత్వ ప్రతిభే కాకుండా శ్రీకాంత్ ఓదెల వ్యక్తిత్వాన్ని తెలియ‌జేస్తూ, అత‌డి భవిష్యత్తును మోహన్ బాబు ఆశీర్వదించారు. శ్రీకాంత్ కేవలం తెలుగు చిత్ర పరిశ్రమకే పరిమితం కాకుండా.. భవిష్యత్తులో భారతదేశంలోనే నంబర్ వన్ దర్శకుడిగా ఎదుగుతారని ఆకాంక్షించారు. అత‌డికి కళామతల్లి ఆశీస్సులు మెండుగా ఉన్నాయని.. ఇలాంటి గొప్ప బిడ్డను కన్న తల్లిదండ్రులు ధన్యులని అభినందిస్తూ శ్రీకాంత్ కలకాలం విజయాలతో వర్ధిల్లాలని దీవించారు.

తన జీవిత ప్రయాణంలో క్రమశిక్షణ, కష్టపడే తత్వమే తనను ఈ స్థాయికి చేర్చాయని మోహన్ బాబు ఎప్పుడూ చెబుతుంటారు. శ్రీకాంత్ ఓదెలలో కూడా అదే సిన్సియారిటీ, ప్యాషన్ కనిపిస్తాయని పేర్కొన్నారు. విద్య, జీవిత సత్యాలు, క్రమశిక్షణకు ఎప్పుడూ పెద్దపీట వేసే మోహన్ బాబు లాంటి దిగ్గజ నటుడు.. ఒక యువ దర్శకుడి పనితీరును ఇంతటి స్థాయిలో మెచ్చుకోవడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.