Begin typing your search above and press return to search.

జయసుధ నాకు సోదరి.. కానీ జయప్రద కాదు!-MB కామెంట్

తెలుగు చిత్ర పరిశ్రమలో `కలెక్షన్ కింగ్`గా గుర్తింపు పొందిన మంచు మోహన్ బాబు.. తన సమకాలీన నటీమణులైన జయసుధ, జయప్రదలతో తనకున్న అనుబంధం గురించి ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసారు.

By:  Sivaji Kontham   |   5 May 2026 8:00 PM IST
జయసుధ నాకు సోదరి.. కానీ జయప్రద కాదు!-MB కామెంట్
X

తెలుగు చిత్ర పరిశ్రమలో `కలెక్షన్ కింగ్`గా గుర్తింపు పొందిన మంచు మోహన్ బాబు.. తన సమకాలీన నటీమణులైన జయసుధ, జయప్రదలతో తనకున్న అనుబంధం గురించి ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసారు. త‌న గురువు గారు అయిన ద‌ర్శ‌క‌ర‌త్న డా.దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌యంతి కార్య‌క్ర‌మాల్లో ఆయ‌న వ్యాఖ్య‌లు ఆస‌క్తిని క‌లిగించాయి. వేదిక‌పై త‌న చెంత‌నే ఉన్న‌ జయసుధ తనకు సోదరి అని పేర్కొన్న ఆయన.. జయప్రద విషయంలో మాత్రం ఆమె తన సోదరి మాత్రమే కాదని.. ఆమెతో ఉన్న వృత్తిపరమైన అనుబంధం అంతకంటే ఎక్కువని వ్యాఖ్యానించారు. షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని సంఘటనలను గుర్తుచేసుకుంటూ.. ఏవీఎమ్ స్టూడియోలో రాత్రి వేళల్లో కూడా కష్టపడి పనిచేసిన రోజులను ఆయన నెమరువేసుకున్నారు.

తన సినీ ప్రస్థానంలో జయప్రదతో కలిసి నటించిన ఒక ప్రత్యేక సందర్భాన్ని మోహన్ బాబు వివరించారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన షూటింగ్ అర్ధరాత్రి 4 గంటల వరకు సాగేదని.. అప్పుడు జయప్రదను తాను లాక్కెళ్లిపోవాల్సిన సన్నివేశం చేయాల్సి ఉందని ఆయన గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో ప్రముఖ నటుడు అల్లు రామలింగయ్య గారు జోక్యం చేసుకుని.. ఆ అమ్మాయిని అలా లాక్కెళ్తే ఇబ్బందులు వస్తాయని అన్నారని.. కానీ ఆనాటి డైలాగ్ డెలివరీతో ఆ సన్నివేశం ఎంతో పండిందని ఆయన చెప్పారు. ``ప్రతి ఊరికీ ఒక దారి ఉంటుంది.. ప్రతి దారికి ఒక అడ్డదారి ఉంటుంది`` అనే డైలాగ్ ద్వారా నాటి జ్ఞాపకాలను ఆయన షేర్ చేసారు. జ‌య‌ప్ర‌ద‌- మోహ‌న్ బాబు మ‌ధ్య ప‌రిహాసం వేదిక‌పై అంద‌రినీ న‌వ్వించింది. మోహ‌న్ బాబు ఛ‌మ‌త్కార‌మైన మాట తీరు అంద‌రినీ ప‌ర‌వ‌శుల్ని చేసింది.

అసలు భక్తవత్సలం నాయుడు అనే ఒక సామాన్యుడు మోహన్ బాబుగా ఎలా మారారో వివరిస్తూ తన గురువుగారైన దర్శకరత్న దాసరి నారాయణరావు గారిని ఆయన స్మరించుకున్నారు. ఎక్కడో ఉండే తనను వెతికి పట్టుకుని.. పేరు మార్చి.. సినీ రంగానికి పరిచయం చేసింది దాసరి గారేనని ఆయన కృతజ్ఞత చాటుకున్నారు. ఒక విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, చివరకు హీరోగా ఎదిగేలా ప్రోత్సహించిన తన గురువును మోహన్ బాబు తన తండ్రిగా అభివర్ణించారు.

డైలాగ్ డెలివరీలో మోహన్ బాబుకు ఉన్న ప్రత్యేక శైలి వెనుక దాసరి గారి శిక్షణ ఎంతో ఉందని ఆయన తెలిపారు. ``డైలాగ్ ఎలా చెప్పాలి? ఏ పదానికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి?`` అనే విషయాలను తనకు నేర్పించింది తన గురువు గారేనని ఆయన స్పష్టం చేశారు. దాసరి గారి గురించి చెప్పాలంటే ఒక పుస్తకమే సరిపోదని.. తన ఎదుగుదలలో ఆయన పాత్ర వెలకట్టలేనిదని మోహన్ బాబు ఉద్వేగానికి లోనయ్యారు.

తెలుగు సినీ చరిత్రలో దాసరి నారాయణరావు - మోహన్ బాబులది ఒక అరుదైన గురుశిష్యుల బంధం. ఒక సాధారణ వ్యక్తిని స్టార్ హీరోగా తీర్చిదిద్దడంలో దాసరి గారు చూపిన ప్రోత్సాహం... గురువుపై మోహన్ బాబుకు ఉన్న అచంచలమైన భక్తి నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తాయి. జయప్రద, జయసుధ వంటి అగ్ర కథానాయికలతో పనిచేసిన కాలం నాటి అనుభవాలు మోహన్ బాబు సినీ ప్రయాణంలో మైలురాళ్లుగా నిలిచిపోయాయి.