అల్లు కనకరత్నమ్మ మృతి పట్ల ప్రధాని సంతాపం
అల్లు అరవింద్ తల్లి, దివంగత అల్లు రామలింగయ్య సతీమణి అల్లు కనకరత్నమ్మ ఇటీవలే ఈ లోకాన్ని విడిచి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.
By: Sravani Lakshmi Srungarapu | 4 Sept 2025 11:38 AM ISTఅల్లు అరవింద్ తల్లి, దివంగత అల్లు రామలింగయ్య సతీమణి అల్లు కనకరత్నమ్మ ఇటీవలే ఈ లోకాన్ని విడిచి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న కనకరత్నమ్మ గత శనివారం వేకువఝామున 2 గంటల ప్రాంతంలో తన తుదిశ్వాసను విడిచారు. కనకరత్నమ్మ మృతి పట్ల టాలీవుడ్ సెలబ్రిటీలతో పాటూ తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులు ఎందరో సంతాపాన్ని తెలియచేశారు.
అల్లు కనకరత్నమ్మ మృతి పట్ల ప్రధాని సంతాపం
కాగా తాజాగా అల్లు కనకరత్నమ్మ మరణం పట్ల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, అల్లు కుటుంబానికి సానుభూతిని తెలియచేశారు. కనకరత్నమ్మ గారి మరణ వార్త తనకు చాలా బాధగా అనిపించిందని, ఆమె మరణం అల్లు ఫ్యామిలీకి తీరని లోటని, కుటుంబాన్ని ముందుకు నడిపించడంలో ఆమె పోషించిన పాత్ర, ఆమె చూపిన ప్రేమ ఎప్పటికీ గుర్తుండిపోతాయన్నారు.
ఎంతో మందికి స్పూర్తి
కనకరత్నమ్మ గారు తన కళ్లను దానం చేయడం చాలా గొప్ప విషయమని, చనిపోతూ కూడా మరో జీవితానికి వెలుగునిచ్చి ఎంతో మందికి స్పూర్తిగా నిలిచారని, ఈ కష్ట సమయంలో అల్లు కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నానంటూ మోదీ ఓ సందేశాన్ని పంపగా, ప్రధాని తెలిపిన సంతాప సందేశానికి అల్లు అరవింద్ కృతజ్ఞతలు తెలిపారు.
మీ మాటలు ఎంతో ఓదార్పునిచ్చాయి
నా తల్లి మరణం సందర్భంగా మీరు అందించిన సందేశానికి నా తరపున, నా కుటుంబం తరుపున మీకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నా, మీరు చెప్పిన మాటలు ఎంతో ఓదార్పుగా మా మనసుల్ని ఎంతగానో కదిలించాయని, ఆమె జ్ఞాపకాలను మీరు గౌరవంతో సత్కరించడం మా ఫ్యామిలీ మొత్తానికి చాలా ఓదార్పునిస్తుందని, మీ మెసేజ్ మా కుటుంబానికి మరింత బలాన్నిస్తుందని తెలుపుతూ ప్రధానికి అరవింద్ నోట్ లో రాశారు.
