వారణాసి BGM: MM కీరవాణి ముందున్న 10 పెను సవాళ్లు!
విజనరీ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్‌స్టార్ మహేష్ బాబు క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న అంతర్జాతీయ అడ్వెంచర్ చిత్రం `వారణాసి` షూటింగ్ శరవేగంగా ముగింపు దశకు చేరుకుంటోంది.
By: Sivaji Kontham | 28 July 2026 9:09 AM ISTవిజనరీ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్‌స్టార్ మహేష్ బాబు క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న అంతర్జాతీయ అడ్వెంచర్ చిత్రం `వారణాసి` షూటింగ్ శరవేగంగా ముగింపు దశకు చేరుకుంటోంది. మరో 80 రోజుల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉందని సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి ప్రొడక్షన్ వర్క్ పూర్తవుతుందని రాజమౌళి ఇటీవల వెల్లడించారు. దీనికి తోడు ఈ చిత్రానికి సంబంధించి దాదాపు ఐదు నెలల పాటు సుదీర్ఘంగా సాగే రీరికార్డింగ్ (బ్యాక్‌గ్రౌండ్ స్కోర్) పనులు సెప్టెంబర్ నుండి ప్రారంభమవుతాయని ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి ప్రకటిస్తూ.. ఈ ప్రాజెక్ట్ ఎంత ప్రతిష్టాత్మకంగా రూపకల్పన జరుగుతోందో స్పష్టం చేశారు. అయితే షూటింగ్ సంగతి ఎలా ఉన్నా.. మరకతమణి ఎం.ఎం.కీరవాణి ముందు పెను సవాల్ ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇటీవలి కాలంలో భారతీయ సినిమా రీరికార్డింగ్ ప్రమాణాలు హాలీవుడ్ స్థాయిని తాకుతున్నాయి. అనిరుధ్ రవిచందర్, తమన్, వివేక్ సాగర్, సంతోష్ నారాయణన్ వంటి నేటితరం యంగ్ మ్యూజిక్ డైరెక్టర్లు తమ సరికొత్త ఎలక్ట్రానిక్ ట్యూన్లు, హై-వోల్టేజ్ ఎలివేషన్లతో థియేటర్లలో సరికొత్త ఊపు తెస్తున్నారు. కీరవాణి వారసుడే అయిన కాలభైరవ సైతం ఎంతో సృజనాత్మక ట్యూన్లు, రీరికార్డింగ్ తో మైమరిపిస్తున్నారు. మరోవైపు ఎ.ఆర్. రెహమాన్ వంటి దిగ్గజాలు తమ క్లాసిక్ క్వాలిటీతో ఆల్ టైమ్ అలరిస్తున్నారు. ఈ హోరాహోరీ పోటీ వాతావరణంలో, తన మునుపటి ఘనతలను మించి నేటితరం ట్రెండ్‌కు ధీటుగా నిలబడటం, అంతర్జాతీయ అంచనాలను అందుకోవడం కీరవాణికి కెరీర్‌లోనే ఒక అతిపెద్ద సవాల్.
బాహుబలి, ఆర్‌ఆర్ఆర్ చిత్రాలను మించిన వందరెట్ల నాణ్యమైన రీరికార్డింగ్‌ను`వారణాసి` కోసం అందించాలని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇళయరాజా, రెహమాన్ ల ప్రయోగాత్మక పంథాను అనుసరిస్తూ హాలీవుడ్ స్టాండర్డ్స్ ప్రతి ఫ్రేమ్‌లోనూ కుదిరేలా కీరవాణి మ్యాజిక్ చేయాల్సి ఉంటుంది. ఈ 5 నెలల సుదీర్ఘ ప్రయాణంలో ఆయన ఎదుర్కోబోతున్న సవాళ్ల గురించి మ్యూజిక్ ప్రపంచంలో చాలా చర్చ సాగుతోంది.
ప్రాజెక్ట్ స్థాయికి తగ్గట్టుగా...!
గ్లోబల్ అడ్వెంచర్ చిత్రం `వారణాసి` నేపథ్య సంగీతం కోసం ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి ఏకంగా ఐదు నెలల సుదీర్ఘ కాలాన్ని కేటాయించడమే ఈ ప్రాజెక్ట్ స్థాయిని తెలియజేస్తోంది. ఈ పీరియడ్‌లో ఆయన ముందు ప్రధానంగా 10 అతిపెద్ద సవాళ్లు నిలిచాయి. హన్స్ జిమ్మర్, జాన్ విలియమ్స్ వంటి హాలీవుడ్ దిగ్గజాల స్థాయి `గ్లోబల్ సౌండింగ్` సాధించడం మొదలుకొని... సనాతన వేద మంత్రాలు - శంఖారావాలను ఆధునిక పాశ్చాత్య సింఫనీతో మేళవించడం వరకు ప్రతి అంశం క్లిష్టమైనదే. అంతేకాకుండా.. తను గతంలో అందించిన బాహుబలి, ఆర్‌ఆర్ఆర్ వంటి ఆల్-టైమ్ బెస్ట్ సినిమాలను మించేలా రీరికార్డింగ్ చేయడం, నేటితరం యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ల హెవీ బేస్ ఎలివేషన్లకు ధీటుగా తన క్లాసికల్ శైలికి కొత్త ఎనర్జీని జోడించడం కీరవాణికి నిరంతర పరీక్షగా భావించాలి. గ్లోబల్ స్థాయిలో మహేష్ బాబు ప్రెజెన్స్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లే ప్రత్యేక ఐకానిక్ థీమ్‌ను డిజైన్ చేయడంతో పాటు.. ఈ ఐదు నెలల కాలంలో ప్రతి సీన్ మైక్రో-డీటెయిలింగ్‌తో బోర్ కొట్టకుండా క్రియేటివిటీతో నిలబెట్టుకోవాల్సి ఉంది.
మరొకవైపు సంగీత దిగ్గజాలు ఇళయరాజా, ఎ.ఆర్. రెహమాన్ ల ప్రయోగాత్మక పంథాను స్ఫూర్తిగా తీసుకుంటూ మునుపెన్నడూ వినని సరికొత్త సౌండింగ్‌ను ఆవిష్కరించడం ఈ ప్రాజెక్ట్ ఆవశ్యకత. రాజమౌళి సినిమాల్లోని అసాధారణ భావోద్వేగాలు.. భారీ యాక్షన్ ఘట్టాల మధ్య స్కోర్ ఏమాత్రం ల్యాగ్ లేకుండా బ్యాలెన్స్ చేయడం.. అలాగే పాశ్చాత్య సింఫనీతో భారతీయ సంప్రదాయ వాయిద్యాలైన నగారా, తబలాలను మిళితం చేస్తూ అంతర్జాతీయ ప్రమాణాలకు తగినట్లు మిక్సింగ్ చేయడం సాంకేతికంగా అత్యంత క్లిష్టమైన ప్రక్రియ.
మేటి హాలీవుడ్ క్లాసిక్స్ తరహాలో `వారణాసి` పేరు వినగానే శతాబ్దాల పాటు గుర్తుండిపోయే ఒక ఐకానిక్ మెలోడీ లేదా థీమ్‌ను సృష్టించడం ఆయన ముందున్న మరో ప్రధాన సవాలు. ఏది ఏమైనా... తన అద్భుతమైన ప్రతిభతో ఈ సవాళ్లన్నింటినీ అధిగమించి ఎం.ఎం. కీరవాణి ఈ ఐదు నెలల రీరికార్డింగ్‌తో భారతీయ నేపథ్య సంగీతాన్ని ప్రపంచ వేదికపై సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తారని సినీ ప్రియులు ఆశిస్తున్నారు.
