Begin typing your search above and press return to search.

'లిటిల్ హార్ట్స్' మ్యాజిక్ రిపీటవుతుందా?

ఇప్పుడు తన బేనర్లో రాబోతున్న తర్వాతి సినిమాకు కూడా ఇదే ట్రెండును ఫాలో అవుతున్నాడు బన్నీ వాసు.

By:  Garuda Media   |   13 Oct 2025 10:14 AM IST
లిటిల్ హార్ట్స్ మ్యాజిక్ రిపీటవుతుందా?
X

ఈ మధ్య కాలంలో చిన్న సినిమాల్లో పెద్ద సెన్సేషన్ అంటే.. ‘లిటిల్ హార్ట్స్’ అనే చెప్పాలి. కేవలం రెండున్నర కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. రూ.50 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్ రాబట్టడం అంటే మామూలు విషయం కాదు. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ భాగస్వామ్యంతో ‘నైంటీస్ మిడిల్ క్లాస్’ దర్శకుడు ఆదిత్య హాసన్ ప్రొడ్యూస్ చేశాడు. ఐతే ఈ సినిమా పేరున్న నిర్మాత చేతిలో పడితే రీచ్ పెరుగుతుందని బన్నీ వాసును ఆశ్రయించారు.

మరో యువ నిర్మాత వంశీ నందిపాటి మధ్యవర్తిగా వ్యవహరించారు. వీళ్లందరూ కలిసి సినిమాను రిలీజ్ చేస్తే అది బాక్సాఫీస్ దగ్గర సంచలనం రేపింది. ఘాటి, మదరాసి లాంటి పెద్ద సినిమాలతో పోటీ పడి ఇది ఎవ్వరూ ఊహించని విజయాన్నందుకుంది. ఈ చిత్రానికి ముందు రోజే పెయిడ్ ప్రిమియర్స్ వేయడం బాగా కలిసొచ్చింది. అక్కడి నుంచే పాజిటివ్ టాక్ మొదలై.. సినిమా ఊహించని స్థాయికి వెళ్లింది.

ఇప్పుడు తన బేనర్లో రాబోతున్న తర్వాతి సినిమాకు కూడా ఇదే ట్రెండును ఫాలో అవుతున్నాడు బన్నీ వాసు. ఆయన ప్రొడ్యూస్ చేసిన ‘మిత్రమండలి’ సినిమాకు ఒక రోజు ముందే పెయిడ్ ప్రిమియర్స్ వేయబోతున్నాడు బన్నీ వాసు. దీపావళి రేసులో ముందుగా రానున్న సినిమా ఇదే. 16న రిలీజ్. ఐతే ముందు రోజు రాత్రి పెయిడ్ ప్రిమియర్స్ పడబోతున్నాయి. రేపే బుకింగ్స్ మొదలుపెట్టనున్నారు.

హైదరాబాద్, విజయవాడ, వైజాగ్.. ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో డిమాండును బట్టి షోలు వేయనున్నారు. టీజర్, ట్రైలర్ ఫుల్ ఫన్నీగా సాగడంతో యూత్‌లో ఈ చిత్రంపై మంచి బజ్‌యే ఉంది. పెయిడ్ ప్రిమియర్స్‌కు రెస్పాన్స్ కూడా బాగానే ఉంటుందని ఆశిస్తున్నారు. దీపావళి రేసులో ఇంకో మూడు సినిమాలున్న నేపథ్యంలో ముందే ప్రిమియర్స్ వేయడం ద్వారా అడ్వాంటేజీ తీసుకోవాలని ‘మిత్రమండలి’ టీం భావిస్తోంది. మరి ‘లిటిల్ హార్ట్స్’ మ్యాజిక్‌ను ‘మిత్రమండలి’ రిపీట్ చేస్తుందేమో చూడాలి.