వేదికపై జారిపడ్డ మిస్ జమైకా ప్రస్తుత స్టాటస్
అందాల రాణాలు వేదికలపై వయ్యారంగా నడుచుకుంటూ వెళ్లడం చూపరులకు చాలా సులువుగా కనిపించవచ్చు.
By: Sivaji Kontham | 25 Nov 2025 5:04 PM ISTఅందాల రాణాలు వేదికలపై వయ్యారంగా నడుచుకుంటూ వెళ్లడం చూపరులకు చాలా సులువుగా కనిపించవచ్చు. కానీ ఇది అందాల రాణులను ఒక్కోసారి తీవ్ర ఒత్తిడిలోకి తీసుకుని వెళ్లొచ్చు. చాలా సందర్భాలలో వార్డ్ రోబ్ మాల్ ఫంక్షన్ (దుస్తులు జారిపోవడం) వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. కానీ ఇక్కడ అలాంటి సమస్య కాదు.. అంతకుమించి.. మిస్ జమైకా గాబ్రియెల్ హెన్రీ వేదికపై ప్రదర్శన ఇస్తున్న సమయంలో భయానకంగా జారి పడ్డారు. అలా హంసలా హొయలు పోతూ నడుచుకుంటూ ప్రదర్శన ఇస్తున్న మిస్ హెన్రీ వేదిక అంచుపై అడుగు వేసి జారి పడిపోయారు. ఆ సమయంలో ఎంతో వేగంగా తన తల భాగం వేదికకు ఢీకొట్టినట్టు వీక్షకులకు అర్థమవుతోంది.
ఈ వేదిక నుంచి హెన్రీని నేరుగా ఆస్పత్రి ఐసియుకి చేర్చింది కార్యకర్తల బృందం. ఇది నిజంగా ఊహించని ఘటన. భయానక ఘటన అని అభివర్ణించడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మిస్ జమైకాను పర్యవేక్షించేందుకు మిస్ యూనివర్స్ అధ్యక్షుడు రౌల్ రోచా రేయింబవళ్లు ఆస్పత్రి వద్దనే ఉన్నానని తెలిపారు.
తాజాగా మిస్ జమైకా గాబ్రియెల్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కి రెడీ అవుతోంది. ఎలాంటి సమస్యా లేదని ఆయన ప్రకటించారు. మిస్ జమైకా 2025, గాబ్రియెల్ హెన్రీ గత వారం థాయిలాండ్‌లో జరిగిన మిస్ యూనివర్స్ ప్రాథమిక రౌండ్ల సమయంలో ఊహించని విధంగా కింద పడిపోయారు. మిస్ గాబ్రియెల్ కింద పడిన తర్వాత ఆస్పత్రిలో తెరవెనక ఏం జరిగిందో రౌల్ రోచా వివరించారు. చివరికి ప్రమాదం నుంచి ఆమె బయటపడింది. డిశ్చార్జ్ కావడానికి ఇంకెంతో సమయం పట్టదని తెలిపారు.
బ్యాంకాక్‌లోని ఇంపాక్ట్ అరీనాలో నవంబర్ 19న సాయంత్రం గౌను విభాగంలో ర్యాంప్ వాక్ చేస్తుండగా ఈ సంఘటన జరిగింది. అందుకు సంబంధించిన వీడియోలు వేగంగా వైరల్ అయ్యాయి. ఆమె వేదిక అంచు నుండి జారిపడిన క్షణం, అందాల పోటీట నిర్వాహకుల బృందం వేగంగా వ్యవహరించిందని అధ్యక్షుడు రోచా తెలిపారు. ఆమె భద్రత ఆరోగ్యాన్ని నిర్ధారించడానికి తక్షణ చర్య తీసుకున్నాం.. వైద్య సహాయం చేయడానికి నేను వ్యక్తిగతంగా సహకరించానని తెలిపారు. అత్యవసర వైద్య సంరక్షణను సమన్వయం చేసాను.. ఆసుపత్రికి వెంటనే తరలించడాన్ని పర్యవేక్షించాను అని తెలిపారు. రోల్ రోచా ఆసుపత్రిలో ఆమెతోనే ఉండిపోయానని, ఆమె కుటుంబంతో నేరుగా మాట్లాడానని కూడా తెలిపారు. సాధ్యమైనంత ఉత్తమమైన సంరక్షణ లభించేలా చూసుకోవడానికి, అదనపు వైద్య తనిఖీలను సిఫార్సు చేసినట్టు తెలిపాడు. ఈ కాలంలోని అన్ని ఖర్చులను కూడా సంస్థ భరించిందని ధృవీకరించింది. ఇందులో ఆమె కుటుంబానికి హోటల్ బసలు, రవాణా, విమాన మార్పులు సిబ్బంది ఖర్చులు కూడా ఉన్నాయి.
