'మీర్జాపూర్' లా ధైర్యం చేసే దమ్మెంత ఎంత మందిలో ఉంది?
డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో సుదీర్ఘంగా సాగే వెబ్ సిరీస్‌లను మూడు గంటల సినిమాగా మలచడం అనేది చిన్న విషయం కాదు.
By: Srikanth Kontham | 8 Sept 2026 11:00 PM ISTడిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో సుదీర్ఘంగా సాగే వెబ్ సిరీస్‌లను మూడు గంటల సినిమాగా మలచడం అనేది చిన్న విషయం కాదు. ఎంతో రిస్క్ తో కూడిన వ్యవహారం. ఏమాత్రం తేడా కొట్టినా? వెబ్ సిరీస్ ని చెడదీసారు అనే నింద మోయాల్సి వస్తుంది. అయితే హిందీ పాపులర్ క్రైమ్ డ్రామా `మీర్జాపూర్` మేకర్స్ ఈ సవాలును స్వీకరించి బాక్సాఫీస్ వద్ద విజయం సాధించారు. ఓటీటీలో 14 గంటల నిడివితో మూడు సీజన్లుగా అలరించిన మీర్జాపూర్ ను మూడు గంటల థియేట్రికల్ సినిమాగా మలచి వందల కోట్ల వసూళ్లతో గ్రాండ్ విక్టరీ కొట్టడం భారతీయ సినీ చరిత్రలోనే సరికొత్త అధ్యాయానికి తెర తీసింది.
ఓటీటీలో విడుదలైన సిరీస్‌లను ప్రేక్షకులు ఇప్పటికే ఇళ్లలోని చిన్న తెరలపై వీక్షించారు. అలాంటి కథను మళ్లీ డబ్బులు పెట్టి థియేటర్లలో చూస్తారా? అనే సందేహాలను మీర్జాపూర్ చిత్రం పూర్తిగా పటాపంచలు చేసింది. కేవలం ఓటీటీ వీక్షకులను మాత్రమే కాకుండా థియేటర్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేలా స్క్రీన్‌ప్లేను తీర్చిదిద్దడం, లార్జర్ ద్యాన్ లైఫ్ విజువల్ ఎఫెక్ట్స్ , థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించడమే ఈ సినిమా సాధించిన ఘన విజయానికి ప్రధాన కారణం.
14 గంటల కంటెంట్‌ను ఏ మాత్రం స్వారస్యం తగ్గకుండా పాత్రల ఉద్వేగాలను చెడగొట్టకుండా కేవలం 3 గంటల సునిశితమైన డ్రామాగా కుదించడం మామూలు విషయం కాదు. ప్రతి పాత్ర నేపథ్యం, కథలోని మలుపులను థియేటర్ సీట్లకు హత్తుకునేలా ఎడిట్ చేసి సమర్పించడంలో దర్శకు,రచయితల ప్రతిభ స్పష్టంగా కనిపిస్తుంది. కథపై, కంటెంట్‌పై ఉన్న బలమైన నమ్మకమే వారిని ఈ నిర్ణయం దిశగా నడిపించి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించేలా చేసింది.
అయితే మీర్జాపూర్ సాధించిన ఘనవిజయం తర్వాత ఇప్పుడు పరిశ్రమలో మరో ప్రశ్న మొదలైంది. ఇలాంటి సాహసోపేతమైన ప్రయోగం చేసే ధైర్యం, దమ్ము ఇంకెంతమంది దర్శకులకు ఉందనేది ఆసక్తికరంగా మారింది. దేశంలో `ది ఫ్యామిలీ మ్యాన్`, `పా తాళ్ లోక్`, `స్క్యామ్ 1992`, టాలీవుడ్‌లో వచ్చిన `సేక్రెడ్ గేమ్స్` వంటి ఎన్నో విజయవంతమైన సిరీస్‌లు ఉన్నాయి. కానీ వాటిని బిగ్ స్క్రీన్ ఫార్మాట్‌కు తగ్గట్టుగా మార్చి విడుదల చేసే ఆలోచన చాలామందికి ఇంకా రావడం లేదు.
వెబ్ సిరీస్‌ను సినిమాగా మార్చడానికి కేవలం కథ ఉంటే సరిపోదు. దానికి విపరీతమైన మాస్ ఫాలోయింగ్, థియేటర్‌కు వచ్చేంత క్రేజ్ ఉన్న పాత్రలు, విజువల్ గ్రాండ్‌నెస్ అవసరం. కథలోని కోర్ ఎమోషన్‌ను దెబ్బతీయకుండా వేగవంతమైన కథనంతో రూపుదిద్దే నేర్పు ఉన్న దర్శకులే ఈ ప్రయత్నంలో నెగ్గుకొరాగలరు. లేకపోతే ఓటీటీ కంటెంట్‌నే మళ్లీ థియేటర్లలో రుద్దారు అనే విమర్శలు ఎదుర్కొనే ప్రమాదం ఉంది.
ఏది ఏమైనా `మీర్జాపూర్` సాధించిన విజయం భారతీయ సినిమా రంగంలో సరికొత్త ట్రెండ్‌కు పునాది వేసింది. భవిష్యత్తులో డిజిటల్ దునియా నుంచి థియేటర్లకు వచ్చే సినిమాల సంఖ్య పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. రిస్క్ అని తెలిసినా కంటెంట్‌పై నమ్మకంతో ముందడుగు వేసే దార్శనికత ఉన్న దర్శకులు మరింతమంది ముందుకు వస్తే భారతీయ బాక్సాఫీస్ వద్ద మరిన్ని వినూత్నమైన రికార్డులు నమోదవ్వడం ఖాయం.
