మీర్జాపూర్ : సిరీస్ మాదిరిగానే సినిమా కూడా..!
హిందీ ఓటీటీ ప్రేక్షకులు మాత్రమే కాకుండా అన్ని భాషల ఓటీటీ ప్రేక్షకులకు మీర్జాపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు.
By: Ramesh Palla | 9 Sept 2026 5:00 PM ISTహిందీ ఓటీటీ ప్రేక్షకులు మాత్రమే కాకుండా అన్ని భాషల ఓటీటీ ప్రేక్షకులకు మీర్జాపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఇండియాలో అత్యధికంగా చూడబడ్డ ఓటీటీ కంటెంట్ జాబితాలో మీర్జాపూర్ ముందు వరుసలో ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ వెబ్ సిరీస్‌లోని పాత్రలు సైతం మంచి ప్రాచుర్యం పొందాయి. అందులో నటించిన నటీనటులు సినిమాల్లో నటిస్తున్నారు. మీర్జాపూర్ తెచ్చి పెట్టిన గుర్తింపుతో స్టార్స్‌గా వెలిగి పోతున్న వారు చాలా మంది ఉన్నారు. మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఇప్పటి వరకు మూడు సీజన్‌లు వచ్చిన విషయం తెల్సిందే. నాల్గవ సీజన్ కోసం అంతా ఎదురు చూస్తున్న సమయంలో మీర్జాపూర్ టీం నుంచి ఈసారి సిరీస్ కాకుండా సినిమా రాబోతుందనే ప్రకటన వచ్చింది. అన్నట్లుగానే మీర్జాపూర్ సినిమాను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం కూడా జరిగింది.
మీర్జాపూర్ సినిమా రివ్యూ...
మీర్జాపూర్ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. సినిమాకు పెద్దగా పబ్లిసిటీ చేయకుండానే మీర్జాపూర్ వెబ్ సిరీస్ కి ఉన్న క్రేజ్ నేపథ్యంలో సినిమాను థియేటర్‌లలో జనాలు ఎగబడి చూశారు. మొదట మీర్జాపూర్ వెబ్ సిరీస్‌లోని ఎపిసోడ్స్‌ను రీ ఎడిట్ చేసి సినిమాగా తీసుకు వస్తున్నారని అంతా భావించారు. కానీ పూర్తిగా కొత్త కథతో, అంతా షూటింగ్ చేసి మీర్జాపూర్‌ను సినిమాగా విడుదల చేయడం జరిగింది. అయితే మీర్జాపూర్ వెబ్ సిరీస్‌లోని పాత్రలను సినిమాలో తీసుకోవడం వల్ల వెబ్ సిరీస్ చూసిన వారు బాగా కనెక్ట్ అవుతారు. వెబ్ సిరీస్ చూడని వారికి సైతం కొత్తగా అనిపించకుండా క్లారిటీగానే సినిమాను తీసినట్టుగా రివ్యూలు వచ్చాయి. మీర్జాపూర్ మూవీకి మొదటి వారం రోజుల్లో దాదాపుగా రూ.100 కోట్ల వసూళ్లు నమోదు అయ్యాయి. దాంతో సిరీస్‌కు మాత్రమే కాకుండా సినిమాకు సైతం ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతారు అని మేకర్స్ కి క్లారిటీ వచ్చింది.
ది మీర్జాపూర్ వెబ్ సిరీస్‌కి దర్శకత్వం...
సినిమాకు వస్తున్న స్పందన నేపథ్యంలో మేకర్స్ సీక్వెల్‌కు ప్లాన్ చేస్తున్నారు. మీర్జాపూర్ సినిమా కథను వెబ్ సిరీస్ సీజన్ 1 లోని ఎపిసోడ్ 6 తర్వాత జరిగే సంఘటనల ఆధారంగా రాసుకోవడం జరిగింది. ఎపిసోడ్ 7 కంటే ముందు ఏం జరుగుతుంది అనేది సినిమా కథగా చెప్పారు. వెబ్ సిరీస్ కథ మధ్యలో కొన్ని సంఘటనలు తీసుకుని పూర్తి స్థాయి కథగా రాసుకుని సినిమాను తీయడం జరిగింది. మేకర్స్ ఇప్పుడు మీర్జాపూర్ సినిమాకు సీక్వెల్ అనుకుంటున్నారు. కనుక కథ ఎక్కడ నుంచి తీసుకుంటారు అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. సినిమా కథను సీజన్ 1 ఎపిసోడ్ 7 వరకు తీసుకు రావడం జరిగింది. కనుక సినిమా కథకు కంటిన్యూ చేసే అవకాశం లేదు. కనుక మళ్లీ ఏదైనా సీజన్‌లోని రెండు ఎపిసోడ్స్ మధ్య లేదా సీజన్‌ల మధ్య ఒక కథను క్రియేట్ చేసి సీక్వెల్‌ను ప్లాన్ చేయాల్సి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మీర్జాపూర్ సీక్వెల్‌పై అప్‌డేట్...
మీర్జాపూర్ సినిమాకు గుర్మీత్ సింగ్ దర్శకత్వం వహించాడు. పునీత్ కృష్ణ రాసిన కథను మీర్జాపూర్ ను అభిమానించే వారు ఎక్కడ డిస్పపాయింట్ కాకుండా జాగ్రత్తగా సినిమాగా రూపొందించడం జరిగింది. సినిమా కోసం కూడా సిరీస్‌లో నటించిన వారిని తీసుకోవడం ద్వారా మరింతగా మీర్జాపూర్ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతోంది. ఒక సిరీస్ నుంచి సినిమాను తీయడం అనేది చాలా అరుదుగా జరిగే విషయం. ఇప్పటికే ప్రాచుర్యం పొంది ఉన్న వెబ్ సిరీస్ కథకు లింక్ చేస్తూ, వారే నటీనటులతో సినిమాను చేయడం ద్వారా ప్రకటించిన సమయంలోనే సినిమా మినిమం హిట్ సాధించినట్లు అయింది అనేది చాలా మంది అభిప్రాయం. ఇప్పుడు సీక్వెల్ అంటున్న నిర్మాతలు అదే నమ్మకంతో ముందుకు సాగుతున్నారు. ఎలా అయితే సిరీస్‌ను వరుస సీజన్‌లుగా తీసుకు వచ్చామో అలాగే సినిమాను సైతం వరుస సీక్వెన్స్‌తో తీయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి సీక్వెల్ కి ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి.
