మిరాయ్ మరో హను మాన్ అవుతుందా?
ఒకప్పుడు సినిమాలు హిట్ అవాలంటే అందులో స్టార్లు ఉండాల్సిందే. కానీ ఇప్పుడు రోజులు మారాయి. ఒకప్పటిలా ఇప్పుడు స్టార్ క్యాస్టింగ్‌కు పెద్ద పీట వేయడం లేదు ఆడియన్స్
By: Sravani Lakshmi Srungarapu | 31 Aug 2025 8:00 AM ISTఒకప్పుడు సినిమాలు హిట్ అవాలంటే అందులో స్టార్లు ఉండాల్సిందే. కానీ ఇప్పుడు రోజులు మారాయి. ఒకప్పటిలా ఇప్పుడు స్టార్ క్యాస్టింగ్‌కు పెద్ద పీట వేయడం లేదు ఆడియన్స్. చిన్న సినిమాలైనా అందులో కంటెంట్ ఉండి, బావుంటే ఆడియన్స్ థియేటర్లకు వచ్చి వాటికి బ్రహ్మరథం పడుతున్నారు. ఈ కోవలో ఇప్పటికే ఎన్నో సినిమాలు రిలీజవగా, ఇప్పుడు మరో సినిమా వస్తోంది. అదే మిరాయ్.
మిరాయ్ అంటే ఏంటనే ఆసక్తి
తేజా సజ్జా, మంచు మనోజ్, శ్రియా శరణ్ కీలక పాత్రల్లో నటించిన మిరాయ్ కు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. రీసెంట్ గా చిత్ర ట్రైలర్ రిలీజవగా దానికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో పాటూ సినిమాపై విపరీతమైన ఆసక్తిని పెంచేలా చేసింది ట్రైలర్. అయితే మూవీ టైటిల్ ను అనౌన్స్ చేసినప్పటి నుంచి రీసెంట్ గా ట్రైలర్ రిలీజయ్యాక కూడా అసలు మిరాయ్ అంటే ఏంటని ఆడియన్స్ ఇంటర్నెట్ లో తెగ వెతికేస్తున్నారు.
ఎన్నో నేర్చుకుని మరీ..
మిరాయ్ అనేది ఓ జపనీస్ పదమట. ఫ్యూచర్ కోసం హోప్ అని అర్థమొస్తుందట. ఇందులో హీరో యోధుడిగా ఫ్యూచర్ కోసం ఏం చేశాడనే నేపథ్యంలో ఈ సినిమాను డైరెక్టర్ తెరకెక్కించారు. మిరాయ్ అనేది అశోకుని కాలంలో రహస్యమైన ఓ శాసనమని, ఈ స్టోరీ కోసం చాలా అంశాలు నేర్చుకుని చేసినట్టు చిత్ర యూనిట్ ఇప్పటికే పలుమార్లు తెలిపింది.
విజువల్స్ విషయంలో స్పెషల్ కేర్
ఈగల్ సినిమా ఫ్లాప్ తర్వాత కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇదే. ఈగల్ బాక్సాఫీస్ వద్ద సరిగా వర్కవుట్ అవకపోవడంతో ఈ సినిమా కోసం కార్తీక్ మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నారట. దాంతో పాటూ కార్తీక్ స్వతహాగా సినిమాటోగ్రాఫర్ అవడంతో మిరాయ్ విజువల్స్ విషయంలో చాలా స్పెషల్ కేర్ తీసుకుని మరీ వర్క్ చేసినట్టు చెప్పగా, రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ లోని విజువల్స్ ఆ విషయం నిజమని నమ్మేలా చేశాయి.
హను మాన్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అందుకున్న తేజ సజ్జ ఆ సినిమా కంటే ముందుగానే మిరాయ్‌ను ఓకే చేశారు. ట్రైలర్ చూస్తుంటే మిరాయ్ కూడా హను మాన్ తరహాలోనే తక్కువ బడ్జెట్ లో హను మాన్ లాంటి క్వాలిటీ అవుట్‌పుట్ తో వస్తున్నట్టు అర్థమవుతుంది. ఫాంటసీ థ్రిల్లర్ గా వస్తోన్న ఈ మూవీలో 1600కి పైగా సీజీ షాట్స్ ను వాడినట్టు చెప్తున్నారు. సెప్టెంబర్ 12న మిరాయ్ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుండగా, సినిమా అందరూ చూడాలనే ఆలోచనతో రేట్లు ఏ మాత్రం పెంచకుండానే సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుందట.
